ఘనమైన వారసత్వాన్ని సమున్నత శిఖరాలకు చేర్చడం మాటలు కాదు. మేరునగ సమానమైన సంస్థను కొత్త బాట పట్టించడం అంత తేలిక కాదు. ఆ రెండూ సాధించిన తర్వాత సౌమ్యునిగా, నిగర్విగా మనుగడ సాగించడం అందరివల్లా కాదు. ఆ అరుదైన మానవుడే రతన్ టాటా. పేరులో టాటా ఉందని ఆయన వాసికెక్కలేదు. ముత్తాత జంషేడ్జీ టాటా నాటిన విత్తు మహా వృక్షమైంది. ఆ పారిశ్రామిక సామ్రాజ్యాన్ని సరికొత్త పుంతలు తొక్కించిన ఏకైక వ్యక్తి ఎవరంటే వచ్చే సమాధానం.. రతన్ టాటా. పేరుకు తగ్గట్టు ఆయన జాతి రత్నమే. నిన్నటిలాగే నేడూ అనే రొడ్డకొట్టుడు దారిలో ఆయన వెళ్లలేదు. వందేండ్ల పైచిలుకు కాలం నాటి కంపెనీని ఆధునిక యుగం అవసరాలు తీర్చే టెక్ బాట పట్టించారు. కంప్యూటర్, కమ్యూనికేషన్స్ రంగంలో కొత్త అంగలు వేయించారు. ఆయన సారథ్యంలో టీసీఎస్ ఓ విశ్వ కంపెనీగా ఎదగడం తెలిసిందే. ఒకప్పుడు రవాణా వాహనాలకే పేరు పొందిన కంపెనీని ప్రయాణికుల వాహనాల తయారీలో అగ్రస్థాయికి తీసుకువెళ్లారు. ల్యాండ్ రోవర్, జాగ్వార్ వంటి బ్రిటిష్ కంపెనీలను సొంతం చేసుకొని ఇదీ భారతీయ సత్తా అని చాటారు. సంపన్నులకే కాదు, సామాన్యూలకూ కార్లు అందుబాటులోకి తేవాలని ఆయన పడిన తపన మరచిపోలేం. రెండు విడతల్లో టాటా గ్రూప్ చైర్మన్‌గా రెండు దశాబ్దాలకు పైగా సేవలందించారు. ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్న తర్వాత అంకుర సంస్థలను ప్రోత్సహిస్తూ భారతీయ పారిశ్రామికతలో కొత్తరక్తం ఎక్కించేందుకు కృషిచేశారు.
సమకాలీన భారతీయ పారిశ్రామిక ప్రపంచంలో దిగ్గజంగా అగ్రపూజలు అందుకున్న చరిత్ర ఆయనది. అపూర్వమైన రీతిలో ప్రజాభిమానం చూరగొన్న విభిన్నమైన వ్యక్తిత్వం ఆయన సొంతం. కాసులు వెదజల్లి లాభాలు దండుకోవడమనే అనైతికతకు ఆయన బహుదూరం. నిఖార్సైన నిజాయితీకి నిలువెత్తు రూపంగా జనం ఆయనను పదే పదే గుర్తుచేసుకోవడం, కథలు కథలుగా ఆయనకు సంబంధించిన ఉదంతాలను చెప్పుకోవడం చిన్న విషయం కాదు. వర్గ పక్షపాతాలకు అతీతంగా, లివింగ్ లెజెండ్‌గా సకలజనుల మన్ననలు పొందడం ఆయనకే చెల్లింది. ఎక్స్ వేదికపై 1.3 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రాంలో కోటి మంది ఫాలోవర్లతో సామాజిక మాధ్యమాల్లో అత్యధిక అభిమానం పొందిన పారిశ్రామికవేత్తగా రతన్‌కు లభించిన గుర్తింపే ఇందుకు తార్కాణం.
అయితే ఓ పెద్ద పారిశ్రామిక సామ్రాజ్యానికి సారథిగా ఎదిగివచ్చిన రతన్ వ్యక్తిగత జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. తల్లిదండ్రుల విడాకులతో అనాథగా మారిన ఆయన భావి జీవితంలో ఎందరికో అన్నం పెట్టే స్థాయికి ఎదగడం విశేషం. తన జీవితపు వివిధానేక దశల్లో ప్రేమలు పూచే సీమల లోపల విహరించినా పెండ్లి ఎండమావిగానే మిగిలిపోవడం విషాదం. జంటగా మారే అవకాశం నాలుగుసార్లు తలుపు తట్టి వెనుకకు వెళ్లిపోయిందని ఆయనే చెప్పుకొన్నారు. మహాత్ములకు లోకమే కుటుంబం అన్న సూక్తిని అక్షరాలా నిజం చేసిన అమృతమూర్తిగా అద్వితీయ కీర్తిని పొందారు. పారిశ్రామికవేత్తగా, వ్యక్తిగా ఆయన వేసిన ముద్ర అనితర సాధ్యం. అందుకే ఇవాళ భారతదేశం సజల నయనాలతో ఆయనకు నివాళి ఘటిస్తున్నది.