పొగిడేవారు ఎంతైనా పొగడవచ్చు. తిట్టేటోళ్ళకు మరీ అన్ లిమిటెడ్ కావొచ్చు. పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డామని తమను తాము మోసం చేసుకొన్నా, చేసుకోకపోయినా ఇతరుల మెదడులో విషబీజాలు నాటేందుకు దుస్సాహసం చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే, గత పాలకులే నయం అని దునియాలోని టోకు మానసిక భావదారిద్య్రం బాపతులు ఉండొచ్చు. ఓర్వలేక కడుపుబ్బి నిత్యం ఒర్లుతూ ఉపశమనం పొందవచ్చు. అభిప్రాయాలు ఎలాగైనా సౌండ్ ఇయ్యొచ్చు. వాదనల రొద డామినేట్ చేయొచ్చు. కడుపులోని కుళ్లు నోటి గేట్లను ధ్వంసం చేసి పోటెత్తవచ్చు. నోటి మాటలు కట్టలు తెగొచ్చు. వాటికన్నింటికీ మించినవి వాస్తవాలు, పరిస్థితులు. ఇవి అబద్ధం చెప్పవు. మసిపూసి మారేడు కాయ అంతకన్నా చేయవు. ఉన్నది ఉన్నట్టు చెప్తాయి.
అయినవారు, కానివారు ఎవరైనా ఒప్పుకొని తీరేది మనలో అణువణువునా తెలంగాణ సోయి/చైతన్యం రగిల్చింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. పాపులర్ సంక్షిప్త నామం కేసీఆర్. ఆ చైతన్యమే మన చేత మన పాలనై తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు స్వాగత తోరణమైంది. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం కాదు మనం. నియ్యత్ గల తెలంగాణ బలగం మనది. తిన్న, తింటున్న రేవు తలసే సమయం ఆసన్నమైంది. ఒక్కసారి పదేండ్లకు ముందు- ఈ పదేండ్లలో పిన్ పాయింట్లుగా ఫీల్డ్ రియాలిటీలు మనం చేసుకోవాలి.
ఊరు అంతర్గత మెయిన్ రోడ్డుకు జస్ట్ వెయ్యి మీటర్ల సీసీ దారి కావాలంటే ఆంధ్రా పాలకుల కరుణాకటాక్షాలు కావాల్సి ఉండె. మరిప్పుడు అసలు సీసీ తొవ్వ వేయడానికే తొవ్వ వెతకాల్సిన స్థితి! అంటే ఆటోమేటిగ్గా అంతలా మౌలికాలు మన వాకిట్లకు వచ్చాయి. అడవిలో సుత ఆముదం చెట్టే మహావృక్షంలా తోచిన రోజులు పోయి, అడవులు అడవులవడమే గాక ఆ అడవులే మన ఊరికి నడిచొచ్చి వెల్కం చెప్తున్న పచ్చదనాలతో నందనవనాలవడం మన కేసీఆర్ మానసపుత్రిక హరితహారం కమాల్.
ఎండకాలమైనా, ఏ కాలమైనా గొంతు ఆరిపోయి బిందెల జవుడాలు పాని పట్టు యుద్ధాలు ఉక్రెయిన్-రష్యా వార్‌కు మించి సుదీర్ఘకాలం మన గల్లీలో చూసినం. మనమూ అనుభవించినం. మరిప్పుడు బొటన వేలు, చూపుడు వేలు సమన్వయం చాలు. సరాసరి సేఫ్ వాటర్ నట్టింటిని అభిషేకం చేస్తున్నది. రుబాబ్‌గా, బిందాస్‌గా ఇంటి నీటి సౌలత్ను ఎంజాయ్ చేస్తున్నం.
