దేశ కీర్తిని యావత్ ప్రపంచానికి వ్యాప్తిచేసిన పారిశ్రామికవేత్త రతన్ టాటా దివికేగడం బాధాకరం. టాటా సన్స్ సంస్థ మాజీ చైర్మన్ రతన్ టాటా ఇకలేరనే విషయాన్ని దేశం జీర్ణించుకోలేకపోతున్నది. వ్యాపారవేత్తగా ఆయన ఎంతగా రాణించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంపదలోనే కాదు, సమాజ సేవలోనూ ఆయన ఖ్యాతి గడించారు. ఆయన జీవితం యువతకు ఆదర్శం. విలువలపై వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఏకైక పారిశ్రామికవేత్తగా రతన్ టాటా చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు.
అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన రతన్ టాటా.. టాటా కుటుంబానికి సాంకేతికంగా మాత్రమే వారసుడు. రతన్ టాటా తండ్రి నావల్ టాటా సూరత్‌లో దిగువ, మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. నాలుగేండ్ల వయసులోనే నావల్ తండ్రి చనిపోగా, కుటుంబాన్ని పోషించలేక అతని తల్లి అనాథాశ్రమంలో చేర్చింది. నావల్ టాటాను రతన్ జంషెడ్జీ టాటా దత్తత తీసుకున్నారు. అలా నావల్ కాస్త నావల్ టాటాగా మారారు. నావల్ టాటా- సోను దంపతులకు 1937, డిసెంబర్ 28న రతన్ టాటా జన్మించారు. తన పదేండ్ల వయసులో తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. దీంతో నాయనమ్మ నవాజ్ భాయి సంరక్షణలో రతన్ టాటా, అతని సోదరుడు జిమ్మి పెరిగారు. మామూలుగా అయితే రతన్ జీవితంలో కష్టాల్లేవనుకుంటాం, అతను గోల్డెన్ స్పూన్‌తో పెరిగాడనుకుంటాం. కానీ, రతన్ తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూశారు. తను ఆర్కిటెక్ట్ అవుదామనుకుంటే తండ్రి ఇంజినీరింగ్ చేయమన్నాడు, తను అమెరికాలో విద్యాభ్యాసం చేయాలనుకుంటే తండ్రి ఇంగ్లాండ్‌లో చదువుకోమన్నాడు. చివరికి రతన్ తన తాత (జంషెడ్జీ టాటా)ను ఒప్పించి అమెరికాలోని కార్నెగీ వర్సిటీలో చదువుకున్నారు.
రతన్ టాటా 1991లో టాటా గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎప్పుడూ దేశానికే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. తను బాధ్యతలు స్వీకరించే సమయానికి టాటా కంపెనీ రెవెన్యూ రూ.10 వేల కోట్లుగా ఉన్నది. ఆ తర్వాత రతన్ టాటా అంతర్జాతీయస్థాయిలో కంపెనీని విస్తరించారు. కంపెనీ బ్రాండ్ వాల్యూను కొనసాగిస్తూ ఆయన చేపట్టిన సంస్కరణలతో పదవి నుంచి దిగిపోయేసరికి ఏకంగా కంపెనీ రెవెన్యూ రూ.లక్ష కోట్లకు చేరింది. అంబానీ, అదానీల మాదిరి టాటా టాప్ టెన్‌లో ఎందుకు లేరంటే, దానికి కారణం ఆయన సంపదలో 60 శాతం ఎప్పుడూ దాన ధర్మాలకు ఖర్చు చేస్తుంటారు. టాటా ఇండికా వచ్చిన కొత్తలో కంపెనీ నష్టాల్లో ఉండగా, అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్స్‌కు అమ్ముతామనుకుంటే వాళ్లు ఎగతాళిగా మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అదే ఫోర్డ్ మోటార్స్ నష్టాల్లో ఉండగా వాళ్ల జాగ్వార్, లాండ్ రోవర్‌ని కొని ఫోర్డ్ మోటార్స్‌కు సహాయం చేశారు. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో ఇండియాలో మొట్టమొదట 5/5 రేటింగ్ సాధించిన కార్ (నెక్సాన్) టాటా కంపెనీదే. ఈ కార్ సృష్టికర్త రతన్ టాటానే. ఇండియాలో రిలయెన్స్ తర్వాత రూ.100 బిలియన్లు సాధించిన సంస్థ కూడా టాటానే. ఇలాంటి విజయాలెన్నో రతన్ టాటా జీవితంలో ఉన్నాయి.
