సీఎం రేవంత్రెడ్డి ఏ మీటింగ్కు పోయినా గమ్మతి గమ్మతిగా మాట్లాడుతుండ్రు. తన మాటల దాడి నుంచి ఎవ్వరినీ ఇడ్శిపెడ్తలేరు. ఏ సంఘం వాళ్లు పిలిస్తే, ఏ శాఖ వాళ్లు వేదిక ఎక్కిస్తే.. అక్కడున్నోళ్లనే నాలుగు తిట్లు తిట్టి, నాలుగు అక్షింతలు వేసి వస్తుండ్రు! మంత్రులు, ఎమ్మెల్యేల మీటింగ్కు పోయి.. ‘మీ పర్ఫార్మెన్స్ బాలేదు, ఇట్లనే ఉంటే మారుస్తా.. వచ్చే మీటింగ్లో పేర్లు చెప్తా’ అని క్లాస్ లీడర్ లెక్క వార్నింగ్ ఇచ్చిండ్రు. ఉద్యోగుల మీటింగ్కు పోయి.. ’మీరు పని సక్కగ చేస్తలేరు, సర్కారుకు ఆమ్దానీ వస్తలేదు. గంట ఎక్కువ పని చేయుండ్రి, ఆ తర్వాతనే పీఆర్సీ ముచ్చట’ అని కండీషన్లు పెట్టిండ్రు.
టీచర్ల మీటింగ్కు పోయి మరీ ఘోరంగా మాట్లాడిండ్రు. ‘మీ దగ్గర చదువుకున్న పిల్లలు ఇంజినీరింగ్ అయిపోయినా ఓ చిన్న దరఖాస్తు కూడా రాయలేరు.. వాళ్లంతా క్రిమినల్ వేస్ట్’ అని నోరు పారేసుకుండ్రు. ఇందులో అందరినీ ఆశ్చర్యపరిచే విచిత్రం ఏందంటే.. సీఎం సారు వేదిక మీద ఉండి తమను అంత ఘోరంగా అవమానిస్తుంటే, ముందు కూర్చున్న మంత్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాత్రం ‘ఆహా.. ఓహో..’ అంటూ మైమరిచిపోయి చప్పట్లు, ఈలలు కొట్టడం! ’కంటి ముందే తిడుతుంటే.. పొగడ్తలు అనుకుని మురిసిపోయినట్టు’ ఉన్నది వాళ్ల యవ్వారం. పిలిచి దండ వేసి, శాలువా కప్పితే.. తిట్లే బహుమానంగా ఇచ్చి రావడం సీఎంకు అలవాటైపోయింది. ఆ తిట్లను కూడా ’వరాలు’ అనుకుని సంబురపడటం ఈ బాధితులకే చెల్లింది.