తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్ల అధికారాన్ని పూర్తి చేసుకున్నది. ఈ ప్రభుత్వం సాధించిన ఘన విజయం ఏదైనా ఉన్నదా? అంటే కర్ణాటకలో మాదిరిగా సగం అధికార కాలం పూర్తి కాగానే ముసలం పుట్టలేదు. అదే వీరి ఘన విజయం. ‘రూ.1000 కోట్లు ఖర్చుచేసి చెమటోడ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు’ అని వారికి అండగా నిలిచిన మీడియా చెప్పింది నిజమే అనుకుంటే, ఆ స్థాయిలో ఖర్చుచేసి అధికారం చేపట్టే ఉత్సాహం ఉన్న నాయకుడు తెలంగాణ కాంగ్రెస్‌లో లేకపోవడం రేవంత్ రెడ్డికి కలిసి వచ్చిన అవకాశం.
కర్ణాటకలో సంపన్నుడైన డీకే శివకుమార్ లాంటి నాయకుడు ఇక్కడ లేకపోవడం, ఒకరో ఇద్దరో సంపద ఉన్నవారు ఉన్నా, అంత వ్యయం అవసరమా? అనుకోవడంతో తెలంగాణలో డీకే శివకుమార్ పాత్రను పోషించేందుకు ఎవరూ ముందుకురావడం లేదు.
రేవంత్ రెడ్డి రెండేండ్ల పాలనాకాలంలో తెలంగాణపై ఎలాంటి ముద్ర వేయలేకపోయారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అప్పటివరకు ఉన్న కేసీఆర్ అనే మహా శిఖరం ముందు తన ఇమేజ్ చాలా చిన్నగా కనిపించింది. హోదా రీత్యా ముఖ్యమంత్రి పదవి పెద్దది కానీ, తన ఇమేజ్ చాలా చిన్నది. విషయ పరిజ్ఞానం, ఉద్యమ చరిత్ర, రాజకీయ అనుభవం, నాలెడ్జ్ ఇలా ఏ విషయంలో చూసినా కేసీఆర్ మేరుపర్వతం. అయితే, ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం మినహా అన్ని విషయాల్లో కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి వెలవెలబోతారు.
చాలామంది తమకున్న ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌ను సుపీరియారిటీ కాంప్లెక్స్‌గా ప్రదర్శిస్తారు. ఒక గీతను చిన్న గీతగా చూపాలంటే దాని పక్కన పెద్ద గీత గీయాలి. అది రేవంత్‌కు సాధ్యం కాదు. పెద్ద గీత గీయడం సాధ్యం కానప్పుడు అసలు గీతనే చెరిపేస్తే పోలా అనుకున్నారు.
అధికారంలోకి వచ్చిన మొదట్లోనే దీనికోసం రేవంత్ తీవ్రంగా ప్రయత్నించారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లన్నీ తాను చెరిపేస్తానని ఏకంగా శాసనసభలోనే ప్రకటించారు. ఒక్క తెలంగాణ రాష్ట్రం అనే పేరు తప్ప అన్నింటిని మార్చేయాలని ఉత్సాహపడ్డారు. అయితే ఈ పేర్లు, గుర్తులు మార్చడంలోనూ చతికిలపడ్డారు. వాహనాల మీద టీఎస్ అని ఉంటే, దానికి టీజీ అని పేరు మార్చారు. అదేవిధంగా తెలంగాణ అధికారిక చిహ్నంలో నుంచి చార్మినార్‌ను, కాకతీయ తోరణాన్ని తొలగించి కొత్త చిహ్నం రూపొందించారు. అధికారికంగా విడుదల చేసే ముందు కాంగ్రెస్ హైకమాండ్ మొట్టికాయలు వేసింది. దేశంలో కాంగ్రెస్ ఈ మాత్రం మిణుకు మిణుకుమంటూ బతుకీడుస్తున్నదే మైనారిటీ ఓట్లతో. అధికార చిహ్నం నుంచి చార్మినార్ తొలగిస్తే మైనారిటీలు దూరమవుతారని కొందరు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హై కమాండ్‌కు ఫిర్యాదు చేయడంతో రేవంత్ కోరిక తీరకుండాపోయింది. అయితే పరువు నిలుపుకోవడం కోసం హైకమాండ్ మొట్టికాయలు వేసిన విషయం చెప్పకుండా డిసెంబర్లో కొత్త చిహ్నం అధికారికంగా విడుదల చేస్తామని ప్రకటించి దాదాపు రెండేండ్లవుతున్నది. వాళ్లకు ఇంకా డిసెంబర్ రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 3వ డిసెంబర్. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి తెలంగాణ రూపురేఖలు మార్చినట్టు మురిసిపోతున్నారు.
తెలంగాణ ఏర్పడిన కొత్తలో కొంతమంది తెలంగాణవాదులు ‘చంద్రబాబు ప్రతి రోజు హైటెక్ సిటీ నేనే కట్టాను అని ప్రచారం చేసుకుంటున్నాడు. ఆ భవనాన్ని కూల్చి మరో భవనం కట్టాల’ని అప్పటి మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు సూచిస్తే తిరస్కరించారు. ఐటీ రంగంలో మనం అంతకన్నా ఎక్కువ అభివృద్ధి సాధించి చూపాలి కానీ, భవనం కూల్చడం ఎందుకని బదులిచ్చారు. నిజంగానే పదేండ్లలో ఐటీ ఎగుమతులు పెరిగాయి, హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు వచ్చాయి. ఒక గీత పక్కన పెద్ద గీత గీయడం వచ్చిన వారు ఇలా చేస్తారు. అలాంటి ఆలోచన, సామర్థ్యం లేనివాళ్లు పేరు మార్చి, చిహ్నాలు మార్చడం, బూతులు తిట్టడం ద్వారా పెద్దవారిని చిన్నగా చూపాలనే చిన్న బుద్ధి ప్రదర్శిస్తారు.
రేవంత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. సమ్మిట్ విజయవంతమైందా? పెట్టుబడులు ఎన్ని వచ్చాయనే విషయాలు ఎలా ఉన్నా, సదస్సుకు హాజరైన ప్రముఖులు పదేండ్ల తెలంగాణ అభివృద్ధిని రేవంత్‌కు బాగానే వివరించారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ పదేండ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని సమ్మిట్లోనే వివరించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని రేవంత్ ప్రగల్భాలు పలికితే, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు రేవంత్ సమక్షంలోనే గ్లోబల్ సమ్మిట్‌లో పదేండ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని చెప్పారు. తెలంగాణ అంటే ఒకప్పుడు ఫ్యూడలిజంకు, పేదరికానికి, వెనుకబాటుతనానికి మారుపేరు. కానీ, పదేండ్లలో అద్భుతమైన ప్రగతి సాధించింది. దేశంలో తెలంగాణ మోడల్ అభివృద్ధి అని సంతోషంగా చెప్పుకోవచ్చని తెలిపారు. తలసరి ఆదాయంలో, జీడీపీలో దేశంలో నంబర్ వన్‌గా నిలిచిన తీరును వివరించారు.
తెలుగు మీడియాకు నచ్చకపోవచ్చు కానీ, ఆర్బీఐకి గవర్నర్‌గా పనిచేసిన వారికి ఆర్థిక రంగంలో ప్రగతి గురించి రేవంత్ కన్నా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ కన్నా ఎక్కువగానే పరిజ్ఞానం ఉంటుంది. దువ్వూరి సుబ్బారావు, టోనీ బ్లేయర్ పదేండ్ల తెలంగాణ ప్రగతి గురించి ఇంగ్లీష్‌లో మాట్లాడటం వల్ల రేవంత్ బతికిపోయారు.
తన ఇమేజ్ పెంచుకోవడానికో, పెట్టుబడులు సాధించడానికో, దేనికోసమో కానీ వందల కోట్లు ఖర్చుచేసి నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో నిపుణుల ఉపన్యాసాలతోనైనా పదేండ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి రేవంత్‌కు అర్థమై ఉండాలి. రెండేండ్లలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగిలిన హామీలు గాలికి వదిలేశారు. ఆర్టీసీకి డబ్బులు చెల్లించలేదు కానీ, ఉచిత బస్సు పథకం అమలుచేస్తున్నారు.
పదేండ్ల కేసీఆర్ పాలన తెలంగాణలో పెద్ద మార్పు తీసుకువచ్చింది. మేం ఇది చేశామని చెప్పుకోవడానికి వారికెన్నో ఉన్నాయి. విద్యుత్ కోతల చీకటిరోజుల నుంచి 24 గంటల నిరంతర విద్యుత్, రైతుల ఆత్మహత్యల నుంచి దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రికార్డు, ఇంటింటికీ మంచినీళ్లు, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల గురించి చెప్పుకుంటారు. రెండేండ్ల రేవంత్ పాలన గురించి ఇదీ మా పాలన ముద్ర అని చెప్పుకోవడానికి ఏముంది? టి.అంజయ్య కాలం ఇప్పటివారికి తెలియదు. టీడీపీ శకం నుంచి ఇప్పటివరకు చూస్తే అందరు ముఖ్యమంత్రుల కన్నా పరిజ్ఞానం విషయంలో, హుందాతనం విషయంలో రేవంత్ చివరి స్థానంలో ఉంటారు. ‘స్వతహాగా సీఎంయే బూతులు తిడుతుంటే మేం తిడితే తప్పేమిటి’ అని బాధితులు సీఎంను అంతకన్నా ఎక్కువ బూతులు తిడుతున్నారు. అన్ని అనుమతులతో గృహప్రవేశం చేయగానే ఇంటిని కూలిస్తే బాధితుడు బూతులు తిడితే ఆ ఆక్రోశాన్ని, నిస్సహాయ స్థితిని అర్థం చేసుకోవచ్చు.
సీఎం పదవిలో ఉండి ఏమీ చేయకుండా ప్రత్యర్థుల చావును కోరుకోవడం, బూతులు తిట్టడం పాలన చేయడం రాని చేతకానితనమే అవుతుంది కానీ, రాజకీయ వ్యూహం అనిపించుకోదు. వందల కోట్లు ఖర్చుచేసి గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తే ప్రధానమంత్రి మాట అటుంచి చివరికి కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ కూడా రాలేదు. కనీసం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను సైతం రప్పించలేకపోయారు. సాధారణంగా ఇలాంటి సమ్మిట్లకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్రంలో ఉన్న మంత్రులు వచ్చేట్టు చేస్తారు. అది కూడా చేయలేకపోయారు. నగరంలో ఉండే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తప్ప ఇతర రాష్ర్టాల సీఎంలు రాలేదు, కేంద్ర మంత్రులు రాలేదు. చివరికి వచ్చినవాళ్లు పదేండ్ల తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించారు.
రేవంత్ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మూడేండ్ల కాలమే. హై కమాండ్‌ను ఆర్థికంగా సంతృప్తి పరచడంలో విజయం సాధించి ఉండవచ్చు కానీ, తెలంగాణ ప్రజలే తెలంగాణకు హై కమాండ్. ఈ హై కమాండ్ జీవితాలను మార్చే దిశగా మిగిలిన ఈ మూడేండ్లు ప్రయత్నించాలని కోరుకోవడం అత్యాశే అవుతుందేమో.
పదేండ్ల కేసీఆర్ పాలన తెలంగాణలో పెద్ద మార్పు తీసుకువచ్చింది. మేం ఇది చేశామని చెప్పుకోవడానికి వారికెన్నో ఉన్నాయి. విద్యుత్ కోతల చీకటిరోజుల నుంచి 24 గంటల నిరంతర విద్యుత్, రైతుల ఆత్మహత్యల నుంచి దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రికార్డు, ఇంటింటికీ మంచినీళ్లు, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల గురించి చెప్పుకుంటారు. రెండేండ్ల రేవంత్ పాలన గురించి ఇదీ మా పాలన ముద్ర అని చెప్పుకోవడానికి ఏముంది?
– బుద్దా మురళి