ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవర్తనను చూస్తుంటే నాకు ఇంగ్లిష్‌లోని ఒక వాక్యం గుర్తుకు వస్తున్నది. అది ఏమిటంటే Intimidation of Silence. అంటే ఒక వ్యక్తి మాట్లాడకుండా, పలుకరించకుండా, పట్టించుకోకపోతే ఎదుటి వ్యక్తి భయాందోళనకు గురికావడం. అంటే సింపుల్‌గా చెప్పాలంటే కేసీఆర్ నిశ్శబ్దం రేవంత్‌రెడ్డిలో అనిశ్చితి, అశాంతిని సృష్టించి తద్వారా అభద్రతాభావానికి గురిచేస్తున్నదేమో అనిపిస్తున్నది. అందుకే కావొచ్చు విచక్షణ కోల్పోయి అవసరానికి మించి మాట్లాడుతున్నారు. అద్భుతాలు చేసే వాళ్లెప్పుడూ మితంగానే మాట్లాడుతారు. కేసీఆర్ అవసరం మేరకే మాట్లాడుతారు. ఆయన మాట్లాడినా చర్చనే, మాట్లాడకపోయినా చర్చనే అవుతుంది.
తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేయడం కేసీఆర్ శైలి. అది ఉద్యమకాలం నుంచి మనం చూస్తున్నదే. కానీ రేవంత్‌రెడ్డి దీనికి భిన్నంగా ఏమీ చేయకుండా ఎక్కువ చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రత్యక్షంగా కనిపించకుండానే పోరాటం చేసే వ్యక్తులే శక్తిమంతులుగా కనిపిస్తారు. అందుకేనేమో కేసీఆర్ మౌనం అంతుచిక్కకపోవడంతో రేవంత్‌రెడ్డి గుండెలో భయం పట్టుకున్నట్టు అర్థమవుతున్నది. అందుకే నిరాధార ఆరోపణలు చేస్తూ అవసరానికి మించి మాట్లాడుతున్నారు. ఆయనను చూస్తుంటే విడ్డూరం అనిపిస్తున్నది. ఎందుకంటే, ఎవరైనా అవినీతికి పాల్పడితే భూకబ్జాలు చేసి ఉంటే రుజువులతో సహానిరూపించి, చర్యలు తీసుకోవాలి. కానీ అసత్య ఆరోపణలతో బురదజల్లడం ఎందుకు? ఎక్కడైనా పాలకపక్షంపై ప్రతిపక్షం విమర్శలు చేస్తుంది. కానీ ఇక్కడ రివర్స్‌గా జరుగుతున్నది. ప్రధాన ప్రతిపక్ష నాయకునిపై నిరాధార అభియోగాలను మోపి, పాలకపక్షమే అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నది.
ప్రభుత్వం బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసింది. ప్రజాసమస్యలు చర్చకు రాకుండా అడ్డుకున్నది. అంతటితో ఆగకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది. వాస్తవానికి పాలనాదక్షత తెలియని రేవంత్‌రెడ్డి, ఎన్నికల్లో ప్రజలను అత్యాశకు గురిచేసేలా 420 హామీలు ఇచ్చారు. కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కారు. ఆ సంగతి కాదనలేని విషయమే. అయినా ఇప్పుడు తనకు నిజంగానే రాష్ర్టాన్ని పాలించే స్థోమత లేదనే విషయం రేవంత్‌రెడ్డికి కూడా బోధపడినట్టే అనిపిస్తున్నది. తన పాలనాపరమైన లోపాలను కప్పిపుచ్చేందుకే విచక్షణ కోల్పోయి, కేసీఆర్‌పై వ్యక్తిత్వ హననానికి దిగుతూ, అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. చావు డప్పుల పేరిట తమ పార్టీ శ్రేణులతో రాద్ధాంతం చేయిస్తున్నారు. బాధ్యత గల సీఎం హోదాలో ఉండి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్ర బడ్జెట్‌కు సగం వంతు హైదరాబాదే ఇస్తుందనేది ఒక అంచనా. అందుకే కేసీఆర్ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ లాంటి గొప్ప ఇండస్ట్రియల్ పాలసీని తెచ్చి విదేశీ కంపెనీలకు ఎర్ర తివాచీ పరిచింది. తద్వారా రాజధానిలో ఎన్నో కంపెనీలు కొలువుతీరాయి. ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా రూపుదిద్దుకునే దిశగా అడుగులు వేసింది. హైదరాబాద్ మహానగర జనాభా ఇప్పుడు 1.16 కోట్లకు చేరింది. ఇందులో 10 నుంచి 15 లక్షల మంది ఐటీ ఉద్యోగులే. అంటే వీళ్లతో దాదాపుగా అదనంగా ఇంకో 10 నుంచి 15 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. తెలంగాణ ఖజానాకు అపార సంపదను హైదరాబాదే తెచ్చిపెడుతున్నది. విశ్వనగరంగా అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్‌ను రేవంత్ సర్కార్ పట్టించుకోవడంలేదు. పైగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బకొట్టేలా హైడ్రా లాంటి పాలసీలు తెచ్చింది. దీంతో ఖజానా కుంటుపడింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావొస్తున్నా.. ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త ఫ్లైఓవర్ కట్టలేదు. రాష్ట్ర పాలనాదక్షునికి రాష్ట్ర రాజధానిపై ఎంత బాధ్యత ఉన్నదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న కూడళ్ల కోసం 5 ఫ్లైఓవర్లు, 4 అండర్ పాస్‌లు కట్టేందుకు రూ.826 కోట్లు కేటాయించామని చెప్పుకొచ్చారు. ఇష్టానుసారం డీపీఆర్ కోసం నిధులు వెచ్చించారు. ఆ తర్వాత స్థానికంగా సమస్యలు తలెత్తడంతో వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దీంతో ఆ ప్రణాళిక ఆగిపోయింది.
ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్ట్ ఊసేలేదు. ఇలాంటి వ్యవహారాలు చూస్తే ఇది కచ్చితంగా పాలనపై అవగాహనా రాహిత్యమేనని అనిపిస్తున్నది. మెట్రోరైల్ ఎక్స్టెన్షన్ పనుల విషయం కూడా అంతే. నగరం నుంచి వచ్చే రాబడికి, నగరంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చులకు అస్సలు పొంతన లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదిక స్పష్టం చేసింది. ఆదాయం ఆశించినంత వస్తుందా లేదా అనేది అంచనా లేకపోవడంతో బడ్జెట్ లోటు ప్రమాద స్థితికి చేరుకున్నది. ఆదాయం పెంచే స్థోమతలేక అప్పులతోనే కాలం వెళ్లదీసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు చాలా స్పష్టంగా కనపడుతున్నది.
-ఆర్ఆర్ఆర్