ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత పలు సందర్భాల్లో రేవంత్‌రెడ్డి రెండు ప్రధాన ప్రకటనలు చేశారు. అందులో మొదటిది, తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని శాసనసభలో ప్రకటన చేయడం. రెండోది, తాను జానారెడ్డిని కాదని చెప్పడం. నిజానికి ఏ వ్యక్తిని మరో వ్యక్తితో పోల్చలేం. ప్రతి ఒక్కరూ ప్రత్యేకమే. అయితే రేవంత్ అతిగా ఊహించుకోవడంతో పాటు గత సీఎంలను చిన్నచూపు చూసేవిధంగా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండవచ్చు. కానీ విచిత్రంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కూడా కాలేదు, చివరుకు రేవంత్‌రెడ్డి ఏదైనా పెండ్లికి వెళ్లినా అక్కడ ఆయన సమక్షంలోనే ‘కేసీఆర్.. కేసీఆర్’ అనే నినాదాలు వినిపిస్తున్నాయి.
సామాన్య ప్రజలు, రైతులు మహిళలు రోజూ కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. ఎవరి పేరైతే చెరిపేస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించారో ఆ కేసీఆర్ పేరు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో వినిపించిన స్థాయిలో ఇప్పుడు వినిపించేట్టు చేశారు. దీనికి కారణం రేవంత్‌రెడ్డి పాలన కావచ్చు, పరిస్థితులు కావచ్చు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికైనా, ఇప్పుడు కేసీఆర్ పాలనను ప్రజలు పదే పదే గుర్తుచేసుకోవడానికైనా పరిస్థితులే ప్రధాన పాత్ర వహిస్తాయి.
రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టగానే తాను గతంలో రాష్ర్టాన్ని పాలించిన వారిలా కాదని ప్రకటన కూడా చేశారు. తెలంగాణ రాష్ట్ర రెండవ పాలకుడు రేవంత్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ప్రకాశం పంతులు, దామోదరం సంజీవయ్య కాలం నాటికి పోకపోయినా ఇటీవల కాలం నాటి పాలకులతో పోల్చినా రేవంత్‌రెడ్డి స్వల్ప కాలంలోనే తేలిపోయారు. చివరకు కాంగ్రెస్ సీఎంలలో సైతం అత్యంత బలహీనమైన ముఖ్యమంత్రిగా నిలిచారు. ప్రజాప్రతినిధులు, అధికారులపై తనకు నియంత్రణ లేదని స్వయంగా ఆయనే చెప్పుకొంటున్నారు. రాజకీయ సలహాదారు అయిన మీడియా అధిపతితో తన గోడు వెళ్లబోసుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి తన సన్నిహితుల వద్ద తన నిస్సహాయత గురించి వాపోతున్నారని రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించే ఆ మీడియా అధిపతి రాశారు. ఆ రాతలు నిజమే అయితే అత్యంత సన్నిహితుడు ఆయనే కాబట్టి ఆయన వద్దే గోడు వెళ్లబోసుకొని ఉండవచ్చు.
ఓటుకు నోటు కేసు వీడియోలో ఆ మీడియా అధిపతి తనకు ఎంత ఆప్తుడో స్వయంగా రేవంత్‌రెడ్డే చెప్పారు. రహస్యంగా చిత్రించిన వీడియోలో ఆయనే స్వయంగా చెప్పారు కాబట్టి నమ్మవచ్చు. అంతే కాకుండా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో జూనియర్ కాబట్టి అత్యంత ఆప్తులు, సన్నిహితులు కాంగ్రెస్‌లో ఆయనకుండే అవకాశం లేదు. తనతో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకులు కొందరు రేవంత్‌రెడ్డికి సన్నిహితులే. రేవంత్‌రెడ్డిని తప్పిస్తే సీఎం అవుదామని చూసే సీనియర్లే కానీ రేవంత్‌రెడ్డి తన మనసులోని బాధను చెప్పుకొనేంత సీనియర్ ఆత్మీయులు కాంగ్రెస్‌లో లేరు.
ఇక కాంగ్రెస్ సీఎంలు ఎవరితోనూ పోల్చే స్థితిలో రేవంత్‌రెడ్డి లేరు. చంద్రబాబు, కేసీఆర్ ప్రాంతీయ పార్టీ నాయకులుగా తమ పార్టీలపై పూర్తి పట్టు కలిగి ఉండటమే కాకుండా, పూర్తిస్థాయిలో అధికారంపై పట్టు చూపించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడి స్థాయిలో కాంగ్రెస్‌లో పూర్తి అధికారం అనుభవించారు. వైఎస్సార్ సీఎం కాగానే పి.జనార్దన్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని స్వయంగా సోనియాగాంధీ సూచించారు. హై కమాండ్ మాటను వైఎస్సార్ పట్టించుకోలేదు. సోనియాగాంధీ ఒకే ఒక్క పేరు సూచించినా వైఎస్సార్ పట్టించుకోలేదని, మళ్లీ సోనియాగాంధీ అడగలేదని ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ లాబీలో ఒకసారి గాలి ముద్దుకృష్ణమ నాయుడు మీడియాకు చెప్పారు. తెలంగాణ ఏర్పాటు చేయాలని సోనియాగాంధీ భావిస్తే రాజశేఖర్‌రెడ్డి అడ్డుకోగలిగారు. ఇక కె.రోశయ్య తాను దారినపోయే దానయ్యను అని తన గురించి తానే చెప్పుకున్నారు. మీడియా కూడా ఆయనను తాత్కాలిక సీఎంగానే గుర్తించింది. హై కమాండ్ ఏం చెప్తే అది చేస్తానని రోశయ్య బహిరంగంగా ప్రకటించారు. ఇక కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో తెలంగాణ అంకం చివరి దశకు చేరుకున్నది. హై కమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించారు. అయినా తెలంగాణను ఆపలేకపోయారు కానీ, ఆంధ్రలో కాంగ్రెస్‌కు ఉనికి లేకుండా చేయడంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ మంచి స్థానాలు సంపాదించింది. సీఎంగా ఉంటూనే విభజనతో ఆంధ్రకు అన్యా యం జరుగుతుందని కిరణ్ కుమార్‌రెడ్డి బలం గా వాదించడం ఆంధ్రలో కాంగ్రెస్‌ను చావుదెబ్బ తీసింది. పోలవరం, ప్రత్యేక హోదాపై ఆంధ్ర నాయకత్వం ఇప్పుడు అడుగుతున్నది కానీ, యూపీఏ ప్రభుత్వం వీటికి అప్పుడే అంగీకరించింది. అయితే, కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యతిరేక ప్రచారం, జగన్ సొంతపార్టీ ప్రభుత్వంతో ఆంధ్రాలో కాంగ్రెస్ అడ్రెస్ లేకుండా పోయింది. కాంగ్రెస్ రహిత రాష్ట్రంపై ఎన్టీఆర్ కలలు కన్నా సాధించలేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఆంధ్రలో అది సాధ్యం చేసి చూపించారు.
15 నెలలకే ఒక అంచనాకు రావడం తొందరపాటు కావచ్చు కానీ తెలంగాణలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను చాలా వేగంగా మైనస్‌లోకి తీసుకెళ్తున్నారు. ఇంకా మూడున్నరేండ్ల కాలం ఉన్నది. ఎప్పుడేమైనా జరగవచ్చు కానీ రేవంత్‌రెడ్డి తెలంగాణ కిరణ్ కుమార్‌రెడ్డిగా రికార్డ్ సృష్టించే అవకాశాలు మాత్రం దండిగా కనిపిస్తున్నాయి. అత్యున్నత స్థాయికి ఎదగడం కన్నా ఆ స్థాయిని నిలబెట్టుకోవడం కష్టమంటారు. రేవంత్‌రెడ్డిని చూస్తే అది నిజమనిపిస్తున్నది. కేవలం కేసీఆర్‌పై వ్యతిరేకతతో కాంగ్రెస్, బీజేపీలను ఉమ్మడిగా అభిమానించిన మేధావులు సైతం రేవంత్‌రెడ్డి పాలనపై పెదవి విరుస్తున్నారు. తెలంగాణలో ఎన్డీఏ కూటమి రావాలి, వస్తుందని రేవంత్‌రెడ్డి ఆత్మీయ మీడియానే రాస్తున్నది. కేసీఆర్ పేరు చెరిపేస్తానని ప్రకటించిన రేవంత్‌రెడ్డి 15 నెలలవుతున్నా సీఎంగా ఇంకా తన పేరు గుర్తుంచుకొనేట్టు చేయలేకపోయారు. పలు సమావేశాల్లో రేవంత్‌రెడ్డిని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అని పిలుస్తున్నారు. పొరపాటున అలా పిలిచినా పైన తథాస్తు దేవతలు ఉంటారని పెద్దలు అంటారు. రేవంత్‌రెడ్డి వ్యవహారం కిరణ్‌కుమార్‌రెడ్డిని పదే పదే గుర్తుకు తెస్తున్నది.
బూతుల ద్వారా రాజకీయాల్లో రేవంత్‌రెడ్డి అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. ఇందులో అనుమానం లేదు. అత్యున్నత స్థాయికి చేరుకున్నా గతంలో మాదిరిగానే బూతులు నమ్ముకొని బోల్తా పడుతున్నారు. చివరకు ఆత్మీయ మీడియా సైతం 15 నెలలకే చేతులెత్తేసింది. రేవంత్‌రెడ్డి కుల రాజకీయాలను నమ్ముకొని అతి స్వల్ప కాలంలో బూతులతో కాంగ్రెస్‌లో సీనియర్లను వెనక్కి నెట్టి సీఎం స్థాయి వరకు ఎదిగారు. ఇదే విధంగా శాసనమండలి సభ్యులు మల్లన్న సైతం జర్నలిజం పేరుతో కుల రాజకీయాలు, బూతులు నమ్ముకొని శాసనమండలి సభ్యుడి వరకు ఎదిగారు. కాంగ్రెస్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. రేవంత్‌రెడ్డికి పార్టీ కొత్త ఇంచార్జ్ ద్వారా కాంగ్రెస్ చెక్ పెట్టింది. చివరుకు తనకు అత్యంత ఆప్తుడు, టీడీపీలో సహచరుడు అయిన వేం నరేందర్‌రెడ్డిని శాసన మండలి సభ్యుడిని కూడా చేయలేకపోయారు. సీఎం కాగానే టీడీపీ పాత మిత్రులకు సలహాదారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు, ఒకటి రెండు నామినేట్‌డ్ పోస్ట్‌లు ఇచ్చారు. ఆ తర్వాత సీఎం నిర్ణయాలకు బ్రేక్ పడింది. శాసనమండలి సభ్యుల నిర్ణయంలోనూ మొత్తం హై కమాండ్‌దే నిర్ణయం.
ఇప్పుడు తెలంగాణకు సీఎం రేవంత్‌రెడ్డి అయినా, అధికారం మాత్రం హై కమాండ్ చేతికి పోయింది. ఈ స్థాయి పెత్తనం గతంలో ఎప్పుడూ లేదు. రేవంత్‌రెడ్డి చెప్పినట్టు తాను గత సీఎంల వంటి వారు ఎంతమాత్రం కాదు.