కేసీఆర్ అంటే ఒక ఉద్వేగం. కేసీఆర్ పిలుపునందుకొని తెలంగాణ యువత మలిదశ ఉద్యమంలోకి ప్రభంజనంలా ఉరకలెత్తింది. ఆయన వెంట గులాబీ దండులా సాగింది. అప్పటివరకు కవులు, కళాకారులు, మేధావుల తో కలిసి రాజకీయ ఉద్యమం చేస్తున్న కేసీఆర్‌కు యువత జతవడంతో అగ్నికి వాయువు తోడైనట్టయింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ యువత మిలియన్ మార్చ్, సాగరహారం, సకలజనుల సమ్మె తదితర రూపాల్లో నిరంతర పోరాటం చేసి తెలంగాణ గడ్డ తలెత్తుకునేలా చేశారు. యువత గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకోవడమే కాదు, తెలంగాణవ్యాప్తంగా ఆ జెండాను రెపరెపలాడించారు.
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంగా జరిగిన తెలంగాణ పోరులో యువత పాత్రను గుర్తించిన కేసీఆర్.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారిని భాగస్వామ్యం చేశారు. అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థికసాయం, ఇల్లు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి అమరవీరుల రుణం తీర్చుకున్నారు. పదేండ్లలో 1.65 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేశారు. 80 వేలకు పైగా సర్కారీ కొలువుల నియామకాలకు అనుమతులు ఇచ్చి, నోటిఫికేషన్లు కూడా జారీచేశారు. ఈ నేపథ్యంలోనే గత బీఆర్ఎస్ సర్కార్ అమలుచేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను యువత అవలోకనం చేసుకుంటున్నది.
అందులో భాగంగానే ఓరుగల్లు కేంద్రంగా జరగనున్న రజతోత్సవ సభ సందర్భంగా యువత గులాబీ జెండాతో తమకున్న బంధాన్ని యాది చేసుకుంటున్నారు. మరోసారి జెండా ఎత్తి పోరుబాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నది. ఏ కార్యక్రమంలోనైనా యువత భాగస్వామ్యమైతే ఆ కార్యక్రమం సఫలీకృతమవుతుంది. అట్లాగే నేడు జరిగే ఈ రజతోత్సవ సభ యువత కేరింతలతో, చప్పట్లతో కోలాహలం సృష్టించనున్నది. రాష్ట్రం లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కొలువుదీర్చేందుకు యువత కంకణం కట్టుకున్నది. నాడు తెలంగా ణ కోసం స్వచ్ఛందంగా ఉద్యమ బాట పట్టిన ట్టే.. నేడు సాధించుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని యువత ఘంటాపథంగా చెప్తున్నది.
ఇది తెలంగాణ గడ్డ. పోరాటాలకు అడ్డా. తెలంగాణ దేన్నైనా సహిస్తుందేమో కానీ, అస్తిత్వం, ఆత్మగౌరవానికి ముప్పు ఏర్పడితే ఊరుకోదు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికగా కేసీఆర్ తూటాల్లాంటి మాటలతో స్ఫూర్తి పొం ది, మరో పోరుకు ఉరకలెత్తేందుకు సమాయత్తమవుతున్నది. నాటి ఉద్యమ జ్ఞాపకాలను తలచుకుంటూ వరంగల్ దిశగా చీమలదండు కదులుతున్నది. సభలు నిర్వహించడం బీఆర్ఎస్కు కొత్త కాదు, ఎన్నో సభలు నిర్వహించిన ఘనత కేసీఆర్ నాయకత్వంలోని గులాబీ పార్టీది. నేటి సభ విజయవంతమై, సభకు హాజరైన యువకులు మహిళలు, కార్యకర్తలు, నాయకులు మొత్తంగా ప్రజలు తమ తమ ఇండ్లకు సురక్షితంగా చేరుకోవాలి. బీఆర్ఎస్ బలం, బలగం.
(వ్యాసకర్త: రాష్ట్ర శాసనమండలి సభ్యులు)
-పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి