తెలంగాణ చారిత్రక వారసత్వ సంపదకు ప్రతీక రామప్ప ఆలయం. అక్కడి స్తంభాలపై చెక్కిన మహిళల శిల్పాలు అద్వితీయమైన స్థానిక సంస్కృతికి అద్దం పడుతాయి. వివిధ సామాజిక వర్గాలకు చెందిన వనితల రూపురేఖా విన్యాసాలు ఆ బొమ్మల్లో శాశ్వతత్వం సంతరించుకున్నాయి. ఆలయంలోని అణువణువూ అపురూపమైన ఉద్గ్రంథమే. అంతటి మహత్తర శిల్పవాటిక సాక్షిగా తెలంగాణ ఆడపడుచులకు అవమానం జరిగింది. అతిథి మర్యాదల్లో చోటుచేసుకున్న ‘అతి’కి ఈ గడ్డ ఆత్మగౌరవం చితికిపోయింది. ‘యాల్ల గాని యాల్ల బూపాలం’ పాడినట్టు కాంగ్రెస్ సర్కార్ తలపెట్టిన అందాల పోటీలు అకాల వర్షాలను తలపిస్తున్నాయి.
ఓ వైపు తీవ్రాతి తీవ్రమైన ఉగ్రదాడిని తిప్పికొట్టే ప్రయత్నాల్లో భారత రక్షణ దళాలు నిరంతర అప్రమత్తతతో నిమగ్నమై ఉన్నాయి. ఒకరకంగా ఇది జాతికి పరీక్షా సమయం. ఎప్పుడు, ఎక్కడ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని శాంతిభద్రతల యంత్రాంగం కండ్లల్లో వత్తులు వేసుకుని పహారా కాస్తున్నది. మరోవైపు రాష్ట్రం ప్రకృతి బీభత్సాలతో అతలాకుతలం అవుతున్నది. అకాల వర్షాలు సృష్టించిన విధ్వంసంతో రైతన్నలు ఆగమాగమయ్యారు. వానలు, వరదలు చేతికందిన ధాన్యాన్ని తడిపేసి గుండెకోతను కలిగిస్తున్నాయి. నిన్నటిదాకా కల్లాలు, నేడు కొనుగోలు కేంద్రాలు.. అంతే తేడా. మొదటిది పూర్తిగా ప్రకృతిపరమైన శాపం. రెండోది మాత్రం సర్కారు నిర్లక్ష్యం ఫలితమే. సకాలంలో కాంటా వేసి లెక్క తేల్చకుండా సర్కారు చోద్యం చూస్తున్నది. కొనుగోళ్ల సమస్య రైతుల ఉసురు తీస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రావడం లేదు. ఆ సంగతి అలా ఉంటే సందట్లో సడేమియా అన్నట్టు అందాల పోటీల పేరిట జరుపుతున్న అనవసరమైన హంగామా సర్కారు ప్రాధాన్యాలను ఎత్తిచూపుతున్నది. 420 హామీలు గాలికెగిరిపోయాయి. అవ్వలకు పింఛన్ల పెంపు లేదు. ఆడబిడ్డలకు పెండ్లి ఖర్చుల జాడే లేదు. తులం బంగారం కలలో మాటే. భరోసా ఉత్తమాటే అయ్యింది. ‘యువతకు ఉద్యోగాలు కల్పన’గానే మిగిలిపోయాయి. ఉద్యోగులకు జీతాల పెంపుపై ఊరడింపు దక్కలేదు. పాలన పడకేసింది. ప్రగతి ముఖం చాటేసింది.
గల్లీ నుంచి ఢిల్లీ దాకా కనీవినీ ఎరుగని కల్లోల పరిస్థితుల్లో దేశం అట్టుడికిపోతున్నది. అయినా ప్రభుత్వానికి అర్జెంటుగా అందాల పోటీలు కావలసి వచ్చాయి. ఈ పోటీలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ఏ మాత్రం సరిపడవని మహిళా సంఘాలు గొంతెత్తి చాటినా అది చెవిటి సర్కారు చెవిలో శంఖమూదడమే అయ్యింది. అసమర్థత, అవినీతితో కుళ్లి కంపు కొడుతున్న సర్కారు అందాల పోటీలతో అత్తరు అద్దుకోవాలని చూస్తున్నట్టు కనిపిస్తున్నది. బుల్డోజర్ల అండతో సాగిస్తున్న భూ దాహానికి సర్వోన్నత న్యాయస్థానం పెడుతున్న చివాట్లతో సర్కారుకు చీమకుట్టినట్టయినా అనిపించడం లేదు. అందాల పోటీల మిరుమిట్లతో సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలని చూస్తున్నది. సుందరీమణుల ప్రతిభా పాటవాల మాటేమో గానీ ఈ నేల గరిమకు అవి పరీక్షలు పెడుతున్నాయి. ఈ వైపరీత్యం రోజురోజుకూ శృతిమించుతున్నది. రామప్ప సాక్షిగా సుందరీమణుల కాళ్లను తెలంగాణ ఆడబిడ్డలతో కడిగించడం ఓ పరాకాష్ఠగా నిలుస్తున్నది. తెలంగాణ సోయి లేని చేతకాని పాలకుల చేతుల్లో మన ‘లచ్చుమమ్మ’లు చిన్నబోయే పరిస్థితి రావడం దురదృష్టకరం.