ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాహసం చాలా ఎక్కువనటంలో, మాటల ఉధృతి ఎక్కువనటంలో, మనసులో ఏ మాట ఉన్నా నిస్సంకోచంగా బయటకు అంటారనటంలో ఎటువంటి సందేహం లేదు. తను ముఖ్యమంత్రి కాకముందు ఈ విషయాలు రాష్ట్ర ప్రజలకు గాని, పొరుగునే గల మరొక తెలుగు రాష్ట్రం ఏపీ ప్రజలకు గాని ఎంతమాత్రం తెలియవు. ఈ ఏడాదిన్నరలో తను నానాటికి విజృంభిస్తున్న తీరుతో ఆయన భాషా సంస్కృతులు, సంస్కారం పెరిగిన తీరు ఎటువంటివో అందరికీ ఇప్పటికే అర్థమైపోయాయి. వీటన్నింటి మధ్య ఆయన తన గురించి మరొక మాట చెప్తే కొన్ని విషయాలు పరిష్కారం అవుతాయనిపిస్తున్నది. అది ‘అవును నేను అబద్ధాల కోరునే’ అని సహజమైన ధైర్యంతో నిజాయితీగా ప్రకటించటం.
ముఖ్యమంత్రి అయిన ఏడాదిన్నరకాలంలో గానీ, అంతకుముందు పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికలు గెలిచేందుకు ఎన్నికల ప్రచారం జరిపిన మాసాలలో గానీ ఆయన మొత్తం ఎన్ని అబద్ధాలు చెప్పి ఉంటారు? చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ ఎన్ని సార్లు చెప్పి ఉంటారు? అవి అబద్ధాలని ప్రజలు కొన్నిసార్లు వెంటనే గ్రహించలేకపోయినా, గ్రహించిన తర్వాత కూడా, అవే అబద్ధాలను అంతే నిర్భీతిగా చెప్పినవి ఎన్ని ఉండొచ్చు? అన్నీ కాకున్నా కనీసం కొన్నింటిని ‘అబద్ధాలు, అబద్ధాలు’ అని ప్రజలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నా, లెక్కచెయక మళ్లీ మళ్లీ చెప్పిన అబద్ధాలు ఏమై ఉంటాయి? వాటిలో ఈ తేదీ వరకు కూడా ఇంకా చెప్తున్నవేమిటి? మొదటినుంచి గల అబద్ధాలకు కొత్తగా తోడవుతున్నవేమిటి? ఈ విషయాలన్నింటిని ప్రజలు ఎట్లా తీసుకుంటున్నారన్నది అట్లుంచి ముఖ్యమంత్రి సహచర మంత్రులు, తన పార్టీ వారు ఏమి ఆలోచిస్తుండవచ్చు? రాష్ట్ర కాంగ్రెస్ పరిశీలకురాలిగా నియమితురాలైన మీనాక్షి నటరాజన్ అనే అసమర్థ సజ్జనురాలి దృష్టికి ఈ విషయాలు వచ్చి ఉంటాయా? సిసలైన గాంధేయవాది అనే ప్రచారం గల ఆమె ‘అసత్యం ఒక పాతకం’ అని చెప్పిన గాంధీజీ మాట ప్రకారం, తమ ముఖ్యమంత్రి ‘అసత్య పరంపర’ గురించి ఏమనుకుంటుండవచ్చు? ఆయనను ఇది వలదని ఏమైనా వారించి ఉంటారా? పరిస్థితిని ఏఐసీసీ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లి ఉండవచ్చునా? అదేమీ ఎంతమాత్రం జరిగినట్టు లేదు. జరిగితే రేవంత్ రెడ్డి అసత్యాలు, అసభ్య దూషణలు పూర్తిగా మానకున్నా కనీసం నానాటికి ఈ విధంగా రెచ్చిపోయి ఉండేవికావు.
దురదృష్టవశాత్తు, పైన అనుకున్నవిధమైన తన అబద్ధాల మొత్తం జాబితాను ఎవరూ మొదటినుంచి లెక్కలుకట్టి రాస్తున్నట్టు లేదు. అదేవిధంగా తన అసభ్యమైన, అనాగరికమైన మాటలను. పాత పత్రికల ఫైళ్లు తిరగవేసి ఇప్పటికైనా తయారుచేయటం అవసరం. వాటిని పెద్ద వ్యాఖ్యానాలు ఏమి లేకుండా ఇంగ్లీషు, హిందీ భాషల్లోకి కూడా అనువాదం చేసి, ప్రచురించి, ఢిల్లీలో అన్ని పార్టీల వారికి, అధికారులకు, మీడియాకు పంపిణీ చేయాలి. దేశ రాజకీయ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతగా పతనమై మాట్లాడని, వ్యవహరించని తీరు ఎటువంటిదో అందరికీ తెలియాలి. తెలంగాణకు దేశస్థాయిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. అది రైతాంగ పోరాటం కాలం నుంచి మొదలై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలం మీదుగా, ఆ తర్వాత సాధించిన అభివృద్ధిని ఆలంబన చేసుకుంటూ సాగింది. అటువంటి రాష్ర్టానికి ఇటువంటి ముఖ్యమంత్రి అని తెలిసి, అప్పుడు అందరు ముక్కున వేలు వేసుకోగలరు. సోనియా, రాహుల్, ఖర్గేలకు అప్పటికైనా కండ్లు తెరుచుకొని ఈ పెద్దమనిషిని అదుపు చేయగలరని ఆశించాలి. జాతీయస్థాయిలో రేవంత్ రెడ్డి ప్రతిష్ఠ ఆయన ‘బీహార్ డీఎన్ఏ’ అన్ననాటి నుంచి మొదలైంది. ఈ టెక్నాలజీ యుగంలో అన్నీ నిమిషాలలో వ్యాపించిపోతాయి. ‘తోటకూర కాడనే’ అన్నట్లు ఆయనను కాంగ్రెస్ నాయకత్వం అప్పుడే నియంత్రించి ఉంటే పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. ఆ నాయకత్వం కూడా ఎంత బలహీనంగా మారిందంటే, వారికిప్పుడు కేంద్ర అధికారం ఎట్లాగూ పగటి కలే గనుక, కనీసం వీలైనన్ని రాష్ర్టాల్లో అధికారం నెరపటం, పార్టీ అవసరాల కోసం నిధులు తెప్పించుకోవటం మాత్రమే దృష్టిలో ఉన్నాయి కనుక రేవంత రెడ్డికి ఎదురులేదు.
అదట్లుంచి మొదట అనుకున్నట్టు, ఎంతో సాహసి, మనసులోని మాటను నిజాయితీగా బయటికి చెప్పేవాడు అయిన ముఖ్యమంత్రి ‘అవును, నేను అబద్ధాల కోరునే’ అనే మాటను ఒక్కసారి బయటకు వెల్లడి చేస్తే చాలా సమస్యలు తప్పిపోతాయి తనకు, మనకు కూడా. అట్లా ఒప్పుకోకుండా అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు చెప్తున్నావని మనం అనటం, దానిపై వాదోపవాదాలు, విమర్శలు, ప్రతివిమర్శలు ఇదంతా చూసే సామాన్యులకు చిరాకులు, వారు కూడా ‘ఏమి అబద్ధాలురా నాయనా’అని తిట్టుకోవటం, రోజూ పత్రికలు, టీవీలు చూసేవారు విసుక్కోవటం వంటివన్నీ తగ్గిపోతాయి. అందువల్ల రేవంత్ రెడ్డి తాను అబద్ధాలు నోటికి వచ్చినట్టు చెప్పానని, చెప్తున్నానని, ఇకముందు కూడా చెప్తూనే ఉంటానని ప్రజలకు స్పష్టం చేయాలి.
మొదట అనుకున్నట్టు, ఎంతో సాహసి, మనసులోని మాటను నిజాయితీగా బయటికి చెప్పేవాడు అయిన ముఖ్యమంత్రి ‘అవును, నేను అబద్ధాల కోరునే’ అనే మాటను ఒక్కసారి బయటకు వెల్లడి చేస్తే చాలా సమస్యలు తప్పిపోతాయి తనకు, మనకు కూడా. అట్లా ఒప్పుకోకుండా అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు చెప్తున్నావని మనం అనటం, దానిపై వాదోపవాదాలు, విమర్శలు, ప్రతివిమర్శలు ఇదంతా చూసే సామాన్యులకు చిరాకులు, వారు కూడా ‘ఏమి అబద్ధాలురా నాయనా’అని తిట్టుకోవటం, రోజూ పత్రికలు, టీవీలు చూసేవారు విసుక్కోవటం వంటివన్నీ తగ్గిపోతాయి.
ఆయన అబద్ధాలు ఏమిటంటే ఎవరూ ఎవరికీ వివరించనక్కరలేదు. గతంలోకి తర్వాత వెళదాము. మొదట బనకచర్ల సమావేశం అజెండాను చూద్దాము. ఆ అజెండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పూనికతో, తన మద్దతుపై ఆధారపడి ఉన్న కేంద్ర ప్రభుత్వం రూపొందించినదని తెలిసిందే. కానీ, అజెండాలో బనకచర్ల అంటూ ఉంటే తాను ఢిల్లీ సమావేశానికి వెళ్లేదే లేదని మొదట భీకర ప్రతిజ్ఞలు చేశారాయన. చివరకు వెళ్లారు. కానీ అందులో అబద్ధం లేదు. అందులో ఉన్నది తెలంగాణ ప్రజలను వంచించడం మాత్రమే. మరి సిసలైన అబద్ధం ఎక్కడ ఉంది? ఢిల్లీ అజెండాలో బనకచర్ల అంశమే మొదటిది అయినా, అందుగురించి చర్చలు జరిగినా, ఆ విషయమై కమిటీ కూడా వేసినా, కమిటీ వేసినట్లు ఆంధ్ర మంత్రి బయట స్పష్టంగా చెప్పినా, కమిటీ నియామకానికి తను కూడా అంగీకరించినా, ఆ కమిటీ ఏం చెప్తే అట్లా చేస్తామని ఒప్పుకొని వచ్చినా,బయటకు వచ్చి మీడియాతో అసలు బనకచర్ల మాటే రాలేదనటం. అక్కడ ఉంది అబద్ధం. బరితెగించిన భయంకరపు వంచన. మనకు తలతిరిగిపోయే మరొక అబద్ధం, ఆ మరునాడు మీడియాతో ముచ్చటిస్తూ బనకచర్ల సహా అన్ని అంశాలపై కమిటీ వేస్తున్నట్టు చెప్పటం. బహుశా ఈ రెండవదానిని సాంకేతికంగా అబద్ధమనలేము. క్షమించాలి. దానిని తాను మొదట చెప్పింది అబద్ధమని ఒప్పుకోవటమనాలి. అట్లా 24 గంటలు తిరిగేసరికి ఒప్పుకున్నందుకు తన నిజాయితీని, ధైర్యాన్ని అభినందించాలి.
కానీ, మొదటి అబద్ధపు మాటేమిటి? నిజాలేమిటో అందరికి కండ్లెదుట కనిపిస్తున్నా అబద్ధాలు ఆడవలసిన అగత్యం ఏమి వచ్చింది? నిజానికి ఏమీ లేదు. ఆయన ఇప్పుడు, సమస్యలపై చర్చలు జరిపితే తప్పేమిటని, వివాదాలను పరిష్కరించుకోవద్దా అని, ఏపీ పొరుగు రాష్ట్రం కదా అని, వివాదాలు తేలితే తెలంగాణకు ఎంతో ఉపయోగమని, కేంద్రం పిలిస్తే పోకుండా ఎట్లా ఉంటామని ఎంతో తార్కికమైన ప్రశ్నలు వేస్తున్నారు. ఆ తర్కంలో పొరపాటు ఎంతమాత్రం లేదు. ఇది మొదట కూడా ఉండిన తర్కమే. ఆయన ఆ తర్కం మొదటనే చేసి, ఆ కారణాల వల్ల బనకచర్ల చర్చలకు వెళ్తున్నట్లు మొదటనే చెప్పవలసింది కదా? కానీ, ఆ అంశం అజెండాలో ఉంటే చర్చలకు పోయే ప్రసక్తే లేదని కరాకండిగా ఎందుకు ప్రకటించినట్టు? స్పష్టత లేకనా? నిజాయితీతో కూడిన వైఖరి లేకనా? నిజాయితీ లేని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకా? ఆంధ్ర అనుకూలపు మొగ్గు గల నీటిపారుదల సలహాదారు బోల్తా కొట్టించినందుకా? చంద్రబాబు మాటను కాదనలేకనా? స్వయంగా తనకు మెతకదనం గల బీజేపీ ప్రభుత్వం ఆహ్వానించినందుకా? ఇవేవీ గాక అసలు అబద్ధాలు చెప్పటం తనకు అలవాటుగా, స్వభావంగా మారినందుకా?
