తెలంగాణ రైతులు ప్రభుత్వం రోజుల తరబడి కొనుగోలు చేయని ధాన్య రాశులను, వర్షానికి మళ్లీ మళ్లీ తడిసిపోతున్న ధాన్య రాశులను చూడలేక దుఃఖిస్తున్నట్టున్నారు. అందుకు బదులు వారు మరికొద్ది రోజులలో తమ రాష్ట్ర రాజధానికి రానున్న ప్రపంచ సౌందర్య రాశులను కనులారా చూసి ఆనందించవలెను. పంటలు పండటం పండకపోవటం, అమ్ముడుకావటం కాకపోవటం, వానలకు తడవటం, తడవకపోవటం, అదంతా చూసి మీరు ఏడ్వటం ఏడ్వకపోవటం, తట్టుకోలేని వారు ఆత్మహత్యలు చేసుకోవటం చేసుకోకపోవటం ఎప్పుడూ ఉన్నదే. కానీ, ప్రపంచం నలుమూలల నుంచి అత్యద్భుతమైన సుందరాంగులు మీ కళ్లెదుటకు వచ్చి విన్యాసాలు చేయటాన్ని ఎన్నడైనా కలలోనైనా ఊహించారా? అందువల్ల ఊరట చెంది పరవశించండి. పంటల భారం ప్రభుత్వంపైగాక దేవునిపై వేయండి.
ఒకటి కాదు, రెండు కాదు మొత్తం 120 దేశాల అందగత్తెలను ఇంత దూరం రప్పించటం అంతిమంగా మీ మేలు కోసమేనన్న మాట మీకు ఎవరైనా చెప్పారో లేదో తెలియదు. వారంతా హైదరాబాద్‌లో జరిగే మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనటం వల్ల ప్రపంచం దృష్టి అంతా మన నగరంపై పడుతుంది. దానితో ప్రపంచ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున కదలివచ్చి ఇక్కడ పరిశ్రమలు, వ్యాపారాలు నెలకొల్పుతారు. టూరిస్టులు లక్షలకు పెరుగుతారు. మన ఆదాయాలు, ఆర్థిక పరిస్థితి ఆకాశానికి ఎదుగుతాయి. అప్పుడు ఆ ధనరాశులను వినియోగించి మీ ధాన్య రాశులను ‘ఒక్క గింజ అయినా మిగలకుండా’ ఖరీదు చేసే రోజు తప్పక వస్తుంది. అంతేకాదు, మన రాబడుల స్థాయి ఎంతగా పెరిగిపోతుందంటే, రైతులకు ఎన్నికల సమయంలో మేమిచ్చిన హామీలు ప్రతి ఒక్క దానినీ నూటికి నూరు శాతం మరొక ‘నూరు రోజు’ల్లోనే అమలు చేయగలం.
రూ.2 లక్షల వరకు పూర్తి రుణమాఫీ, రైతు భరోసా ఎకరానికి ఏడాదికి రూ.15,000, రైతులతో పాటు కౌలుదారులకు రూ.15,000, భూమిలేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి రూ.12,000, ‘అన్ని పంటలనూ మెరుగైన మద్దతు ధరతో’ ప్రభుత్వమే కొనుగోలు చేయటం, పంటలు నష్టపోయిన రైతులకు ‘తక్షణ నష్ట పరిహారం’ అందేట్లు చూడటం, ‘పటిష్టమైన పంటల బీమా పథకం’, రైతు కూలీలకు, భూమి లేని రైతులకు కూడా రైతు బీమా పథకాన్ని వర్తింపజేయటం మొదలైన ఇంకా అనేక హామీలు గల ‘వరంగల్ రైతు డిక్లరేషన్’ను, అందుకు అదనంగా వరికి క్వింటాలుకు రూ.500 బోనస్ అని ప్రకటించిన కాంగ్రెస్ మేనిఫెస్టోను వెంటనే అమలుకు తెచ్చేందుకు కావలసిన ధనరాశులన్నీ ఈ సౌందర్యరాశుల పోటీతో, దాని వెనువెంట పోటీపడి రాగల పరిశ్రమలు, వ్యాపారాలతో మనకు లభించనున్నాయి. ఈ సందర్భంలో మీకు మరొక హామీనివ్వాలి. మా హామీల కింద గత 17 నెలలుగా రైతాంగానికి చాలా బాకీ పడ్డాము. పైకి చెప్పటం లేదుగాని అందుకు ఎంతో చింతిస్తున్నాము. ఇప్పుడు ఈ ఆదాయంతో ఆ బకాయీలన్నీ కూడా ఒకే విడతలో తీర్చి వేయగల శక్తి లభిస్తుంది. మీ కళ్లలో ఆ ఆనందాన్ని చూడాలన్నది మా కోరిక. నమ్ముతారో లేదోగాని అసలు ఈ సౌందర్య పోటీల ఆలోచన చేసి, ఎవరు ఏ విమర్శలు చేసినా పట్టుదలతో నిర్వహిస్తున్నదే అందుకోసం. మీ కోసం, మన తెలంగాణ కోసం, మా ప్రభుత్వం కోసం ఇంతటి సదవకాశాన్ని కల్పిస్తున్న దేశదేశాల అందాల రాశులందరికీ పేరుపేరునా మా కృతజ్ఞతలు.
