ఓ ఎలుక తొలుత కన్యగా మారి, వివిధ పరిణామాల తర్వాత మళ్లీ తన అసలు రూపాన్ని సంతరించుకొని సంతోషపడిన కథను మనందరం విన్నాం. ఆ కథేమిటంటే, ఓ ఎలుక కన్యగా మారుతుంది. ఆ కన్యను పెంచిన ఫాదర్ ఆమెకు వివాహం చేయాలనుకున్నాడు. అందుకు తగిన వరుడి కోసం వెతికాడు. తొలుత సూర్యుడు అత్యంత శక్తివంతమైన, యోగ్యుడైన వ్యక్తిగా భావించాడు. కానీ, సూర్యుడిని మేఘాలు కమ్మేయడం చూసిన ఆ ఫాదర్ తన మనసు మార్చుకున్నాడు. ఆ మేఘాలను గాలి ఎగరేసుకుపోయింది. దీంతో గాలికి మేఘాల కంటే ఎక్కువ శక్తి ఉందని ఆయన అనుకున్నాడు. కానీ, గాలిని పర్వతం అడ్డుకున్నది. అయితే, లోపలికి దూసుకెళ్లి మరీ కొండను తొలుస్తున్న ఎలుక శక్తి ముందు ఆ పర్వతం నిలవలేకపోయింది. ఇది చూసిన ఆ ఫాదర్ కన్యను మళ్లీ ఎలుకగా మార్చేశాడు. చివరికి ఓ ధైర్యవంతుడైన ఎలుకకు ఇచ్చి వివాహం చేశాడు. మన దేశంలో అమలవుతున్న వస్తు, సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్- జీఎస్టీ) వ్యవహారం కూడా అచ్చం ఇలాంటిదే.
ఆరు శ్లాబ్‌ల జీఎస్టీని రెండు శ్లాబ్లుగా ఆకర్షణీయంగా మారుస్తామని ప్రధాని ఇటీవల వాగ్దానం చేశారు. కానీ, తాజాగా జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకొచ్చిన సంస్కరణలు జీఎస్టీని కఠినమైన ఐదు శ్లాబ్లుగా మార్చేశాయి. 0 శాతం, 3 శాతం (బంగారంపై), 5 శాతం, 18 శాతం శ్లాబ్‌లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. 28 శాతం శ్లాబ్‌ను 40 శాతం శ్లాబ్‌తో భర్తీ చేశారు. అయితే 12 శాతం శ్లాబ్‌ను తొలగించడంతో ఎలుక మళ్లీ తోకలేని ఎలుకగా మారిపోయింది.
తాజా జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా చేపట్టిన మదింపు అనేక వస్తువులు, సేవలపై రేట్ల తగ్గింపును పరిగణనలోకి తీసుకున్నదా? అనే అనుమానం కలుగకమానదు. ఇందులో తగ్గింపులతో పాటు కొన్నింటిపై జీఎస్టీ పెంపుదల కూడా ఉంది. ముఖ్యంగా, జీఎస్టీ పెరుగుదల మూలంగా ఇంధన ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది.బొగ్గుపై ప్రస్తుతమున్న 5 శాతం స్థానంలో ఇకపై 18 శాతం పన్ను విధిస్తారు. ప్రస్తుతం బొగ్గుపై 5 శాతం జీఎస్టీతో పాటు టన్నుకు రూ.400 లెవీ కూడా ఉన్నమాట వాస్తవమే. కానీ, ఈ లెవీని ఈ సంవత్సరంలో ఏదో ఒక సమయంలో ఎత్తివేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు. ఎందుకంటే రాష్ర్టాలు కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేయడానికి తీసుకున్న అన్ని రుణాల చెల్లింపులు త్వరలో పూర్తవుతాయి. తద్వారా ఈ లెవీని ఎత్తివేసే అవకాశం ఉంది. కానీ, విద్యుత్తు ఉత్పత్తికి ఆధారమైన బొగ్గుపై తాజాగా పెంచిన 13 శాతం జీఎస్టీ మాత్రం అలాగే ఉండిపోతుంది. అంతేకాదు, ఇది విద్యుత్తుతో పాటు అన్ని రకాల వ్యయాలను పెంచుతుంది. విద్యుత్తును మొదటినుంచీ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం లేదు. కాబట్టి, దానిపై ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేస్తారు. దానిపై ఇన్పుట్ టాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేయలేరు. అందువల్ల బొగ్గు ధరపై పడుతున్న ఈ అదనపు ఖర్చు విద్యుత్తు ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతుంది. తద్వారా ఇది దేశంలోని పరిశ్రమలు, ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులపై అదనపు భారం మోపుతుంది.
తాజా జీఎస్టీ సంస్కరణలో తీసుకున్న నిర్ణయం మేరకు పెట్రోలియం ఉత్పత్తుల వ్యయం కూడా పెరగనున్నది. ఎందుకంటే ముడిచమురు, శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను పైప్‌లైన్ ద్వారా రవాణా చేసే సేవపై ప్రస్తుతమున్న జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. చమురు క్షేత్రాల అన్వేషణ, అభివృద్ధి, చమురు ఉత్పత్తికి సంబంధించిన జాబ్ వర్క్‌లపై కూడా జీఎస్టీ పెంచారు. ఈ కారణంగా పెట్రోలియం ధరలూ పెరుగుతాయి.తాజా సమావేశంలోనూ పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. కాబట్టి, ఈ అదనపు వ్యయాల భారం పూర్తిగా చమురు మార్కెటింగ్ కంపెనీలపైనే పడుతుంది. ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరల్లో మార్పులతో సంబంధం లేని ధరల నిర్ణయ విధానాన్ని ఈ కంపెనీలు కలిగి ఉన్నాయి. కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి. జీఎస్టీ పెంపును నిందించకుండా, ఈ భారాన్ని వినియోగదారులు మోయాల్సి ఉంటుంది. వినియోగదారుల కళ్లకు స్పష్టంగా కనిపించే వస్తువులపై జీఎస్టీని తగ్గించి, వినియోగదారుడికి నేరుగా సంబంధం లేని వస్తువులపై జీఎస్టీని పెంచారు. తద్వారా పరోక్ష పన్నులు మరింత పరోక్షంగా మారాయి.
