పంచాయతీ ఎన్నికలు పార్టీల ప్రాతిపదికపై జరుగవు. పార్టీల మద్దతుతో జరుగుతాయి. ఫలితాలు పార్టీల జాతకాలు చెప్తాయి. పాలకపక్షానికి ఈ ఎన్నికల్లో సహజంగానే ఆధిక్యం ఉంటుంది. సాధారణంగానైతే కనీసం 75 శాతం స్థానాలు రావాలి. కానీ, రెండేండ్ల పాలన కలిగించిన వ్యతిరేకత పంచాయతీ ఎన్నికలపై ప్రభావం చూపింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎక్కువ స్థానాలు గ్రామీణ ప్రాంతాల్లోనే గెలిచినప్పటికీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ‘పంచ్’ పడింది. మూడంచెల్లోనూ పాలకపక్షానికి ముచ్చెమటలు పోయించారు పల్లె జనం. మరోవైపు గులాబీ పార్టీకి తీన్మార్ మోగించారు.
అంగబలం, అర్థబలానికి అధికార మదం కలగలిపి కిందామీదా పడ్డా కాంగ్రెస్కు వచ్చిన స్థానాలు 50 శాతమే. ఊరింపులు, బెదిరింపులేవీ పని చేయలేదు. విపక్షంపై దాడులు జరిపితే ప్రజలు ఓటుతో ఎదురుదాడి జరిపారు. పోలింగ్లో అధికార దుర్వినియోగానికి పాల్పడినా ఫలితం లేకపోయింది. సీఎం సభ పెట్టిన చోటే బీఆర్ఎస్కు ప్రజలు జైకొట్టారు. కేసీఆర్ నాయకత్వం పట్ల తమ అభిమానాన్ని ధాటిగా చాటుకున్నారు. గ్లోబల్ సమ్మిట్ జరిపిన ఊర్లోనూ కాంగ్రెస్ను ఛీకొట్టారు. ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల స్వగ్రామాల్లోనే కాంగ్రెస్ నెగ్గుకురాలేకపోయింది.
ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసిన ఫలితంగా సగం స్థానాలు నెట్టుకురావడమే కాంగ్రెస్కు గగనమైపోయింది. అస్తవ్యస్త పాలనను ఆమోదించలేమని ప్రజలు కుండబద్దలు కొట్టిండ్రు. ప్రజాబలాన్నే నమ్ముకున్న బీఆర్ఎస్కు నాలుగు వేల దరిదాపుల్లో సీట్లు రావడం విశేషం. ప్రజల గుండెలనిండా గులాబీ జెండా రెపరెపలాడింది. తెలంగాణ ఇంటి పార్టీ ఏదో ప్రజలు చెప్పకనే చెప్పారు. నిధుల బూచీ చూపించి ఓటర్ల మెడలు వంచాలని పాలకపక్షం చూసినా ప్రజలు బీఆర్ఎస్ వైపు నిలవడం వారి తెగింపును సూచిస్తున్నది. పల్లెపోరులో అరాచక కాంగ్రెస్ను, రేవంత్ అహంకారాన్ని మట్టి కరిపించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు జరిపిన అలుపెరుగని పోరాటం అద్భుత విజయాలను నమోదు చేసింది. అనుకూల మీడియాలో ఎంతగా బూస్టింగ్ ఇచ్చుకున్నా కాంగ్రెస్ గ్రాఫ్ పైకి లేవలేక చతికిలబడింది.
అడ్డదారులు తొక్కి, ఆపసోపాలు పడినా కాంగ్రెస్ ‘అర్ధానికే’ పరిమితం కావడం, బీఆర్ఎస్ అద్వితీయమైన రీతిలో జైత్రయాత్ర సాగించడం చరిత్రలో నిలిచిపోతుంది. ఓటర్లు అందించిన మద్దతుతో బీఆర్ఎస్ ఉత్సాహం రెట్టించింది. కాంగ్రెస్లో తర్జనభర్జన మొదలైంది. ఇంత జరిగినా ‘కిందపడ్డా నాదే గెలుపు’ అన్నట్టుగా సీఎం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం విడ్డూరం. పైగా తాము అమలు చేసిన కార్యక్రమాలే తమకు అండగా నిలిచాయని బుకాయింపు ఒకటి.
తాము పేదలకు అందించిన సంక్షేమ పథకాలే తమకు గెలుపును సంపాదించి పెట్టాయనడం క్షేత్రస్థాయి పరిస్థితిని తలకిందులు చేసి చూపడమే. అరచేతిలో వైకుంఠం చూపి మాయచేసిన కాంగ్రెస్ అధికారం దక్కగానే హామీలను అటకెక్కించింది. అప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్నవి కూడా హాంఫట్ చేసేసింది. అందుకే ఓటర్లు గడ్డిపెట్టారు. మాట తప్పినందుకు, మడమ తిప్పినందుకు కర్రుకాల్చి వాతపెట్టారన్నది వాస్తవం. ఆనాడు అడ్డగోలు హామీలు నమ్మి ఓటు చేజార్చుకున్న గ్రామీణులు ఇప్పుడు ఆ ఓటుతోనే గుణపాఠం చెప్పారు. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హస్తం పార్టీకి తాఖీదు జారీచేశారు.