ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థిత్వం సహజం. అధికార పక్షం తన విధానాలను చెప్పుకోవచ్చు. ప్రతిపక్షం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టవచ్చు. అవసరమైతే తీవ్రంగా విమర్శించవచ్చు. బాధ్యత గల పాలకపక్షం సానుకూలంగా స్వీకరించి, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. కానీ విమర్శల పట్ల విద్వేషంతో వ్యవహరించడం సరికాదు. తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నవి. ఈ పరిస్థితులు ఉత్పన్నం కావడానికి కారకులు ఎవరు? 6 గ్యారెంటీలు, 420 హామీలు, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే అమలు చేస్తామని చెప్పి, 1000 రోజులైనప్పటికీ అమలు చేయకపోవడంతోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల పట్ల నిరసన వ్యక్తం చేయడానికి నల్ల టీషర్టులు ధరించి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ గేటు బయటే అడ్డుకొని రోడ్డుమీదనే వారిపై దౌర్జన్యం చేసే అధికారం పోలీసులకు ఉన్నదా? అసెంబ్లీ బయట ఎలాంటి ఆందోళనలు, అల్లర్లు జరగకుండా బందోబస్తు నిర్వహించడానికి నియమితులైన పోలీసులకు శాసనసభ్యులు ఏ దుస్తులు ధరించి అసెంబ్లీకి రావాలని నిర్ణయించే అధికారం ఎవరిచ్చారు? ఇది పోలీసుల అత్యుత్సాహమా? లేక ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలా? మహిళా ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి పట్ల పోలీసుల అనుచిత ప్రవర్తన దారుణం.
మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జీ.జగదీశ్‌రెడ్డిపై దౌర్జన్యానికి దిగి గాయపర్చిన పోలీసుల ప్రవర్తనను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? తెలంగాణ ప్రదాత, బంగారు తెలంగాణ ఆవిష్కర్త కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ చేసిన వ్యాఖ్యలను సమర్థించుకోవడం, ఆ వ్యాఖ్యలపై మండిపడుతూ బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దారుణమైన భాష, చావుడప్పు వంటి నిరసన పద్ధతులు రాజకీయాలను ఏ దిశకు తీసుకువెళ్తున్నాయి? ప్రజలకు, భవిష్యత్తు తరాలకు ఏ దిశానిర్దేశం చేయనున్నాయనే విషయాన్ని తలచుకుంటేనే అసహ్యం వేస్తున్నది. అవమానాలతో ప్రతీకారం తీర్చుకోవడం అప్రజాస్వామికం. తెలంగాణ రాజకీయాలకు ఉద్యమ నేపథ్యం ఉన్నది.
ఆ ఉద్యమం ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టింది. అలాంటి రాష్ట్రంలో రాజకీయ నాయకులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ప్రత్యర్థిని శత్రువుగా చూడకుండా ప్రత్యర్థిగానే చూడాలి. అధికారం శాశ్వతం కాదు. ప్రతిపక్ష స్థానం కూడా శాశ్వతం కాదు. కానీ రాజకీయ విలువలు మాత్రం శాశ్వతంగా తరతరాలకు మిగులుతాయి. భవిష్యత్తు వర్గాలకు దిశానిర్దేశం చేస్తాయి. అందుకే రాజకీయ పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలి.
పార్టీలు తమ నాయకులు, కార్యకర్తలకు రాజకీయ భాషపై స్పష్టమైన హద్దులు విధించాలి. శాసనసభ, శాసనమండలి చర్చలకు ఉన్నత ప్రమాణాలు తీసుకురావాలి. వ్యక్తిగత విమర్శల స్థానంలో విధానపరమైన పోరాటాన్ని ప్రోత్సహించాలి. ప్రజలు రాజకీయ నాయకుల నుంచి చావుడప్పులు కాదు.. చర్చలు కోరుతున్నారు.. దూషణలు కాదు.. దిశానిర్దేశం కోరుతున్నారు. ప్రత్యర్థుల పతనం కాదు.. రాష్ట్ర ప్రగతిని కోరుతున్నారు. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం పదేండ్లు సాగిన రాజకీయాల వలె తెలంగాణ రాజకీయాలు మళ్లీ ఆ దిశగా అడుగులు పడుతాయని ఆశిద్దాం.2014లో ఒకసారి సభలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విలువైన ప్రకటన చేశారు.
అదేమిటంటే సభలో విచక్షణారహితంగా ఆరోపణలు చేయడం కాదు. ఆ ఆరోపణలకు రుజువులుండాలి, లేనిపక్షంలో శిక్షలుండాలి అని. అయితే దానికి స్పందిస్తూ కొంతమంది కాంగ్రెస్ శాసనసభ్యులు అయితే చేసే ఆరోపణలకు, విమర్శలకు డాక్యుమెంట్లు చూపాలా? లేదా దస్తావేజులు కావాలా? అంటూ ఎద్దేవా చేశారు. చట్టం ప్రకారం ఎన్ని నిబంధలున్నప్పటికీ, నైతికతను పాటించకుండా సభను పక్కదారి పట్టించే నిరాధార ఆరోపణలు చేసి, ఎంత సంచలనానికి తెరలేపితే అంత పాపులారిటీ వస్తుందనుకోవడం ఆ శాసనసభ్యుల మానసిక దౌర్భల్యానికి, బాధ్యతారాహిత్య ప్రవర్తనకు నిదర్శనం. ఇవన్నీ చూస్తున్నపుడు ఒక విషయం స్పష్టమవుతుంది. త్యాగాల బాటలో నడిచిన వారికి, భోగాల నటనలు నేర్చిన వారికి ఆలోచనలో, ఆచరణలో ఎంత తేడా ఉంటుందో బోధపడుతుంది.
