హైదరాబాద్ చుట్టూ మరో మణిహారం లాంటి రహదారికి ఏడేండ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించింది. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్‌కు సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో దీని నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది. 340 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ రహదారి హైదరాబాద్ చుట్టూ ఉన్న 9 జిల్లాలను కలుపుతుంది. ఇతర రాష్ర్టాలకు వెళ్లే వాహనాలు లోపలికి వచ్చే అవసరం లేకుండానే తమ పయనం కొనసాగిస్తాయి.
రెండు మహా రహదారుల మధ్య కొత్తగా పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు ఏర్పడతాయి. రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం, నిర్వహణ, భూసేకరణ నిమిత్తం ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విభజించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ రహదారికి అప్పట్లోనే కొంత భూసేకరణ, నిధుల సమీకరణ జరిగింది. ఉత్తర ప్రాంత రోడ్డు నిర్మాణం కోసం ఆయా జిల్లాలోని రైతుల నుంచి భూసేకరణ కూడా అప్పుడే పూర్తయింది. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్లో తమ భూములు పోతాయేమోనన్న భయంతో రోడ్డెక్కుతున్న రైతులంతా దక్షిణ భాగపు మార్గం గ్రామాలకు చెందినవారే! ప్రస్తుత ప్రభుత్వం ఈ వైపు రహదారి నిర్మాణపు అలైన్మెంట్ మార్చబోతున్నదన్న భయం ఆ రైతులను పట్టిపీడిస్తున్నది. మూడు నెలలుగా వారు అధికారులు, నాయకుల చుట్టూ తిరుగుతున్నా ఎక్కడా స్పష్టత దొరకడం లేదు. దాంతో వారి భయం పెరిగి తమ భూములు రోడ్ కింద పోవడం ఖాయమని బెంబేలెత్తుతున్నారు.
మొదటి ప్రతిపాదిత మ్యాప్ ప్రకారం చౌటుప్పల్ నుంచి యాదాద్రి మీదుగా సంగారెడ్డి వరకు 182 కిలోమీటర్ల మేరకు దక్షిణం వైపు ఉన్న రీజినల్ రోడ్ అలైన్మెంట్ సాగుతుంది. ఇప్పుడు దాని మార్గాన్ని మార్చుతూ కొత్త నక్ష తయారైందని ప్రచారం జరుగుతున్నది. దాని వల్ల 20 కిలోమీటర్ల దూరం కూడా పెరుగుతుందని తెలుస్తున్నది. ఈ మార్పు ప్రకారం నిర్మాణ ఖర్చు కూడా వందల కోట్లలో పెరుగుతుంది. కొందరు పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం సదరన్ అలైన్మెంట్ మార్చుతున్నారని రైతులు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయి, రైతులు తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట, గజ్వేల్, సంగారెడ్డి ప్రాంత బాధిత రైతులు కేటీఆర్‌ను కలువగా, వారి పక్షాన పోరాడేందుకు సంసిద్ధతను తెలిపారు. చట్టసభల్లోనూ ప్రభుత్వ వైఖరిని నిలదీస్తామని వారికి హామీ ఇచ్చారు.
ట్రిపుల్ ఆర్ సదరన్ అలైన్మెంట్లో మార్పు జరిగిందని నెల రోజుల క్రితం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బహిరంగంగా మాట్లాడారు. చౌటుప్పల్ దగ్గరలో ఉన్న ప్రైవేటు కంపెనీల భూములను కాపాడేందుకు ప్రభుత్వం రూటు మార్చిందని, దానిని ఒప్పుకునేది లేదని ఆయన తేల్చిచెప్పారు. తన నియోజకవర్గం రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు ఎంతదాకా అయినా వెళ్తానని ఆయన తనను కలిసిన రైతులతో చెప్పారు. రెండు రింగ్ రోడ్ల మధ్య దూరం అన్ని వైపులా ఒకేలా ఉండాలని, మునుగోడులో మాత్రం కొన్ని చోట్ల ఈ దూరం తగ్గిందని, దారి వంకరటింకరగా మారిందని పేర్కొన్నారు.
చౌటుప్పల్‌లోని పరిశ్రమలు, ప్రైవేటు కంపెనీల మేలు కోరిన ప్రభుత్వ చర్య ద్వారా వందలాది మంది రైతులు తమ వ్యవసాయ భూములు కోల్పోతున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మంత్రివర్గం ఆమోదంతో కేంద్రానికి సమర్పించిన డీపీఆర్ గోప్యంగా ఉంచారు. స్థానిక ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో దాపరికం అవలంబిస్తున్నది. ప్రభుత్వ ప్రణాళిక ఏమిటో ప్రజాప్రతినిధులకు కూడా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, అధికారులు కలిసి రింగ్ రోడ్ ప్రాంత ఎమ్మెల్యేలతో వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాజ్‌గోపాల్‌రెడ్డి కోరారు.
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చిట్యాలలో తనను కలిసిన బాధిత రైతులతో ఈ విషయంలో దాటివేత ధోరణిలో మాట్లాడారు. ప్రాంతీయ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఇంకా పూర్తి కాలేదని, కేంద్రం ఆమోదానికి పంపినది ప్రాజెక్ట్ నివేదిక మాత్రమేనని ఆయన అన్నారు. కొత్తగా రైతులు భూములు కోల్పోతున్నారనేది దుష్ప్రచారమేనని, వాటిని నమ్మవద్దని వారికి చెప్పారు. చౌటుప్పల్‌లో ఒక ఫార్మా కంపెనీ కోసం అలైన్మెంట్ మార్చుతున్నారనే వార్త అవాస్తవమని, ఎంత పెద్దవారి భూములు అడ్డువచ్చినా రూటు మార్చే ప్రసక్తే లేదని రైతులతో పేర్కొన్నారు. అయితే మంత్రి ఇచ్చిన భరోసా ప్రజల్లో పని చేయలేదు. ఆయన మాటలతో సంతృప్తి చెందని పలు గ్రామాల బా ధితులు న్యాయం కోసం హెచ్ఎండీఏ కార్యాలయం ముందు భారీ ధర్నా చేశారు. సాగు భూమి తక్కువగా ఉన్న పాత అలైన్మెంట్ ప్రకారమే ప్రభుత్వం రహదారి నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఏడు జిల్లాలకు చెందిన రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. గత మూడు నెలలుగా అన్ని ప్రాంతాల బాధిత రైతులు రహదారి అలైన్‌మెంట్‌ను మార్చొద్దని కోరుతూ ఈ ఆఫీసు ముందు చేస్తున్న ధర్నా కొనసాగుతూనే ఉంది.
ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన అంతా ఫోర్త్ సిటీ చుట్టే తిరుగుతున్నది. రీజినల్ రింగ్ రోడ్‌తో ఆ కలల నగరాన్ని అనుసంధానం చేయాలని ఆయన అనుకుంటున్నారు. దాని కోసం సదరన్ అలైన్మెంట్ మార్పు అవసరం. అందుకే ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఎవ్వరూ ఈ విషయంలో నోరు విప్పడం లేదు. పాత మార్గాన్ని మార్చడం లేదనే ఒక్క నమ్మకమైన మాట రైతులకు చాలు. ఆ మాట అనేవారు లేకుండాపోయారు. వాస్తవాలను నాయకులు దాస్తున్నారనే అనుమానంతో అధికారులను రైతులు నిలదీస్తున్నారు. కేంద్రానికి డీపీఆర్ పంపిన విషయం నిజమేనని కానీ, కేంద్రం నుంచి ఆమోదం వచ్చేదాకా దానిని బయటపెట్టకూడదని వారు అంటున్నారు. బహిరంగ మార్కెట్లో భూముల ధరలు ఎకరాకు కోట్లు పలుకుతుండగా, సర్కారు వారి రేటు లక్షల్లో ఉంది. ఆ వ్యత్యాసాన్ని లెక్కేసుకొనే భూమి పోతుందని రైతులు చలించిపోతున్నారు. అలైన్మెంట్ మార్పు విషయంలో, పరిహారం చెల్లింపు గురించి రైతులకు ప్రభుత్వం ఓ స్పష్టత ఇవ్వాలి. స్థానిక ఎన్నికల దృష్టితో వారిని ఇలా మభ్యపెట్టడం సరికాదు. రైతులను ప్రభుత్వం దొంగదెబ్బ తీయకుండా, అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు వారికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది.