బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిన సందర్భంగా డాక్టర్ పత్తిపాక మోహన్‌ను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించింది. ఆయన స్పందన మీ కోసం..
బాల సాహిత్యాన్ని పెద్దలే రాస్తారు, పెద్దలే చదువుతారనే అపవాదున్నది. దీనిపై మీ కామెంట్?
బాల సాహిత్యం కూడా జానపద సాహిత్యం లాగే తొలినాళ్ల నుంచి ఉన్నది. అయితే ఆంగ్ల విద్య బాల సాహిత్యం ఒక పాయగా ఆవిర్భవించేందుకు దోహదపడింది. నిన్న మొన్నటి వరకు పిల్లల కోసం సాహిత్యాన్ని పెద్దలే సృజన చేస్తూ వచ్చారు. బాల సాహిత్యాన్ని పెద్దలే చదువుతారనే విషయంలో అది తిరిగి పెద్దల్ని వాళ్ల బాల్యంలోకి తీసుకువెళ్లేందుకు దోహదం చేసింది. ‘చందమామ’ను పిల్లలు ఎంతగా చదివేవారో, అంతకు మించి పెద్దలు చదివేవారు.
సాధారణంగా పుస్తక పఠనం తగ్గిపోతుందంటున్నారు. అలాంటప్పుడు పిల్లల్లో పుస్తక పఠనం పెంచడం కోసం ఏ చర్యలు చేపట్టాలి?
మా తాత పత్తిపాక శంకరయ్య పంతులు అందించిన స్ఫూర్తి, మా ఇందిరక్క, తాతమ్మ, అన్నక్క, మరోతాత విశ్వనాథం గార్లు బాల్యంలో అందించిన పుస్తకాలతో పుస్తకం వైపు మళ్లాను. ఇక్కడిదాకా పుస్తకాన్ని పట్టుకొని నడిచివచ్చాను. ఎప్పుడూ పుస్తకం మనిషి చేతిలో జెండాలాగా రెపరెపలాడాలని కోరుకుంటాను. ‘పుస్తక పఠనం’ తగ్గలేదు కానీ, చదివే అలవాట్లలో మార్పులొ చ్చాయి. 80వ దశకం వరకు కథలు, నవలలు, మాస, వారపత్రికలు, ఇతర పుస్తకాలు చదివాం. అయితే నేటితరం సాహిత్యాన్ని కాక విజయానికి మెట్ల్ల వంటి వాటిని చదువుతున్నది. ఇప్పుడు పాఠకుల అభిరుచి మారింది. ఒక గొప్ప శుభపరిణామం ఏమంటే ఇప్పుడు పిల్లల పుస్తకాలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఇప్పటి తరం, లేదా యువతరం సంగీత సాహిత్యాలను ప్రేమించినప్పుడే, వాటివైపు మళ్లినప్పుడే ఒత్తిడి నుంచి బయట పడతారు. సంగీత సాహిత్యాలే విశ్వమానవుణ్ని నడిపించే, కాపాడే సాధనాలు.
బాల సాహిత్యంలో వస్తువు ఎలా ఉండాలి?
పెద్దలు, యువత కోసం రాయడం సులభం. కానీ, బాలల కోసం రాయడం కత్తిమీద సాము వంటిదే. బాల సాహిత్యంలో రచయిత ఎంచుకున్న వస్తువు మొదటగా పిల్లలకు నచ్చేదిగా, పసి మనసులు మెచ్చేదిగా ఉండాలి. నేను ఒకచోట చదివాను, ‘బాల సాహిత్యం నీతి ఆధారంగా, అద్భుత రస ప్రధానంగా ఉండాలని’. అయితే నేటి పిల్లలకు వీటితోపాటు హేతువు, విజ్ఞానం, వినో దం, వికాసం వంటివాటికి దోహదపడేదిగా ఉండాలన్నది నా అభిప్రాయం. ఒక్కమాటలో చెప్పాలంటే బాలలకు అందించే సాహిత్యం గోరుముద్దల్లాగా, పాలగోకులాగా ఉండాలి తప్ప, ఎంత నమిలినా అరగని ఆహారంలా ఉండొద్దు. బాలల కోసం రాయడం ఎంత కష్టమో, వస్తువును ఎంచుకోవడం కూడా అంతే కష్టం. మౌలిక స్థాయిలో భాష, వస్తువు, విషయం, వివరణ, పరిసరాలు, పాత్రలు, సంఘటనలు ఉండాలి.
బాల సాహిత్యం ప్రత్యేకత ఏమిటి?
బాలల్లాగే బాల సాహిత్యం కూడా ప్రత్యేకమైనది. బాల సాహిత్యం అందం, ఛందం వేరు. పిల్లల్లాగే అందమైన వయ్యిలు, అంతకంటే అందమైన బొమ్మలు బాల సాహిత్యం ప్రత్యేకత.
సామాజిక విషయాలు, జీవన విలువలు ప్రోదిచేసేదిగా బాల సాహిత్యం ఉండాలంటారా?
బాల సాహిత్యం ఆనందంతో పాటు, విజ్ఞానాన్ని కలిగించేదిగా ఉండాలి. వాళ్ల మానసిక, వయో స్థాయిని అనుసరించి వివిధ సామాజిక అంశాలు, విషయాలు చెప్పవచ్చు.
బాల సాహిత్యాన్ని బాలలే రాసే విధంగా ప్రోత్సహించటానికి చేపట్టాల్సిన చర్యలేమిటి?
అస్తిత్వవాద ఉద్యమాలలాగా ఇవ్వాళ మన బడి పిల్లలు కూడా తమకు కావాల్సింది తమ అద్భుత, ఆశల, ఊహల ప్రపంచం నుంచి తామే రాసుకుంటున్నారు. ఇది శుభ పరిణామం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యశాలలు, సృజనశాలలు, సదస్సుల రూపంలో విస్తృతంగా జరుగుతున్నది. ఇప్ప టివరకు బడి పిల్లలు రాసిన పుస్తకాలు 300లకు పైగా వస్తే, అందులో ఒక్క తెలంగాణ సర్కారు బడుల నుంచి 260కి పైగా ఉన్నాయి. ఇది ‘బాలల సాహిత్య రచన’ అనే విప్లవానికి నిదర్శనం. ఇంకో విషయం.. కేవలం రాయడమే కాదు, మన పిల్లలు రాసిన రచనలు పాఠ్యాంశాలుగా కూడా చేరాయి.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత బాల సాహిత్య వికాసానికి జరుగుతున్న కృషిని వివరిస్తారా?
తెలంగాణ అవతరణ తర్వాత బాల సాహిత్య వికాస దిశగా పలు కార్యక్రమాలు జరిగాయి, జరుగుతున్నా యి. ఇప్పుడు బాల సాహిత్యం విషయంలో గొప్ప వికా సం కనిపిస్తున్నది. ఈ స్ఫూర్తి ఇలాగే నిర్మాణాత్మక దిశ లో కొనసాగితే తెలంగాణలో బాల సాహిత్యం మరింత ఉన్నతంగా, ఉజ్వలంగా వెలువడుతుంది.
బాల సాహిత్యంలో మీ సుదీర్ఘ ప్రయాణం, అనుభవం ఏం చెప్తున్నది?
ఏడవ తరగతిలో నా మొదటి కవితను రాశాను. 1997-98లో నా బాల సాహిత్య ప్రస్థానం మొదలైం ది. బాల సాహిత్యంలో 11 పుస్తకాలొచ్చాయి. త్వరలో మరో 3 రానున్నాయి. పిల్లల కోసం అనువాదాలు 30 వరకు తెచ్చాను. వివిధ సంకలనాలు, సంపాదకత్వాలుగా వచ్చినవి 24 ఉన్నాయి. 25 ఏండ్లుగా పిల్లల కోసం రాస్తున్నాను. నా అనుభవం చిన్నదే కానీ నడిచిన నడక పెద్దది. అయితే నేడు వస్తున్న పుస్తకాలు, రచనల్ని బాలలు సాహిత్యాన్ని ప్రేమిస్తారన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఈ మధ్య ఉత్తమ సాహిత్యం ఎక్కువగా వస్తుండటం ఊరటనిచ్చే విషయం.
బాల సాహిత్యం కేవలం ఆనందం కోసమనే వాదన ఉన్నది.
అవును, రసానందమే సాహిత్యపు పరమావధి. నా మటుకు నేను బాల సాహిత్యం మొదట పిల్లలకు ఆనందాన్ని కలిగించాలని భావిస్తాను. ఆ తర్వాతే వికాసం వంటి ఇతర అంశాలు వస్తాయి. ఏ ప్రాంతం పిల్లలకు ఆ భాషలో అందితే అది సంజీవిని కంటే కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిన సందర్భంగా బాల సాహిత్యకారులకు మీరిచ్చే సూచనలు ఏమిటి?
నేనింకా విద్యార్థినే. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విష యం నేర్చుకుంటూనే ఉన్నా. ఉద్యోగరీత్యా నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియాలో తెలుగు సంపాదకునిగా ఉన్న నాకు దాదాపు అన్ని భారతీయ భాషల్లో వస్తున్న బాల సాహిత్యాన్ని చదివే అవకాశం లభించడం వల్ల, నా అక్షరాలను మరింతగా సానపట్టి, మెరుగుపర్చుకు నేందుకు దోహదపడింది. నేను బాల సాహిత్యకారులను కోరేదొక్కటే.., మనం రాస్తున్న సాహిత్యం మొదట పిల్లలకు అందేట్టుగా చూడాలి. తర్వాతే పాఠకులైన పిల్లల పని.