ఇక అభయహస్తం మ్యానిఫెస్టో అమలు గురించిన అబద్ధాల మాట అయితే చెప్పనక్కరలేదు. రేవంత్రెడ్డి అబద్ధాలు వినీ వినీ, మాట్లాడుకొనీ, మాట్లాడుకొనీ, తిట్టుకొనీ, తిట్టుకొనీ ప్రజలు అలసిపోయారు. రాసీ రాసీ వ్యాఖ్యాతలు కూడా అలసిపోయి ఉంటారు. రాజకీయ నాయకులకు తప్పదు గనుక వారు మాత్రం విమర్శిస్తూనే ఉంటారు. సందర్భం వచ్చింది గనుక మ్యానిఫెస్టోను ఒకసారి బయటకు తీసి తిరగవేస్తే కనిపించిందేమిటి? అత్యధికం అబద్ధాలు, అబద్ధాలు. అంతెందుకు. ఈ నెల 18వ తేదీ శుక్రవారం నాడు తను ‘పాలమూరు బిడ్డ’గా జటప్రోలు గ్రామంలో ఉద్యోగాల గురించి ఏమన్నారో చూడండి. రెండున్నరేండ్ల పాలన పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు కల్పిస్తారట. అది చూసి మ్యానిఫెస్టోలోని తొమ్మిదవ పేజీలో గల ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’ను గమనిస్తే అందులో ఈ విధంగా ఉంది: మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ. ప్రతీ ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17లోపు నియామకాల పూర్తి. నిరుద్యోగ యువతకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేవరకు ప్రతి నెల రూ.4,000 నిరుద్యోగ భృతి చెల్లింపు. ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేటు కంపెనీల్లో తెలంగాణ యువతకు 75 % రిజర్వేషన్ కల్పన. విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు యూత్ కమిషన్ను ఏర్పాటుచేసి, రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణ సదుపాయ కల్పన. ఈ హామీల అమలు అబద్ధాల మాట అట్లుంచి ఇందులోని చమత్కారాన్ని గమనించాలి. మ్యానిఫెస్టో చెప్పింది మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలని. జటప్రోలులో రేవంత్ రెడ్డి అంటున్నది రెండున్నరేండ్ల పాలన పూర్తయ్యేసరికి 1 (అక్షరాల ఒకటి) లక్ష అని.
మళ్లీ బనకచర్లకు వద్దాం. ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణకు నీళ్ల విషయంలోనే గాక అనేక నష్టాలు చేస్తుండగా, అదే జటప్రోలు సభలో రేవంత్ రెడ్డి తనను ఈ ప్రాంతానికి ఎన్నెన్నో మేళ్లు చేశారాంటూ ఆకాశానికెత్తారు. ఇంకా ఫలానాది చేయండంటూ వినతిపత్రం ఒకటి సమర్పించారు. ఆ కోర్కెలు చేయకపోతే పోరాటం ఎట్లా చేయాలో తనకు తెలుసునట. ఇదంతా ఢిల్లీలో ‘బనకచర్ల సరెండర్ నుంచి తెలంగాణ ప్రజల దృష్టిని మళ్లించే నాటకమని అందరికీ అర్థమవుతున్నదే. అందుకు షరామామూలుగా ప్రత్యర్థులపై, తన వైఫల్యాలను ఎత్తిచూపేవారిపై అసత్యపు దూషణలు సరేసరి.
ఈ ఏడాదిన్నరలో తన తీరును పరిశీలించగా ఒకటనిపిస్తున్నది. ఆయన అబద్ధాలు, దూషణలు మామూలు సమయంలో మామూలు స్థాయిలో ఉంటాయి. అబద్ధపు వైఫల్యాలు బయటపడి ఒత్తిడికి గురైనప్పుడు మామూలుకన్న పైస్థాయికి చేరుతాయి. వత్తిడి పెరిగిన కొద్దీ అసాధారణ స్థాయికి పెరుగుతుంటాయి. తన స్వరం కూడా అందుకు అనుగుణంగా పైకి పోతుంది. మాటలు ఏకే-47 వలె పేలుతుంటాయి. ఆయా అనుపాతాలను గ్రాఫ్లుగా గీయగలిగితే ఇది బాగా అర్థమవుతుంది. బనకచర్ల వరుస అబద్ధాల తర్వాత శుక్రవారం నాడు జటప్రోలు గ్రాఫ్ ఆ మూడవది అయిన అసాధారణ స్థాయిలోనే తోచింది. ఆయన ఈ శ్రమలన్నీ పడటం కన్న, మొదట అనుకున్నట్టు, ‘అవును నేను అబద్ధాల కోరునే’ అని ఒక్క మాట ధైర్యం చేసి నిజాయితీగా అనివేస్తే తనకు, ప్రజలకు అనేక సమస్యలు తీరుతాయి గదా.