తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అర్పించిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. ముల్కీ ఉద్యమం మొదలుకొని మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు అన్ని దశల్లోనూ ఆయన ఉద్విగ్నంగా భాగస్వాములయ్యారు. ‘ప్రజలకు తమ కష్టాలకు సంబంధించిన అనుభవాలు ఉంటాయి కానీ, కారణాలు తెలియవు. వాటిని తెలియజేసే కర్తవ్యం బుద్ధిజీవులదే’నని జయశంకర్ సార్ నిశ్చితాభిప్రాయం.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను పూసగుచ్చినట్టు వివరించే బాధ్యతను జయశంకర్ సార్ ఒక పవిత్ర కర్తవ్యంగా స్వీకరించారు. రెండు భిన్న చారిత్రక దశలను కలిగి ఉన్న ప్రాంతాలను కలపటం వల్ల జరిగిన అనర్థాన్ని, ఆంధ్ర వలస వాదానికి తెలంగాణ బలైపోయిన తీరును ఆయన ఆధారాలతో సహా నిత్యం రికార్డు చేస్తూ వచ్చిండ్రు. ప్రాంతీయ అసమానతల అధ్యయనానికి ఆయన నూతన ఒరవడి దిద్దిండ్రు. కేసీఆర్‌కు వెన్నంటి ఉంటూ తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా రాజకీయ పక్షాల నుంచి ఆమోద లేఖలను సంపాదించడం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది. భావజాల రంగంలో జయశంకర్ సార్ చేసిన కృషి వల్లనే సమైక్యవాదం నిలబడలేకపోయింది.
జయశంకర్ సార్ రచనలు ఉద్యమకారులకు గొప్ప ఆయుధాలైనయి. తెలంగాణ ఎల్లెడలా పర్యటిస్తూ ఉద్యమకారులకు నైతిక ైస్థెర్యాన్ని అందించారు. భిన్న భాషలు, కులాలు, మతాల ప్రజలు సామరస్యంగా జీవించే సంపద్వంతమైన తెలంగాణ సంస్కృతికి ప్రతీక జయశంకర్ సార్. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో పాండిత్యం కలిగిన ప్రతిభామూర్తి. ఒక మతానికి ఒక భాష ఉండవచ్చును కానీ, భాషకు మతం ఉండదని ఆయన పదే పదే చెప్పేవారు. హిందూస్థానీ భాషగా ఉర్దూ పట్ల ఆయనకు అమితమైన గౌరవం, అభిమానం ఉండేది. ఉపన్యాసాల్లో మిర్జా గాలిబ్, సాహిర్ లూధియాన్వీ, మగ్దూం మొహియుద్దీన్ వంటి ఉర్దూ కవుల కవిత్వ పంక్తులను ఆయన విరివిగా ఉటంకించేవారు. స్ఫుటమైన తెలుగులో ఎంత గొప్పగా ఉపన్యాసం చెప్పేవారో ఫసీ ఉర్దూలో అంతే గొప్పగా ఉపన్యసించేవారు. ‘నా ఆలోచన మొదట ఉర్దూలో సాగుతుంది. ఆ తర్వాత సమానార్థకాలైన తెలుగు లేదా ఆంగ్ల పదాలను నేను ఎంచుకుంటా’నని ఆయన చెప్పేవారు. అయితే, ప్రజాకవి కాళోజీ, ఆచార్య జయశంకర్ వంటి పెద్దలు నెలకొల్పిన మత సామరస్య విలువలను మంటగలిపే ప్రయత్నం మన తెలంగాణలో పెచ్చరిల్లడం విషాదం. జయశంకర్ సార్ స్ఫూర్తితో ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు బుద్ధిజీవులను సమాయత్తం చేసే ప్రయత్నం చేస్తున్నది తెలంగాణ వికాస సమితి.
ఓం సహానా వవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై ఓం శాంతిః శాంతిః శాంతిః
ఒకరినొకరు ద్వేషించకుండా కలిసి జీవించాలని, కలిసి పంచుకోవాలని, కలిసి విశ్వశాంతికై పాటుపడాలని శాంతి మంత్రాన్ని ప్రవచించిన నేల మన భారతదేశం. భారతీయ ఆధ్యాత్మిక తేజోమూర్తిగా విలసిల్లిన స్వామి వివేకానంద చికాగోలో సర్వమత సమ్మేళనంలో తన ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ ‘భారతీయులమైన మేము సర్వమత సహనాన్నే కాక సర్వమతాలు సమానమని విశ్వసిస్తాం. సమస్త దేశాల నుంచి పరపీడితులై, శరణాగతులై వచ్చిన వారికి శరణమిచ్చిన దేశం నా దేశమని గర్విస్తున్నాను. రోమన్ల నిరంకుశత్వానికి గురై దక్షిణ భారతానికి వచ్చి శరణు పొందిన యూదులను, జొరాష్ట్రీయ సంఘంలో మిగిలిన పారశీకులను కౌగిట చేర్చుకొని ఆదరించిన నా ధర్మాన్ని చూసి గర్విస్తున్నాను. ఆకాశాత్పతితం తోయం, యథా గచ్ఛతి సాగరం, సర్వ దేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి.. వివిధ ప్రదేశాల్లో జన్మించిన నదులు సముద్రంలో కలసినట్లే, వివిధ భావాలచే మనుషులు అవలంబించే వివిధ ఆరాధనా మార్గాలు వేరువేరుగా కనపడినా, సర్వేశ్వరా, నిన్నే చేరుతున్నవి’ అని పేర్కొన్నారు. జాతీయోద్యమ కాలంలో ‘ఈశ్వర్ అల్లా తేరేనామ్.. సబ్ కో సన్మతి దేభగవాన్’ అని మహాత్మాగాంధీ ప్రబోధించిన సర్వమత సమానత్వ సందేశం జాతి జనులను ఒక్కతాటిపై నడిపించింది. ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించింది.
సమాతామూర్తి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని శాంతి, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆధునిక విలువలకు ప్రతిబింబంగా తీర్చిదిద్దారు. భారత రాజ్యాంగం అన్ని మతాలకు, సంస్కృతులకు సమాన హక్కులను, గౌరవాన్ని ప్రమాణం చేసింది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనం జరిపిన పోరాటం సైతం సకల జనుల స్ఫూర్తిని చాటింది. మనం చేసిన సమ్మె సకల జనుల సమ్మె. అంతేకానీ అది ఒక మతానికో, కులానికో చెందిన సమ్మె కాదు. వివక్షకు వ్యతిరేకంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏ వర్గం పట్ల, ఏ మతం పట్ల వివక్ష ఉండకూడదు. ప్రభుత్వాలు ఏవైనా అన్ని వర్గాలు, మతాలు, కులాల ప్రజలను విశ్వాసంలోకి తీసుకుంటూ, అందరినీ ఒక్కటిగా నిలుపుతూ శాంతి సామరస్యాలను కాపాడుతూ తెలంగాణను ప్రగతి పథంలో నడిపించాలి. భూస్వామ్య పీడనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరించి ఒక మతఘర్షణ స్థాయికి కుదించిన సినిమాకు ప్రస్తుత ప్రభుత్వం గద్దర్ అవార్డును ప్రకటించింది. ఇది గద్దర్ పాటించిన విలువలకు, తెలంగాణ గంగాజమునా తెహజీబ్‌కు విఘాతం కలిగించిన ప్రతీఘాతుక చర్య. ‘జై తెలంగాణ’ నినాదాన్ని మసకబార్చటం కూడా తీవ్ర అభ్యంతరకర చర్యగా భావిస్తున్నాం. తెలంగాణలో వందల సంవత్సరాలుగా నెలకొన్న గంగాజమునా తెహజీబ్‌ను కాపాడుకోవటం కోసం తెలంగాణ వికాస సమితి ఈనెల 9న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం 5 గంటలకు కొత్తపల్లి జయశంకర్ స్ఫూర్తి సభను నిర్వహిస్తున్నది. ఈ సభలో ప్రముఖ సినీనటులు ప్రకాశ్‌రాజ్ ‘వైషమ్యాల సుడిలో వైవిధ్య భారతం’ అనే అంశంపై ఆచార్య జయశంకర్ స్మారకోపన్యాసం చేస్తారు. ప్రొఫెసర్ హరగోపాల్ విశిష్ట అతిథిగా పాల్గొంటారు. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ వి.ఎస్.ప్రసాద్, విఖ్యాత నవలా రచయిత అంపశయ్య నవీన్, ప్రముఖ ఇంజినీరు, సామాజికవేత్త శ్రీధర్‌రావు దేశ్‌పాండేలకు గౌరవ పురస్కారాలు అందజేస్తున్నాం. ప్రజాస్వామిక వాదులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
– తెలంగాణ వికాస సమితి