రతన్ టాటాకు కుక్కలంటే మక్కువ. 2018లో ఆయనను బ్రిటన్ రాజు ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్’ అవార్డు ఇచ్చేందుకు బకింగ్ హామ్ ప్యాలెస్‌కు ఆహ్వానించారు. అయితే తన పెంపుడు కుక్క అనారోగ్యానికి గురికావడంతో రతన్ టాటా ఆ అవార్డు కార్యక్రమానికి వెళ్లలేదు. అది తెలుసుకున్న బ్రిటన్ రాజు ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటాను అభినందించడం గర్వకారణం. ఉప్పు నుంచి ఉక్కు వరకు టాటా ప్రవేశించని రంగమే లేదు. ఏ రంగ వ్యాపారమైనా నాణ్యత, నమ్మకమే తన లక్ష్యం. అంచెలంచెలుగా ఎదిగిన రతన్ టాటా కృషి అనితరసాధ్యమైనది. నిత్య మార్గదర్శకుడిగా, మానవతవాదిగా పేరు గడించిన ఆయన ప్రపంచంలోనే దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఎదిగారు. ఆయన నేతృత్వంలో టాటా గ్రూప్ తనదైన ముద్ర వేసుకున్నది. లాభాల కంటే చిత్తశుద్ధికే రతన్ టాటా ప్రాధాన్యం ఇస్తారు. అదే ఆయనకు అపార గౌరవాన్ని తెచ్చిపెట్టింది. టాటా తీసుకునే నిర్ణయాలు స్వల్పకాలిక లాభాల కంటే, సమాజ హితం కోసం ఉండాలని భావిస్తారు. వ్యాపారాలను నిర్వహించడంలోనే కాదు, దాతృత్వంలోనూ ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఆయన వ్యక్తిత్వం ఎంతోమందికి ఆదర్శప్రాయం. 2008లో ముంబైలోని తాజ్హోటల్పై ఉగ్రవాద దాడి జరిగినప్పుడు రతన్ టాటా చూపించిన ఉదారత ఎంతో గొప్పది. హోటల్ సిబ్బందితోపాటు బాధితులకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చి, మాట నిలుపుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచానికి విస్తరించే క్రమంలో ఆయనెప్పుడూ భారతీయ విలువలను విస్మరించలేదు. భారతీయుడిగా గర్వపడుతూనే ఆధునిక వ్యాపారంలో అందనంత ఎత్తుకు ఎదిగారు.
తన స్వలాభం కోసమే కాదు, టాటా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల కుటుంబాల కోసం కూడా రతన్ టాటా పరితపించారు. అందుకే, ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబ బాధ్యతను తనమీద వేసుకునేవారు. ఆసియాలో మొదటి క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఇండియాలో మొదటి ఎయిర్ లైన్స్ వరకు టాటాలే ప్రారంభించారు. సాల్ట్ నుంచి సాప్ట్వేర్ వరకు టాటా గ్రూపు అన్ని రంగాల్లో విస్తరించింది. సిగరెట్, ఆల్కహాల్ వ్యాపారాలు తప్ప ఆయన చేయని వ్యాపారం లేదు. గుండు సూది నుంచి గూడ్స్‌రైలు ఇంజిన్ల వరకు టాటా కంపెనీలే నంబర్ వన్. ఆయన చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం రతన్ టాటాను 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది.
రతన్ టాటా 2014లో ‘హానరరీ నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటీష్ ఎంపైర్’ పురస్కారాన్ని క్వీన్ ఎలిజబెత్ నుంచి అందుకున్నారు. 2023లో ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ను అందుకున్నారు. 2023లో మహారాష్ట్ర ఉద్యోగరత్నతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ వర్సిటీలు, దేశాల నుంచి గౌరవ డాక్టరేట్లు, అవార్డులను రతన్ టాటా అందుకోవడం దేశానికే గర్వకారణం. ఇంతటి మహోన్నతమైన వ్యక్తిని కోల్పోవడం యావత్ భారతావనికి తీరని లోటుగా చెప్పవచ్చు.