ఇగ పొలం నీటి సంగతి ఎంత ఎక్కువ యాజ్జేసుకుంటే అంత కేసీఆర్ పట్ల మనకు ప్రేమ, అభిమానం పెరుగుతుంది. అరెరే ఎట్లుండే కరువు అప్పుడు. ప్రకృతి చిన్నచూపు, పరాయి పాలకుల పెద్ద పగ కుటుంబాలకు కుటుంబాలను, పల్లెలకు పల్లెలను, మండలాలకు మండలాలను దుర్భిక్షం కోరలకు వేలాడదీస్తుండె. జల్లెడకు చిల్లుల మాదిరి పొలంల బోర్లు ఎన్ని డ్రిల్ చేసినా తడి ఎరుగక పోదుము. సావు కౌగిలికి పోయినా అప్పులు మాత్రం ఇడువక పోతుండె. యాసంగి, పునాస వరుసగ ఏండ్లకు ఏండ్లు కాలం ఎత్తిపోతుండె. మరిప్పుడు కేసీఆర్ కాళేశ్వరం ఎత్తిపోతల ఉపాయాలు ఏకంగా మన పొలాలను పారిస్తున్నయి. మాడు పగులగొట్టే ఎండకాలంల సుత నీళ్ళ పారుకాలు ఎన్నడన్న కన్నమా విన్నమా. ఎకురం యాభై వేలకు గుడ్క ఎవలు దేకని భూములు ఇప్పుడు యాభై లక్షలపైకి ఎగబాకినై అంటే, ఇది కేసీఆర్ అనే కారణజన్ముడి పాలన గాక మరేమిటి? గీ ఒక్క పాయింట్ సాలు మన తెలంగాణ బంగారు తెలంగాణ అయిందని తలెత్తి చెప్పేతందుకు. ఒక్క పైసా అటూ, ఇటు కాకుం డా, కక్కుర్తిగాళ్ల జేబుల పడకుండా ఎవుసం పెట్టుబడి సక్కగ మన ఖాతాలనే పడవట్టె. కరెంటు కోసం జాగారం చేసే రోజులు తలుసుకుంటే అపుడు ఎట్ల ఏగినమో, ఎట్ల ఎల్లదీశినమో కదా. అసొంటిది ఇంట్ల కరెంటు, బాయిల మీద కరెంటు, కార్ఖానాల కరెంటు.. యాడ జూసిన కరెంటే కరెంటు. రూ.75 నుంచి రూ.200 సామాజిక భద్రతా పింఛను ఇచ్చుడే ఎంతో గొప్పగ డబ్బ గొట్టుకున్న పాలకులు యాడ, రూ.2000 నుంచి రూ.3000 దాకా పింఛను ఇస్తూ ఇంటి మొత్తంల కదరు పెంచి కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మన కేసీఆర్ యాడ. పోలిక నెవ్వర్ బిఫోర్-నెవ్వర్ ప్రజెంట్-నెవ్వర్ ఆఫ్టర్.
కొలువుల కోసం పొలికేక పెడితే, ఔట్సోర్సింగ్-కాంట్రాక్టు అంటూ వెట్టిచాకిరీ, వింత షరతుల పక్షపాత పాలకులు ఎక్కడ. అదే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసి, కొత్త జీవితాలను ప్రసాదించిన ధర్మాత్ముడు కేసీఆర్ ఎక్కడ. ఐదేండ్లకో, పదేండ్లకో వెయ్యి ఖాళీలనైనా నింపని నియంతృత్వ పాలకులు ఎక్కడ, ఏటా వేలాది పోస్టులను భర్తీ చేస్తున్న మన కేసీఆర్ స్వయం పాలనతో పోలిక ఎక్కడ.
ఎవరికీ దారిచూపని పరాయి పెత్తందారీల కాలం మన మస్తిష్కంలో సజీవమే. దళితబంధు సహా జీవాల పెంపకం, మత్స్య సంపద వంటి ఎవరు ఏ పని చేసుకుంటే వారికి ఆ పనిలో ఏ లోటూ లేకుండా పథకాలు సజీవం చేసింది మన కేసీఆరే కదా. మన పాలనలోనే కదా. ఆయా కులవృత్తుల ఆర్థిక పరిపుష్టికి తలపోసిందీ కేసీఆర్ సమసమాజ ఇజమే కదా. విద్యార్థులకు చదువులు, ఉద్యోగార్థులకు కొలువులు, చేతివృత్తుల వారికి చేయూత, స్వయం ఉపాధికి సహాయం ఇట్లా అన్నిరంగాలు, అన్నివర్గాలకు గుర్తింపు గోచరించింది. బతుకు సారానికి భరోసాగా చదువుల్లో నాణ్యత, నవ్యత మన ఏలుబడిలోనే చూస్తు న్నాం. పొత్తుల పరాయి ప్రభుత్వంలో పరాయి పాలకుల్లో ఎవరు ఎప్పుడు పుల్లలు పెట్టుకుంటరో, పీఠం ఎక్కేతందుకు ఎటువంటి ఘర్షణలు సృష్టించేవారో ఇప్పుడు యాభై ఏండ్లు నిండిన మన తెలంగాణీయులకు ఎరుకే. అటువంటిది రాష్ట్రంగా మనం అయినంక పౌరుల భద్రత, కులమత సామరస్య సమాహారంగా మన దృఢమైన సర్కారు పాలనలో శాంతిభద్రతలు ఎట్లా విలసిల్లుతున్నయో సంబురంగా షేర్ చేసుకోవలిసిన ఘడియలు ఇవి. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక ఊరు, ఒక మండలం, ఒక డివిజన్/ఒక మున్సిపల్, ఒక జిల్లా, ఒక నగరం, రాజధాని కేంద్రంగా మొత్తం యావత్ సుసంపన్నమైన రాష్ట్రం దేశానికే రోల్ మాడల్. మన స్వయం పాలనలో, మన కేసీఆర్ నాయకత్వంలో ఎగువ మానేరు ప్రాజెక్టు సుభిక్షమైంది. ఎండల్లో సుత మత్తడి దుంకింది. ముస్తాబాద్ ఏరియాలో మాడల్ స్కూళ్ళు విద్యా గంధాలను వెదజల్లుతున్నై. ఇవన్నీ నా స్వీయానుభవంలోనివి. తెలంగాణ అభివృద్ధికి తార్కాణాలు.
దినాం ఏదో మూలన ఉనికి చాటుకునే బాల్య వివాహాల రుగ్మతకు కల్యాణలక్ష్మితో చికిత్స చేసింది మన ఈ తెలంగాణ దశాబ్దిలోనే. పుట్టిన శిశువుకు, కన్న తల్లికి వస్తుసామగ్రి సహా సపర్యలు మన స్వరాష్ట్రంలోనే సాధ్యమయ్యాయి. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన’కు తెలంగాణకు ముందు. ‘నేను పోత బిడ్డో సర్కారు దవాఖాన’కు అనేలా తెలంగాణ దశాబ్దిలో నమోదైంది. ఆరోగ్య రంగాన్ని సకల హంగులతో అంతలా విస్తృతి చేస్తున్నరు.
మన రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ ఇప్పుడు మన రాష్ట్రం కోసం ప్లస్ దేశం కోసం తెలంగాణ కేంద్రంగా సమాయత్తమవుతున్నది. మన రాష్ట్రం లో ఉన్న పేరుకు మనోళ్లు, తీరుకు ఢిల్లీ గులాంలు ఏమంటున్నరో జాగ్రత్తగా గమనంలో ఉంచుకో వాలి. మేమంటే మేము, మాదంటే మాది తెలంగాణలో అధికారంలోకి వచ్చే పార్టీ అని పగటికలల కబుర్లు చెప్తున్నరు. పుసుక్కున అదే గనుక నిజమైతే మనం మళ్లా ఎవల కంట్రోల్లోకి పోతమో సోంచాయించాలె. యూపీ లేదంటే గుజరాత్ బాపతులు కూసుండే ఢిల్లీ బాసుల కంట్రోల్లోకి పోవడం అంటే, దశాబ్దాలు మోసిన ఆంధ్రా బరువు సాలదని ఇపుడిగ ఢిల్లీ వాలాల భారం మోస్తమా, మోసపోతమా ఎట్ల. అదే ఢిల్లీని మన కంట్రోల్లోకి తెచ్చే మన పార్టీకి, మన సారుకు జై అంటమా!
ఇల్లెందుల దుర్గాప్రసాద్: 94408 50384