వస్త్ర, ఎరువుల రంగాలపై ఉన్న సుంకాలను తొలగించడం స్వాగతించదగినదే. కానీ, ప్రభుత్వం వాటికి బదులుగా కొత్త ఆదాయ మార్గాలను సృష్టించుకున్నది. పాల ఉత్పత్తుల నుంచి పెన్సిల్ తయారీ వరకు అనేక రంగాలకు జీఎస్టీ మినహాయింపు ఇచ్చింది. కానీ, వీటి ఇన్పుట్లపై జీఎస్టీ విధిస్తారు. వివిధ రకాల కలపపై సుంకం తగ్గించినప్పటికీ, ఇంకా 5 శాతం జీఎస్టీ కొనసాగుతున్నది. పెన్సిల్‌పై సుంకం సున్నా. కానీ, దీనివల్ల తయారీదారుడు ఇన్పుట్లపై చెల్లించిన పన్నులను పూర్తి ఉత్పత్తిపై చెల్లించిన పన్నుతో సరిచేయడానికి అవకాశం లేదు.
లగ్జరీ, ప్రీమియం వస్తువులను సరిగ్గా నిర్వచించలేక, వాటి మధ్య వ్యత్యాసాన్ని స్పష్టం చేసే చక్కటి అవకాశాన్ని జీఎస్టీ కౌన్సిల్ కోల్పోయింది. ఇప్పుడు ఈ రెండు వర్గాలను ఒకే గాటన కట్టడంతో రెండింటిపై 40 శాతం పన్ను విధిస్తారు. ఉన్నతవర్గాల ప్రత్యేక ఆసక్తి, ఆకర్షణ కారణంగా ధర పెరిగినప్పుడు డిమాండ్ పెరిగే వస్తువులుగా లగ్జరీ వస్తువులను సరిగ్గా నిర్వచించాల్సింది. డెలివరీ సేవలపై జీఎస్టీని 5 శాతం నుంచి 18 శాతానికి పెంచడం, జీఎస్టీ పరిమితి కంటే తక్కువ లావాదేవీలు కలిగిన స్విగ్గీ వంటి డెలివరీ సంస్థలపై రివర్స్ చార్జి విధించడం ద్వారా జీఎస్టీ కౌన్సిల్ ఈ-కామర్స్ రంగంపై పన్ను భారాన్ని మరింతగా మోపింది.
ప్రజలు విస్తృతంగా వినియోగించే వస్తువులపై పన్ను తగ్గింపు నిజంగా స్వాగతించదగినదే. కానీ, ఇది అన్ని రంగాలపై ఇంధన ఖర్చుల భారాన్ని మోపడం ద్వారా, ప్రీమియం వస్తువులను లగ్జరీ వస్తువులతో కలపడం ద్వారా, చాలా మందికి వాటిని అందుబాటులో లేకుండా చేయడం సాధ్యపడింది.
చాలా మంది భారతీయులు తమ ఖర్చులను తగ్గించి, పోగు చేసిన పొదుపులో ఎక్కువ భాగాన్ని మరొక దానిపై వినియోగిస్తూ జీవిస్తుంటారు. కొన్ని వస్తువులపై కొంత డబ్బు ఆదా చేస్తే, అది మరొక వస్తువుపై ఖర్చు అవుతుంది. ఇలా ప్రీమియం వస్తువులతోపాటు అన్ని రకాల వస్తువుల వినియోగం పెరుగుతుంది. దేనిపై ఖర్చు చేసినా, చివరికి ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం వెళ్తుంది. అందువల్ల, గణనీయమైన ఆదాయ నష్టం జరిగే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఈ నేపథ్యంలో జీఎస్టీ విధానంలో చేయాల్సిన అతిపెద్ద సంస్కరణ ఏమిటంటే, ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ ఈ-రూపీ ద్వారా జీఎస్టీ చెల్లింపులను తప్పనిసరి చేయడం. ఇది అన్ని చెల్లింపులను పారదర్శకంగా మారుస్తుంది. తద్వారా అన్నింటిపై నిఘా వేసేందుకు ఆస్కారం ఉంటుంది. అన్ని రకాల ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ మోసాలకు ఇది ముగింపు పలుకుతుంది. అంతేకాదు, వస్తువుల రవాణా సమయంలో ఈ-వే బిల్లుల అవసరం లేకుండా చేస్తుంది. జీఎస్టీని సంస్కరించడానికి ఇదే చివరి అవకాశం కాదు. తదుపరి సమావేశంలో అయినా జీఎస్టీ కౌన్సిల్ మెరుగ్గా పనిచేయాలి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్) (‘ది ఫెడరల్’ సౌజన్యంతో..)
– టి.కె.అరుణ్