ఇటీవల సాహితీ లోకంలో ఒక అరుదైన సంఘటన జరిగింది. ఒక రచయిత పరీక్ష రాయగా తన రచన మీద తనకే ప్రశ్న వచ్చింది. వివరాల్లోకి వెళితే ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ తెలుగులో డాక్టరేట్ కోసం ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో ప్రి పీహెచ్డీ పరీక్ష రాశారు. విచిత్రం ఏమిటంటే ప్రశ్నపత్రం లో ఆయన రాసిన ‘జిగిరి’ నవలపై ఒక ప్రశ్న వచ్చింది. తను రాసిన నవల మీద తనకే ప్రశ్న రావడంతో రచయిత వింత అనుభూతికి లోనయ్యాడు. పెద్దింటి రచనల మీద వివిధ యూనివర్సిటీలలో ఇంతవరకు ఆరు ఎంఫిల్‌లు నాలుగు పీహెచ్‌డీలు వచ్చా యి. పెద్దింటి కథలు నవలలు వివిధ యూనివర్సిటీలలో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఇదొక అరుదైన సంఘటనగా సాహితీ లోకం చెప్పుకొంటున్నది.
నా నవల గురించిన ప్రశ్నను ప్రశ్నాపత్రంలో చూశాక ముందు నేను నమ్మలేకపోయాను. మరోసారి అటు ఇటు చూసి ప్రశ్నను చదివాను. చాలా ఆనందంగా అనిపించింది. అసలు ఎన్ని అవార్డులు పొందినా ఈ అనుభూతి ఎప్పుడూ పొందలేదు. గుండెనిండా ఊపిరి పీల్చుకొని గర్వంగా ఆనందంగా ఒకసారి చుట్టూ కలియ చూశాను. ప్రశ్న రాద్దామని నెంబర్ వేశాను. కానీ ఎందుకో ఆ ప్రశ్న ఎక్కడ మొదలు పెట్టాలో తెలియలేదు. నా ప్రశ్న నాకే ప్రశ్నగా మిగిలింది. నా ప్రశ్నకు నేను న్యాయం చేయలేనని ఆ ప్రశ్నను చాయిస్లో వదిలిపెట్టి వేరే ప్రశ్నలకు సమాధానాలు రాశాను.
– పెద్దింటి అశోక్‌కుమార్, ప్రముఖ రచయిత