ఉద్యోగ వ్యతిరేక విధానాల అమల్లో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ దశాబ్దాలుగా పోటీ పడుతున్నాయి. ఉద్యోగ వర్గాలు పోరాడి సాధించుకున్న పెన్షన్ హక్కులను కేంద్రం ఇటీవల తెచ్చిన నూతన ఆర్థిక చట్టం హరించివేస్తున్నది. ఆర్థిక చట్టం-2025లో కేంద్రం తీవ్రమైన మార్పులు తీసుకురావడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ చట్టం కారణంగా భవిష్యత్తులో డీఏ పెంపు, వేతన కమిషన్ (పీఆర్సీ) ప్రయోజనాలను రిటైర్డ్ ఉద్యోగులు అందుకోలేరు. పదవీ విరమణ తర్వాత తమ ప్రయోజనాలూ దెబ్బతింటాయని ఉద్యోగులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వాల్సిన బాధ్యత నుంచి కేంద్రప్రభుత్వం తప్పించుకుంటున్నది. కొత్త చట్టం ప్రకారం రిటైర్డ్ ఉద్యోగులకు వేతన సంఘం ప్రయోజనాలు, డీఏ పెంపుదల వర్తించవు. పెన్షన్ లేదా భత్యం విషయంలో భవిష్యత్తులో ఏవైనా సవరణలపై ప్రభుత్వ ఇష్టానుసారం నిర్ణయాలు ఉంటాయి. ఈ నిబంధనలను పెన్షనర్లు చట్టబద్ధంగా సవాలు చేయడానికీ వీలు లేకపోవడం శోచనీయం.
ప్రస్తుతం 1972 పెన్షన్ చట్టం ప్రకారం పెన్షన్లు ఇస్తున్నారు. ఈ చట్టం ద్వారా రిటైర్డ్ ఉద్యోగులు ప్రయోజనాలను పొందుతున్నారు. అయితే, ఈ చట్టం అన్ని వర్గాల పెన్షనర్లకు వర్తించకపోయేది. దీనిపై గతంలో పలువురు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో 1982 సెప్టెంబర్ 17న జస్టిస్ వై.వి.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులందరినీ వారి విరమణ తేదీతో సంబంధం లేకుండా సమానంగా చూడాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చివరిగా పొందిన జీతంలో 50 శాతానికి సమానమైన పెన్షన్, ఇతర ప్రయోజనాలు ఇవ్వాలని ఆ తీర్పులో కోర్టు ఆదేశించింది. దీంతో ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అందుకే అప్పటి నుంచి సెప్టెంబర్ 17న ‘పెన్షనర్ల దినోత్సవం’ నిర్వహిస్తున్నారు.
నాటి సుప్రీంకోర్టు తీర్పును ఆర్థిక చట్టం-2025 ఉల్లంఘిస్తున్నది. 8వ వేతన సంఘం, డీఏ పెంపుదల ఇప్పటికే ఉన్న పెన్షనర్లకు వర్తించదని కొత్త చట్టం స్పష్టం చేస్తున్నది. ఇకపై పెంపుదలకు 1972 పెన్షన్ చట్టం వర్తించదు. పెన్షన్లను లేదా అలవెన్సులను సవరించాలా, వద్దా అనే దానిపై ప్రభుత్వం స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటుంది. కొత్త విధానంలో కేంద్రం చేసిన మార్పులు ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళనలను రేకెత్తించింది.
ఉద్యోగులు ఎన్నటికైనా రిటైర్ అయ్యేవాళ్లే. వారికి కూడా రిటైరైన తర్వాత బెనిఫిట్స్ రావాల్సిందే. ఇది వారి చట్టబద్ధమైన హక్కు. కానీ, ఇప్పుడు ఈ హక్కును కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్నది. కాబట్టి ఉద్యోగులు, పెన్షనర్లు తమ హక్కుల సాధన కోసం ఐక్య కార్యాచరణ రూపొందించాలి.
కేంద్రం తెస్తున్న ఆర్థిక బిల్లును ఉపసంహరించుకోవాలని పార్లమెంట్లో బిల్లు ప్రతిపాదించిన సందర్భంగా ప్రతిపక్ష నేత కేసీ వేణుగోపాల్ కోరారు. కానీ, ఈ బిల్లులో ఎలాంటి మార్పులు తీసుకురాలేదని, గత ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లునే ప్రవేశపెడుతున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం గమనార్హం. 2004 సెప్టెంబర్ తర్వాత నియామకమైన ఉద్యోగి వేతనం నుంచి పది శాతం తీసుకొని, ప్రభుత్వం ఇచ్చే 14 శాతం కలిపి రిటైర్ అయ్యాక మొత్తం ఒకేసారి చెల్లిస్తామని ప్రభుత్వం చెప్తున్నది. ఇది ఉద్యోగుల పెన్షన్ హక్కును కాలరాయడమే.
ఎన్పీఎస్ విధానాన్ని రద్దు చేయాలని దశాబ్దాలుగా ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. ఉద్యోగుల ఆందోళనను పక్కదారి పట్టించేందుకు యూనిఫైడ్ పింఛన్ విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. 2004 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులు ప్రస్తుత ఎన్‌పీఎస్‌లో కొనసాగాలా లేక యూపీఎస్‌లో చేరాలా అనే విషయంలో సందిగ్ధంలో ఉన్నారు. ఒక్కసారి యూపీఎస్‌లో చేరితే తిరిగి ఎన్‌పీఎస్‌లోకి వెళ్లే అవకాశం ఉండదు. యూపీఎస్‌లో చేరేందుకు కేంద్రం జూన్ 30 వరకు గడువు విధించింది. యూపీఎస్‌లో చేరిన ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత వేతనంలో సగం పింఛన్ రావాలంటే కనీసం 25 సంవత్సరాలు సర్వీస్ ఉండాలి.
ఒక్క నెల ఉద్యోగి వాటా చెల్లించకపోయినా, పాక్షికంగా ఒక్క రూపాయి ఉపసంహరించుకున్నా పెన్షన్‌లో కోత విధిస్తారు. అలాగే 10 సంవత్సరాల సర్వీస్ ఉంటేనే దీనికి అర్హులుగా పరిగణిస్తారు. యూపీఎస్‌లో చేరిన ఉద్యోగులు 10 శాతం జమ చేస్తారు. 18 శాతం ప్రభుత్వం జమ చేస్తుంది. ఒకవేళ ఉద్యోగి తన అవసరాల కోసం నిధి నుంచి డబ్బులు తీసుకుంటే పింఛన్ తగ్గుతుంది. ఎన్‌పీఎస్‌లో 60 శాతం నిధిని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ, యూపీఎస్‌లో ఆ వెసులుబాటు లేదు.
ఉద్యోగ విరమణ అనంతరం ఇచ్చే డీఏపై స్పష్టత లేదు. ఒకవైపు పాత పెన్షన్ విధానం అమలు కోసం ఉద్యోగులు నిరసనలు చేస్తున్న సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగుల్లో మళ్లీ ఆందోళన నెలకొన్నది. పెన్షనర్లు భవిష్యత్తు ప్రయోజనాలు పొందకుండా ఉండేందుకు నూతన చట్టాన్ని అమలు చేయడం ఉద్యోగుల పట్ల పాలకులు అనుసరిస్తున్న వైఖరికి నిదర్శనం. కేంద్ర వేతన సవరణ అమలు చేయని రాష్ర్టాల్లోనూ అనివార్యంగా కేంద్రం విధానాలకు అనుగుణంగా మార్పులు చేయడం ఆందోళన కలిగిస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మరీ దారుణం. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉంటే ఒక్కటే ఇచ్చి గొప్పలు చెప్పుకొంటున్నది. పీఆర్సీ అడిగే అవకాశం లేకుండా చేసింది. రిటైర్ అయ్యాక ఉద్యోగులకు రావలసిన పెన్షన్ సొమ్ము చెల్లించకుండా వేధిస్తున్నది. రిటైర్డ్ ప్రిన్సిపల్ సోమిరెడ్డి మృతిచెందడమే అందుకు నిదర్శ నం. మరోవైపు సీపీఎస్ ఉద్యోగుల వాటా, ప్రభుత్వ వాటా డబ్బులు ప్రాన్ అకౌంట్లో జమ చేయడం లేదు. ఈ డబ్బులన్నీ మళ్లీ ప్రభుత్వ ఖజానాకే తిరిగి వెళ్తుండ టం, వాటిని సర్కారు దారిమళ్లిస్తుండటం ఆందోళన కరం. ఆరునెలల తర్వాత ఇంకొక డీఏ ఇస్తామని ఊరిస్తున్నది. ఇలాంటి స్థితిలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రాథమిక సభ్యుల ప్రయోజనాల కోసం ఉద్యమించాల్సిన చారిత్రక అవసరం ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పెన్షన్ విధానాలపై కూడా పోరాటం చేయాలి.
(వ్యాసకర్త: పూర్వ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్)
– దేవీప్రసాద్