అది 2002.. రష్యా రాజధాని మాస్కో. కిక్కిరిసి ఉండే దుబ్రోవ్కా థియేటర్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఉగ్రవాదులు ప్రేక్షకులను బంధించారు. తమ మాతృభూమి చెచెన్యా నుంచి రష్యా సైన్యాల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లొంగిపోవా లన్న ప్రభుత్వ విజ్ఞప్తులను లెక్కచేయలేదు. దాంతో రంగంలోకి దిగిన భద్రతాదళాలు.. థియేటర్లోకి ఒక రసాయనిక వాయువును పంపిం చి.. లోపలికి చొచ్చుకెళ్లాయి. కొన్ని గంటల తర్వాత చూస్తే ఉగ్రవాదులు మొత్తం 40 మంది చనిపోయారు. బందీలుగా ఉన్న 850 మం దిలో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. ‘ఆపరేషన్ ముగిసింది’ అని ప్రభుత్వం ప్రకటించింది. ఇది పుతిన్ ైస్టెల్. బందీలకు హాని జరుగకుండా ఉగ్రవాదులను హతమార్చటం ఎక్కడైనా మనం చూసే పద్ధతి. కానీ, బందీలు చనిపోయినా ఫర్వాలేదు గానీ.. ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టాల్సిందేనన్నది పుతిన్ పంతం.
ప్రస్తుత ఉక్రెయిన్ సంక్షోభంలో కూడా ఆయన వ్యవహారసరళి ఇలాగే ఉంది. అమెరికా, జర్మనీ, బ్రిటన్ తదితర దేశాలు ఆంక్షలు విధిస్తామని బెదిరించినా లెక్కచేయక ఏకంగా ఉక్రెయిన్‌పైకి సైన్యాల్ని పంపించారు. కారణం, నాటోలో ఉక్రెయిన్ చేరితే ఎప్పటికైనా పక్కలో బల్లెంలా మారుతుందని పుతిన్ భావించటమే. నాటో సైనిక కూటమి నిబంధనల ప్రకారం.. భాగస్వామ్య దేశాల్లో ఏ ఒక్కదేశం యుద్ధాన్ని ఎదుర్కొంటున్నా దానికి మద్దతుగా యావ త్ నాటో సైన్యాలు కదలి రావాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ నాటోలో చేరితే ఇక తమ సరిహద్దుల్లో నాటో సైన్యాల్ని తెచ్చిపెట్టుకోవటమేనని భావించి.. ఎవరి మాటా వినకుండా పుతిన్ ఏకపక్షంగా యుద్ధా నికి దిగారని విశ్లేషకులు అంటున్నారు.
ప్రపంచంలోని అగ్రదేశాల్లో ఒకటైన రష్యాకు తిరుగులేని అధిపతిగా మారిన పుతిన్ చాలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చారు. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్
నగరంలో 1952లో జన్మించారు. తల్లి ఓ ఫ్యాక్టరీలో కార్మికురాలు కాగా.. తండ్రి రష్యా నౌకాదళంలో పని చేసే వారు. సోవియట్ రష్యా నిర్మాతలైన లెనిన్, స్టాలిన్లకు పుతిన్ తాత వ్యక్తిగత వంటవాడిగా పనిచేశారు.
పుతిన్ పుట్టకముందే తనకన్నా పెద్దవారైన ఇద్దరన్నలు అప్పటికే చనిపోయారు. ఒకరు బాల్యంలో అనారోగ్యం కారణంతో కాగా, మరొకరు రెండో ప్రపంచయుద్ధం సందర్భంగా రష్యాపై జర్మనీ దాడి, నిర్బంధం సమయంలో అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. జర్మనీ దళాల కాల్పుల్లో పుతిన్ అమ్మమ్మ మరణించింది. మేనమామలు అదృశ్యమైపోయారు. యుద్ధంలో పాల్గొన్న తండ్రి తీవ్రగాయాల పాలయ్యాడు. ఇవన్నీ చిన్నప్పటి పుతిన్ మీద తీవ్ర ప్రభావం వేశాయి.
పాఠశాల, కళాశాల విద్యాభ్యాసం అనంతరం పుతిన్ 1970లో లెనిన్గ్రాడ్ యూనివర్సిటీలో న్యాయ విద్యలో చేరాడు. నిబంధనల మేరకు, తొలిసారిగా సోవియట్ రష్యా కమ్యూనిస్టు పార్టీలో సభ్య త్వం తీసుకున్నాడు. 1991లో ఆ పార్టీ రద్దయ్యేవరకూ దాంట్లో కొనసాగాడు. కానీ కమ్యూనిజానికి వ్యతిరేకిగానే ఉన్నారు. ‘ప్రధాన స్రవంతి నాగరికతకు దూరంగా కొనసాగే గుడ్డి నమ్మకం’ అని కమ్యూనిజాన్ని పుతిన్ 1999లో అభివర్ణించారు. 1975లో రష్యా గూఢచార సంస్థ కేజీబీలో చేరి 1990 వరకూ పనిచేశారు. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై రాజకీయంగా తీవ్ర సంక్షోభం నెలకొన్న సమయంలో.. పుతిన్ లెనిన్గ్రాడ్ మేయర్‌గా ఉన్న తన మాజీ అధ్యాపకుడు అనటోలి సోబ్చక్ వద్ద సలహాదారుగా చేరారు. అది పుతిన్ రాజకీయ జీవితానికి ప్రారంభం. ఒక్కో మెట్టు ఎక్కుతూ రాజధాని మాస్కో చేరాడు. నాటి అధ్యక్షుడు బోరిస్ ఎల్త్సిన్ దృష్టిలో పడటంలో కీలకమైన బాధ్యతలు అప్పగించారు. 1999 నాటికి పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే.. పుతిన్‌ను తన రాజకీయ వారసుడిగా ఎల్త్సిన్ ప్రకటించారు. అదే ఏడాది ప్రధానిగా పుతిన్ బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచీ రష్యాలో పుతిన్ శకం మొదలైంది. ఇప్పటికి పలుమార్లు ప్రధానిగా, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
రష్యాకు తిరుగులేని నాయకుడైన తర్వాత.. పుతిన్ రష్యా సామ్రాజ్యాన్ని విస్తరించటంపై దృష్టిపెట్టారు. 2012లో ఉక్రెయిన్ భూ భాగమైన క్రిమియాను ఆక్రమించారు. అక్కడితో ఆగక ప్రస్తుతం మొత్తం ఉక్రెయిన్ను రష్యాలో కలిపేసుకోవటానికి రంగంలోకి దిగారు. అం తర్జాతీయంగా కూడా రష్యా ప్రభావాన్ని విస్తరించే యోచనలో ఉన్నా రు. 2017లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను ఓడించటానికి రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌కు అనుకూలంగా రష్యా పని చేసిందన్న ఆరోపణలున్నాయి. ఇంధనం కోసం రష్యాపై ఆధారపడిన యూరప్ దేశాలను కూడా పుతిన్ ప్రభావితం చేస్తున్నారు. రష్యాను సామ్రాజ్యవాదశక్తిగా మల్చటంలో భాగంగానే పుతిన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిలో ఆయన ఏ మేరకు సఫలమవుతారన్నది తేల్చవలసింది భవిష్యత్తే.
– సూర్య