స్వలింగ సంపర్కుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల విధానాలు ముందుకువస్తున్నాయి. అనేక దేశాల్లో వారి వివాహాలకు చట్టబద్ధత ఏర్పడింది. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో పిల్లలను కనడం లేదా దత్తత తీసుకోవడం విషయంలోనూ సానుకూల నిబంధనలున్నాయి. భారత్‌లోనూ అదే తరహా వ్యవస్థ రావాలని కాంక్షించిన ఇక్కడి స్వలింగ సంపర్కులకు సుప్రీంకోర్టు నిరాశ కలిగించింది. వివాహ హక్కుల కోసం వారు జరిపిన సుదీర్ఘ న్యాయపోరాటానికి చుక్కెదురైంది. కాలం చెల్లిపోయిన చట్టాలను తొలగించి, మారిన పరిస్థితులకు అనుగుణంగా కొత్తకొత్త చట్టాలు మన దేశంలోనూ వస్తున్నాయి. అలాగే వ్యక్తిగత హక్కులపై, ఎంపికలపై స్వేచ్ఛాయుతమైన నిర్వచనాలు విస్తరిస్తున్న పరిస్థితులూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రత్యేక వివాహాల చట్టానికి లింగభేదాతీతమైన నిర్వచనం ఇస్తుందని స్వలింగ సంపర్కులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ మధ్య జరిగే వివాహాలకు ప్రత్యేక వివాహాల చట్టంలో గుర్తింపు ఇవ్వాలన్న వారి ప్రధానమైన నివేదనను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆ చట్టంలో ‘ఇద్దరి మధ్య వివాహ బంధం’ అని ఉన్నచోట ‘ఏ లింగానికి చెందిన ఇద్దరైనా’ అనే నిర్వచనం ఇచ్చేందుకు నిరాకరించింది.
ఇద్దరు వ్యక్తుల మధ్యన కుదిరే వివాహబంధాన్ని గుర్తించే ఆ చట్టం కింద తమ వివాహాలనూ చేర్చమని స్వలింగ సంపర్కులు పలు వ్యాజ్యాలు దాఖలుచేసిన సంగతి తెలిసిందే. చట్టం ఆధారంగా మాత్రమే గుర్తింపు ఇవ్వడం సాధ్యమని అనడం ద్వారా ప్రభుత్వ వాదనను బలపరిచినట్టయింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించడమనేది శాసనవ్యవస్థ పరిధిలోని అంశమని ప్రభుత్వం వాదించిన సంగతి తెలిసిందే. అంటే ప్రభుత్వం పూనుకొని ప్రత్యేక చట్టం తెస్తే తప్ప ఈ తరహా వివాహాలకు గుర్తింపురాదని తేలిపోయింది. మతపరమైన, సాంస్కృతికమైన కారణాలతో భారతదేశంలోని వివిధ వర్గాలు స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చట్టం తెచ్చేందుకు ముందుకువచ్చే అవకాశాలు బహు తక్కువగా ఉన్నాయి.
కోర్టు తీర్పులో స్వలింగ సంపర్కులకు కొన్ని ఉపశమనాలూ లేకపోలేదు. వారికి ఒక్కటయ్యే విషయంలో గల హక్కులను గుర్తించడం గమనార్హం. స్వలింగ సంపర్కులకు ఒత్తిడి, బెదిరింపుల్లేకుండా సహజీవనం చేసే హక్కుందని ధర్మాసనం గట్టిగా సమర్థించింది. వివాహం అనేది ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పడం ఈ తీర్పులోని మరో ముఖ్యాంశం. ప్రాథమిక హక్కు కానప్పుడు వివక్ష సమస్య తలెత్తదు, వివక్షను నిరోధించే చట్టాలూ వర్తించవని అర్థం. పిల్లలను దత్తత తీసుకునే హక్కూ వారికి లేదని కోర్టు స్పష్టం చేయడం గమనార్హం. అందరిలాగే తమకూ వివాహ హక్కు ఉండాలన్న ఆకాంక్ష సాకారం చేసుకునేందుకు స్వలింగ సంపర్కులు మరింత సుదీర్ఘమైన పోరాటమే చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు తెలియజేస్తున్నది.