జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వయసు 55 సంవత్సరాలు. ఆయన రాజకీయాల్లో ప్రవేశించి 18 సంవత్సరాలు. అన్నేళ్లు వచ్చిన వ్యక్తికి తగినంత రాజకీయ అనుభవం కూడా తోడైంది గనుక, అందుకు తగిన ఆలోచనలు, పరిపక్వత వస్తాయని భావిస్తాము. కానీ ఆయనలో పరిపక్వత నేటికీ కనిపించటం లేదు. సరికదా వైరుధ్యాలు మాత్రం తగినన్ని ఉన్నాయి. అవి ఆయన మౌలిక వ్యక్తిత్వంలోనే భాగంగా మారినందున, తెలంగాణ విషయంలో అందుకు భిన్నంగా ఉండగలదని భావించలేము.
పవన్‌కల్యాణ్ రాజకీయ ప్రవేశం 2008లో తన 37వ ఏట, తన సోదరుడు, చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం నాయకునిగా బాధ్యతలు స్వీకరించటంతో మొదలైంది. ఆ పార్టీ సామాజిక న్యాయ నినాదంతో, బడుగు, బలహీన వర్గాల్లో ఆశలు కల్పించింది. రాజకీయాల్లో అటువంటి పునాది నుంచి వచ్చిన వ్యక్తికి అందుకు తగిన భావజాలాలు కొనసాగుతాయని భావిస్తాము. ఆ భావనల మధ్య పవన్‌కల్యాణ్ 2014లో తానుగా జనసేన పార్టీని నెలకొల్పారు.
కాని 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా, తన భావజాలానికి వ్యతిరేకమనే పేరు గల బీజేపీ నాయకత్వాన గల ఎన్డీఏ కోసం ప్రచారం చేశారు. 2019 వచ్చేసరికి ఆ కూటమిని వదిలేసి వామపక్షాలతో కలిసి పోటీ చేశారు. ఆ మార్పుకు కారణం వామపక్షాల సిద్ధాంతాల పట్ల సానుకూలత ఏర్పడటం అయితే అందుకు ఎవరూ అభ్యంతరం పెట్టవలసిందేమీ లేదు. అదే సమయంలో ఇక్కడ కొన్ని ప్రశ్నలు ముందుకు వస్తాయి. ప్రజారాజ్యం పార్టీ (2008) సామాజిక న్యాయ సిద్ధాంతం నుంచి, జనసేన పార్టీ (2014) సామాజిక న్యాయ సిద్ధాంతం నుంచి, అందుకు విరుద్ధమని పలువురు నమ్మే ఎన్డీఏ పార్టీ కోసం ప్రచారం చేయటం (2014) నుంచి, తిరిగి సామాజిక న్యాయ సిద్ధాంతాల వామపక్షాలతో చేరిక (2019) వైపు ప్రయాణమన్నది ఏమి చెప్తుంది? 2008 నుంచి ఆ 2019 వరకు 11 సంవత్సరాలపాటు ఆ విధంగా ఊగిసలాటలతో సాగిన రాజకీయ ప్రయాణంలోని పరిపక్వతలు, వైరుధ్యాలు ఏమిటని మనం భావించాలి?
ఆ 2019 నాటి వామపక్షాల పొత్తు నుంచి కొన్ని ఆసక్తికరమైన దృశ్యాలు కూడా కనిపించాయి. పవన్ కల్యాణ్‌ను లాటిన్ అమెరికన్ విప్లవయోధుడు షేగువేరా, పూర్తిగా వామపక్ష భావజాలం గల భారత విప్లవవీరుడు భగత్‌సింగ్‌లతో కలిపి చూపుతూ పోస్టర్లు, టీ షర్టులు విరివిగా వ్యాప్తిలోకి వచ్చాయి. వాటిలోని కొన్నింటిలో పవన్‌కల్యాణ్ గువేరా క్యాప్‌తో కనిపిస్తారు. ఒకచోట ఆయనను ‘ఆంధ్రా గువేరా’ అని సంబోధించారు.
గువేరాకు ప్రపంచవ్యాప్తంగా, భగత్‌సింగ్‌కు ఇండియాలోనే గాక భారత ఉపఖండమంతటా గల హీరో ఇమేజ్‌లు తెలిసినవే. ఆ స్థితిలో, పవన్‌కల్యాణ్ గువేరా, భగత్‌సింగ్‌లతో కలిసి దర్శనమివ్వటం, వామపక్షాలతో కలిసి పోటీ చేయటం ఆంధ్రప్రదేశ్‌లోనే గాక తెలంగాణ రాష్ట్రంలోనూ దృష్టిని చాలా ఆకర్షించింది. అవే రోజుల్లో గువేరా కుమార్తె డాక్టర్ అలైదా విజయవాడకు రాగా, ఒక సభలో పవన్‌కల్యాణ్ విషయం తన దృష్టికి తీసుకువెళ్లారు. అందుకు ఆమె స్పందిస్తూ, ‘గువేరా కమ్యూనిస్టుగా జీవించి కమ్యూనిస్టుగా మరణించారనే విషయం అటువంటి వారంతా (పవన్ అని భావన) గుర్తుంచుకోవాలి’ అని మాత్రం అన్నారు.
ఇదంతా జరిగిన మరుసటి సంవత్సరం (2024) పవన్‌కల్యాణ్ బీజేపీ కూటమి ఎన్డీఏలో మరొకమారు చేరిపోయారు. గెలిచి ఉపముఖ్యమంత్రి అయ్యారు. హిందుత్వ, సనాతన ధర్మం, జాతీయవాదం, ప్రాంతీయవాదం మొదలైన పదజాలాలతో, వేషధారణలతో ప్రజల ముందుకు వచ్చారు. తనతో విభేదించే వారిపై చేతులు విసురుతూ, సవాళ్లు విసురుతూ, సినిమా శైలిలో గర్జిస్తున్నారు. ఇది వర్తమాన స్థితి.
అంతా పవన్‌కల్యాణ్ రాజకీయ స్వేచ్ఛ, రాజ్యాంగ స్వేచ్ఛ అయినందున ఎవరూ అనగలిగింది ఏమీ ఉండదు. కాని, 2008 నుంచి, 2014, 2019, 2024 వరకు, ఆ తర్వాత ఇప్పటికి మరొక రెండు సంవత్సరాలపాటు, మొత్తం 18 ఏండ్లపాటు సాగిన రాజకీయ ప్రయాణంలో తన అపరిపక్వతలు, వైరుధ్యాలు ఏ విధంగా కనిపిస్తూ వచ్చాయన్నది ప్రశ్న. దీనంతటి సారాంశంగా మనకు కనిపిస్తున్నది మాత్రం ‘అధికారానికి దారేది’ అన్న అన్వేషణ మాత్రమే. ఆ విధంగా తనను అర్థం చేసుకున్న మీదట ఇపుడు తెలంగాణ విషయానికి రావలసి ఉంటుంది. మౌలికంగా తను అర్థమైతే, తెలంగాణకు సంబంధించి తనను అర్థం చేసుకోవటం సులభమవుతుంది. ఆ ప్రకారం చూసి ఆయనకు కొన్ని ప్రశ్నలు వేయాలి.
అన్నింటికన్న ముందు తెలియవలసింది, తెలంగాణ అంటే ఎంతో ఇష్టం, ప్రేమ అంటున్న తను, ఆ తెలంగాణ 1956 నుంచి మొదలుకొని సీమాంధ్ర రాజకీయవర్గాల ఒప్పందాల ఉల్లంఘనలకు, అక్కడి ధనికవర్గాల దోపిడీకి గురికావటం పైన, హక్కులను డిమాండ్ చేసినందుకు అణచివేతలూ కాల్పులకు బలికావటం పైన 2008కి ముందుగాని, 2008-2014 మధ్యగాని తీసుకున్న వైఖరేమిటి? ఆ కాలమంతా హైదరాబాద్‌లోనే నివసిస్తుండిన ఆయన తన కండ్ల ఎదుటనే ప్రజలు ఉద్యమం సాగిస్తూ, అణచివేత కారణంగా వందలాదిమంది వేర్వేరు విధాలుగా ప్రాణాలు కోల్పోతుండినపుడు ఆయన చేసిందేమిటి? అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరిక పట్ల తీసుకున్న వైఖరేమిటి? తెలంగాణ పట్ల తనకు ఎనలేని ప్రేమ ఉందని ఇపుడు తను చెప్తున్న మాటలకు ఈ ప్రశ్నలు మొదటి పరీక్ష అవుతాయి.
ఈ ప్రశ్నలకు ఆయన నిజాయితీతో సూటిగా సమాధానమివ్వాలి. అపుడే ఆయనకు తక్కిన విషయాలు మాట్లాడే నైతిక హక్కు వస్తుంది. ఇక 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, ఇపుడు 2026 నాటికి గల 12 సంవత్సరాల పరిస్థితి ఏమిటి? తెలంగాణ ఏర్పడినపుడు తాను ఎంతో బాధపడి 11 రోజులపాటు తిండి తినలేదని అన్నారాయన. దానిపై విమర్శలు రాగా, తెలంగాణ ఏర్పడినందుకు కాదు, విభజన జరిగిన తీరుకని మాట మార్చారు. దీనిపై రెండు ప్రశ్నలకు పవన్‌కల్యాణ్ సూటిగా సమాధానమివ్వాలి. తను ఒరిజినల్‌గా అన్నదేమిటి? విభజన జరిగినందుకని అన్నారా, లేక జరిగిన తీరుకు మాత్రమే అని అన్నారా? తీరుకు మాత్రమేనని ఇపుడు అంటున్నమాట నిజమైతే అందుకు రుజువుగా అప్పటి పత్రికా వార్తలను తీసి చూపించాలి.
రెండవది, విభజన జరిగిన తీరు అనే మాట. ఆ మాటకు అర్థమేమిటో పవన్‌కల్యాణ్ నిర్దిష్టంగా వివరించాలి. విభజన బిల్లును రూపొందించటం, పార్లమెంటు ఉభయసభల్లో చర్చించి ఆమోదించటం, రాష్ట్రపతి సంతకం తర్వాత నోటిఫై చేయటానికి సంబంధించి స్పష్టమైన నిబంధనలున్నాయి. జరుగవలసిన తీరు అనే దానిలోకి ఇవి వస్తాయి. ఆ తీరున జరగనట్లయితే అది నిబంధనల ఉల్లంఘన అవుతుంది. చెల్లదు. మరి పవన్‌కల్యాణ్ ఉద్దేశంలో ఈ నిబంధనలకు విరుద్ధంగా ఏమి జరిగినట్లు? ఈ ప్రశ్నకు ఆయన నిర్దిష్టంగా వివరణ ఇవ్వాలి.
బిల్లుపై ఓటింగ్ సమయంలో తలుపులు మూసివేయటాన్ని కొందరు అభ్యంతరపెడుతున్నారు. పవన్ అంటున్న ‘తీరు’ కూడా ఇదేనేమో తెలియదు. అది ఆయన చెప్పాలి. అయితే, వీరందరికి తెలియనిది ఒకటుంది. సభాపతి ఓటింగ్ జరుపటానికి కోరం బెల్ మోగిన తర్వాత లాబీలు క్లియర్ అయి, సభ్యులు ఎవరి స్థానాల్లో వారు కూర్చున్నాక, ఓటింగ్‌కు ముందు తలుపులు మూయటం ఎప్పుడూ అనుసరించే పద్ధతే. ఎందుకంటే, ఓటింగ్ ప్రక్రియ మొదలైన క్షణం నుంచి లోపలివారు బయటకు గాని, బయటివారు లోపలకు గాని వెళ్లటం ఆ ప్రక్రియను భంగపరుస్తుంది.
ఉమ్మడి రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది 2014 ఫిబ్రవరిలో. తర్వాత రెండు నెలలకు ఎన్నికలు జరిగాయి. అపుడాయన బీజేపీ నాయకత్వపు ఎన్డీఏకి ప్రచారం చేశారు. బిల్లు ఆమోదం పొందింది బీజేపీ మద్దతుతో. ఆ మాట వారు ఇప్పటికీ చెప్పుకుంటారు గర్వంగా. మరి ఆయన 11 రోజులపాటు అన్నం తిననిది 2014 ఫిబ్రవరి నుంచి మొదలుకొని బీజేపీ కోసం తన ఎన్నికల ప్రచారం వరకు గల కాలంలో ఎప్పుడు? అట్లా ప్రచారం చేయటానికి ముందు, వారు రాష్ట్ర విభజనకు మద్దతు ఇవ్వటంపై తన ఆలోచనలు, అభ్యంతరాలు ఏమిటో వారి దృష్టికి తీసుకెళ్లారా? జరిగిన దానితో రాజీపడ్డారా? పడి ఉంటే ఇపుడు 12 సంవత్సరాలు గడిచినాక ఆ విషయం ఎందుకు కెలుకుతున్నారు? పడకపోతే తిరిగి ఎన్డీఏతో 2024 నుంచి సహవాసం ఎట్లా చేస్తున్నారు?
ఇటువంటి ఎడతెగని అపరిపక్వతలు, వైరుధ్యాలు ఒక దశలో ఉండినా, అనుభవం వచ్చినా కొద్దీ అవి సమసిపోవాలి. కాని పవన్‌కల్యాణ్‌లో ఆ లక్షణాలు 55 సంవత్సరాల వయసు, 18 ఏండ్ల రాజకీయానుభవం వచ్చిన మీదట కూడా కనిపించటం లేదు. తనవలెనే సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి పార్టీలు నెలకొల్పినవారు ఇంకా ఉన్నారు. వారిలో మినహాయింపులు లేకుండా ప్రతిఒక్కరూ మొదటినుంచే తగిన పరిపక్వతతో వ్యవహరించారు. నిన్నగాక మొన్న తమిళనాడులో విజయ్ వరకు.
పవన్ అర్థం చేసుకోవలసింది ఏమంటే, రాజకీయమన్నది ఒక సీరియస్ రంగం. విప్లవం అంటే అల్లికలు, కుట్లు వేయటం కాదు, డిన్నర్ పార్టీ కాదు, వ్యాసం రాయటమో, పెయింటింగ్ వేయటమో కాదు అని అన్నాడు ఒక పెద్దమనిషి. ఆ హిత వాక్యాన్ని తనకు అన్వయించి చెప్పాలంటే, రాజకీయమంటే డైలాగులు, పార్టీలు మారటాలు, షెగువేరా-భగత్‌సింగ్‌ల నుంచి మతతత్వ జాతీయవాదంలోకి లాంగ్‌జంప్ చేయటాలు కాదు. ఆయన జాతీయవాదమని, దేశ సమైక్యత అని, జాతి భద్రత, విభజనవాదం, ప్రాంతీయవాదమని తనకే అవగాహన లేని విషయాల్లోకి లూజ్ టాక్ వలె తలదూర్చుతున్నారు. ఇటువంటి వ్యక్తి లూజ్ టాక్ లోకి మనం ప్రవేశించనక్కరలేదు గాని, హీరో బన్‌గయా జోకర్ అనే పరిస్థితి నుంచి కాస్త వెనుకకు తగ్గటం ఆయనకు మంచిది.
– టంకశాల అశోక్