తెలంగాణ ఉద్యమం జరుగుతున్నపుడు కూ డా అవకాశవాద రాజకీయాలతో తెలంగాణ ఏ ర్పాటును ఆలస్యం చేసి వందలాది మంది యువకుల బలవన్మరణాలకు కారకులైన కాంగ్రెస్ వారే ఇప్పుడు తెలంగాణ పాలకులుగా అవతరించారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలతోనో సాధించుకున్న స్వరాష్ట్ర శాసనసభలో కూర్చున్నామన్న పవిత్రభావన, మర్యాదపూర్వక ప్రవర్తన పాలకవర్గ సభ్యులలో కొంతమందికి లేకపోవడం బాధాకరం. రోడ్డుపై నిలబడి.. తెలంగాణ శాసనసభ అనే బోర్డును చూసి నా గుండెలు ఆనందంతో ఉప్పొంగిపోయాయి అని ఉద్యమంలో సీరియస్‌గా పాల్గొన్న ఒక ఉపాధ్యాయుడు నాతో చెప్పిన మాటల్లో ఉన్న పులకరింత, భావోద్వేగం కనిపించింది. ఆయనకు తెలంగాణ పట్ల ఉన్న ఆరాధ్య భావనను స్పష్టంచేసింది. కానీ, వీరుల త్యాగాల పునాదులపై నిర్మించుకున్న సభలో శాసనసభ్యులుగా కూర్చున్న వారికి లేకపోవడం ఎంత భావదారిద్య్రం? వీరు తెలంగాణ ఉద్యమంతో కానీ, సమాజంతో కానీ అనుసంధానం కాకపోవడమే ఇందుకు కారణం.
సొంత రాష్ర్టాన్ని సాధించుకోవడం, ఆత్మగౌరవాన్ని ప్రకటించుకోవడం, నాలుగున్నర కోట్ల ప్రజల అనేక ఆకాంక్షలు నెరవేర్చే సభకు ప్రాతినిధ్యం వహించడం ఇవేవి వారికి మహోన్నతమైనవిగా తోచడం లేదు. ఆ సంబురాన్నే వారు ఆస్వాదించడం లేదు. మహోన్నత ఉద్యమాన్ని సఫలీకృతం చేసి సాధించుకున్న చారిత్రక సందర్భంలో ఈ మట్టి, ఇక్కడి మనుషుల ఋణం తీర్చుకొనే నిర్ణయాత్మక పాత్రను తాము పోషించవలసిన కర్తవ్యాన్ని గుర్తెరిగే ఉద్వేగిక స్థితిలో వారు లేరు. కుట్రదారులతో కరచాలనం చేసి, కలిసి నడిచిన వారికి అస్తిత్వ స్పృహ ఉంటుందనుకోవడం కూడా అత్యాశే!
ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా? ఎవరు ఎన్ని నిందలు వేసినా? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని ఎవరు ఎన్ని ప్రగల్భాలు పలికినా? ఎవరు ఎన్నిసార్లు చావు డప్పు్పలు కొట్టినా, ఎన్నిరకాల విషం చిమ్మే ప్రయత్నాలు చేసినా కేసీఆర్ సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఆయన తిరిగి మళ్లీ అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరు. ఇది పరిణతి చెందిన తెలంగాణ సమాజం భావన. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ ఆయనపై ముప్పేట దాడి చేశారు. కానీ, అతడే ఒక సైన్యమై తెలంగాణ ప్రదాతగా నిలిచాడు. ఇప్పుడు కూడా తెలంగాణ ద్రోహులు మళ్లీ అదే తరహా దాడిని కొనసాగించాలని చూస్తున్నారు.
తెలంగాణ సాధించడానికి తానొక్కడై మొదటి అడుగు వేశాడు. కోట్లాది పాదాలు ఆయన దారి లో అడుగులు కలిపాయి. తెలంగాణ సమాజమే అండగా నిలిచింది. ఇప్పుడు ఆ సమాజమే కేసీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్న దృఢసంకల్పంతో ఉన్నది. ఈ పవిత్ర కార్యంలో అడ్డు వచ్చే ప్రగతి నిరోధకులు, ప్రజల సంకల్ప పదఘట్టనల కింద తెలంగాణ వ్యతిరేకులు నలిగిపోక తప్పదు. కేసీఆర్ అంటే ఓర్వలేని వాళ్లు డప్పులెన్ని కొట్టినా, వారికి భంగపాటు తప్పదు. ప్రజల చేతుల్లో ప్రజాస్వామిక తీర్పులో గుణపాఠం తప్పదు! పరిణామాలన్నీ చూస్తున్న ప్రజానీకం సరైన సమయం కోసం వేచి చూస్తున్నది.
పార్టీలు తమ నాయకులు, కార్యకర్తలకు రాజకీయ భాషపై స్పష్టమైన హద్దులు విధించాలి. శాసనసభ, శాసనమండలి చర్చలకు ఉన్నత ప్రమాణాలు తీసుకురావాలి. వ్యక్తిగత విమర్శల స్థానంలో విధానపరమైన పోరాటాన్ని ప్రోత్సహించాలి. ప్రజలు రాజకీయ నాయకుల నుంచి చావుడప్పులు కాదు.. చర్చలు కోరుతున్నారు.. దూషణలు కాదు.. దిశానిర్దేశం కోరుతున్నారు.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ)
-నారదాసు లక్ష్మణ్‌రావు