వాస్తవానికి పంటల పరిస్థితి ఇట్లా అవుతున్న రైతులు మాత్రమే కాదు. ప్రభుత్వం మాట తప్పి నీరివ్వక యాసంగి పంటలు ఎండిన రైతులు కూడా , తమ ఎండిన పంటలకు నష్టపరిహారం విషయమై ఇక ఇప్పుడు ఆశలు పెట్టుకోవచ్చు. యాసంగికి ముందు రైతులకు మేమే చెప్పాం, వరి వేసుకోండి అని. మొదట నీరిచ్చి కొన్ని ప్రాంతాలలో మధ్యలో ఆపాం.
ఆ పొలాలు ఎండుతుంటే రైతులు ఎంత గోసపడుతున్నా నీళ్లు ఇవ్వలేదు సరికదా జవాబు అయినా చెప్పలేదు. పరిహారం అడిగినా మాట్లాడలేదు. అట్లా ఎందుకయిందనే మాటలు ఇప్పుడెందుకు గాని, పరిహారం ఇస్తామని మాత్రం ఇక నమ్మకంగా చెప్తున్నం. అంత నమ్మకం ఎందుకో అర్థమయ్యే ఉంటుంది. వరల్డ్ బ్యూటీస్ అంతా మన హైడ్రబాడ్కు వస్తున్నారు. ఈ నెల ఎనిమిదో తారీఖు వరకే వచ్చి ఒకటి కాదు , రెండు కాదు మూడు వారాల వరకు ఇక్కడే ఉంటారు. తర్వాత ఇక పరిశ్రమలే పరిశ్రమలు. వ్యాపారాలే వ్యాపారాలు. డబ్బే డబ్బు. అందులోంచి మీకు పరిహారాలే పరిహారాలు. ఈ యాసంగివే కాదు. ముందు ముందు మళ్లా మళ్లా ఎండినా పరిహారాలకు కావలసినంత ఆదాయం వస్తుంది. అయితే మీకొక విజ్ఞప్తి. ఆ జగదేక సౌందర్య రాశులు వచ్చిన తర్వాత రోజులలోనూ రైతులకు అనేక సమస్యలు కొనసాగే అవకాశం ఉండవచ్చు. అయినా యాసంగి ఎండినవారు, పండిన ధాన్యం ఖరీదు కాని వారు, వానలకు తడిసిన వారు ఎవరూ కూడా దయచేసి రోడ్లు ఎక్కొద్దు. ఆందోళనలు చేయొద్దు. ఆ బ్యూటీలను రప్పించటం, పెరేడ్లు చేయించటం అంతా మీ కోసమే గదా. అర్థం చేసుకొని సహకరించండి. వస్తున్న బ్యూటీలను భయపెట్టకండి.
మీకు తెలుసో తెలియదో గాని మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ వంటి కార్యక్రమాలు ప్రపంచంలోని అనేక దేశాలలో ఇప్పటికే జరిగాయి. వాటిలో సెషల్స్, ప్యూర్టో రికో, ఎల్ సాల్వడార్, ఈక్వెడార్, నమీబియా, పెరూ వగైరా వగైరా దేశాలు, నగరాలూ ఎన్నెన్నో ఉన్నాయి. వాటిలో చాలా వాటిపేర్లు కూడా మీరు విని ఉండరు. అయితేనేమి, ఈ అందాల సుందరులంతా అక్కడకు వెళ్లగా అవి అత్యద్భుతంగా అభివృద్ధి చెందాయి. పరిశ్రమలు, వాణిజ్యాలు, ఆదాయాలలో, ముఖ్యంగా అక్కడి రైతులకూ పేదలకూ సహాయాలలో, వారు శాశ్వతంగా బాగుపడటంలో. ఆ తర్వాత నుంచి అవి అగ్రరాజ్యాలకు సమానంగా ఎదిగాయి. అంతెందుకు. లోగడ మన దేశంలోనే బెంగళూరు, బొంబాయిలలో జరిగాయి. ఆ పోటీల వల్లనే ఆ నగరాలు, రాష్ర్టాలు అంత అభివృద్ధి చెందాయి. హైదరాబాద్, తెలంగాణ ఇంత వెనుకబడి ఉండటానికి కారణం అటువంటి పోటీలు ఇంతకాలం జరగకపోవటమేనని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మమ్ములను అడిగితే, దేశంలోని వెనుకబడిన రాష్ర్టాలన్నీ సుందరుల పోటీలు నిర్వహించటాన్ని ఒక విధానంగా మార్చుకోవాలి.
ఆరు గ్యారెంటీలను, 420 హామీలను అమలుపరిచేందుకు నిధుల కొరత ఇక ఎంతమాత్రం ఉండబోవటంలేదు. ఇందిరమ్మ ఇళ్లు పేదలందరికే గాక, మేము ఇళ్లు కూలగొట్టిన మూసీ వాసులందరికీ నిర్మించి ఇస్తాం. ఆత్మహత్యలు చేసుకున్న రైతులందరి కుటుంబాలకు భారీ పరిహారం చెల్లిస్తాం. తులం బంగారం ధర లక్ష కాదు గదా రెండు లక్షలైనా సరే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద ఇకముందే గాక, గత 17 నెలలో పెండ్లిళ్లు అయిన వారందరికీ ఇస్తాం.
చనిపోయిన రైతులకు రైతుబీమా, మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున బకాయిలూ, కొత్తవీ, ఆడపిల్లలకు స్కూటీలు, చేయూత పింఛన్లు రూ.4,000 చొప్పున, వికలాంగులకు రూ.6,000 లెక్కన, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు, ఉద్యమకారులకు 250 గజాల ఇంటిస్థలం, ఆటో డ్రైవర్లకు రూ.12,000 చొప్పున, నిరుద్యోగ భృతి నెలకు రూ.4,000, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు (మొదటి సంవత్సరపు బకాయీలు), ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు నెలకు రూ.25,000 నెలవారీ పింఛన్, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సహాయం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 10వ తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్, పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ స్థాయిలలో రూ.10 వేల నుంచి రూ.5 లక్షల వరకు అందజేయటం, గొర్రెల పెంపకందారులకు నేరుగా రూ. 2 లక్షల చొప్పున చెల్లింపు మొదలైన అనేక ఆర్థికపరమైన హామీలన్నింటికి ఇక నిధులు నిరంతరాయంగా లభించనున్నాయి. అంతేకాదు, సిబ్బందికి డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు, అన్నిరకాల ఉద్యోగులకు మొదటి తేదీనే వేతనాల చెల్లింపులకు ఇక సమస్య ఉండబోదు.
కేవలం ఎన్నికలలో గెలిచేందుకు అలవిగాని హామీలు ఇచ్చి ఇప్పుడు డబ్బు కొరత అని మాట్లాడుతున్న మేము, మీ దృష్టిని మరల్చేందుకు వారానికొక తమాషా చేస్తున్నట్టే, ఇప్పుడు అందచందాల పోటీలతో మీ కళ్లు జిగేల్మనిపింపజేసి తిరిగి దృష్టి మళ్లింపజూస్తున్నామని దయచేసి అపోహపడవద్దు. అది సమంసజమైన అనుమానం కాబోదు. ఎందుకంటే, ఆర్థిక సమస్యలను మొదటనే అంచనా వేసిన మేము వాటిని అధిగమించేందుకు సుందరాంగుల ప్రదర్శనా నిర్వహణ ఒక్కటే మార్గమని అప్పుడే నిర్ణయించుకున్నాము. గత ప్రభుత్వపు అప్పులను ఎత్తిచూపుతూనే అంతకుమించిన అప్పులు చేస్తున్నాము గాని, కోరినన్ని అప్పులు పుట్టడం లేదు. పుట్టబోవన్నది కూడా ముందే తెలుసు. కానీ ఆ మాట ప్రజలకు చెప్పలేము. అటువంటప్పుడు ధీరులు, సమర్థులు, ముందుచూపు గలవారు ప్రజాక్షేమం కోరుకునేవారు చేయవలసింది సమస్యలకు తరుణోపాయాన్ని అన్వేషించటం. సరిగా అటువంటి అన్వేషణా క్రమంలో ఆలోచనలకు ఒక మెరుపు వలె తట్టినటువంటిది మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ.
ఈ కార్యక్రమాలన్నీ వరుసగా మూడు వారాల పాటు అన్ని టెలివిజన్ ఛానళ్లు, యూట్యూబ్‌లు వగైరాలలో తప్పక ప్రసారమవుతాయి. మధ్యలో భారత-పాకిస్థాన్ యుద్ధం వచ్చి ఇందుకు కొంతైనా భంగం కలిగించదరాదని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. యుద్ధం వచ్చినా కొన్ని ప్రసారాలైనా జరుగుతాయి. రైతుల నుంచి మొదలుకొని రాష్ట్ర ప్రజలంతా వాటిని తమతమ కష్టనష్టాలన్నింటిని తాత్కాలికంగా మరిచిపోయి వీక్షించి ఆనందించగలరని కోరుతున్నాను. ప్రత్యేకంగా ఎందుకంటే, ఆ దరిమిలా అనూహ్యమైన అభివృద్ధి జరిగి ప్రస్తుత సమస్యలన్నీ కడతేరనున్నాయి గనుక.