బహుజన తల్లులకు అక్షర నీరాజనం
ఈ ‘పసరంటిన కొడవలి’లోని కవిత్వం ఒక్క సహజకవి వనపట్ల సుబ్బయ్య శోకగీతం కాదు. ఇదొక సామూహిక కవితాశ్రు గీతం. అమ్మలకు దూరమైన మనందరి గుండెల్లో ఉబికే దుఃఖాన్ని, కన్నీళ్లను ఆర్తితో అక్షరాల్లోకి అనువాదం చేసి మన అమ్మల రూపం కండ్లల్లో నింపుతడు.
అమ్మ అనే రెండక్షరాల నిఘంటువులో…ప్రపంచంలోని అన్ని భాషల ప్రేమ, కరుణ, మమకారం దాగి ఉన్నాయి.
-దాశరథి కృష్ణమాచార్య
ఈ ‘పసరంటిన కొడవలి’లోని కవిత్వం ఒక్క సహజకవి వనపట్ల సుబ్బయ్య శోకగీతం కాదు. ఇదొక సామూహిక కవితాశ్రు గీతం. అమ్మలకు దూరమైన మనందరి గుండెల్లో ఉబికే దుఃఖాన్ని, కన్నీళ్లను ఆర్తితో అక్షరాల్లోకి అనువాదం చేసి మన అమ్మల రూపం కండ్లల్లో నింపుతడు. ‘అసెపే’ కవిత్వ సంపుటిలో కన్నతండ్రి మంగలి బాలయ్యను అక్షరాలతో అభివర్ణించి రుణం తీర్చుకుంటే, ఈ ‘పసరంటిన కొడవలి’ కవిత్వ సంపుటిలో కన్నతల్లి మంగలి బాలమ్మకి అక్షరాభిషేకం చేస్తడు. అమ్మ అని పలకగానే మన రెండు పెదాలు ఒకటైతయి. రెండు పెదాల లాంటి బంధం తల్లీకొడుకుల సంబంధం. అమ్మతో పెనవేసుకున్న పేగుబంధమది.
అమ్మకు ప్రత్యామ్నాయం లేదు
అమ్మ గుడిలో లేదు/అమ్మ పండుగలో లేదు
అమ్మకు అక్షరమే నివాళి/నా అక్షరం అమ్మ
అమ్మ జీవిత కావ్యం!
అంటూ అమ్మను మహాకావ్యం చేస్తడు సుబ్బన్న. అందుకే అమ్మ మీద ఏ కవిత చదివినా, ఏ కవి రాసినా, మన అమ్మే యాదికొస్తది. ఆ కవిత్వం తాలుకు దుఃఖసాగరంలో కొట్టుకుపోతున్నప్పుడు మన అమ్మతో మనకున్న మరపురాని ప్రేమానుభూతులు గుర్తుకొస్తయి.
నిజానికి ఈ సంపుటికి ముందుమాటలు రాసిన ముగ్గురు సాహిత్యకారులు తమ తల్లుల్ని కోల్పోయినవారే. అమ్మలేని బాధని గుండెల్లో అనునిత్యం భరిస్తున్నవాళ్లే. అమ్మ జ్ఞాపకాలను ప్రతిరోజూ నెమరేసుకుంటున్నవాళ్లే. ఆ ముగ్గురు తిరునాళ్లలో అమ్మ నుంచి తప్పిపోయిన చిన్నపిల్లల్లా బెంగతో, ఆవేదనతో తమలాగే తల్లిని కోల్పోయిన సుబ్బయ్యను ఎంతో ఆలోచనాత్మకమైన, ఆవేదనాక్షరాలతో భుజం తట్టి ఓదార్చుతున్నారు. ఇంకా ఈ కవిత్వం వారి మీద ఎలా ప్రగాఢమైన ముద్ర వేసిందో కూడా ఇలా వ్యక్తపరుస్తున్నారు.
‘అమ్మ లేని బిడ్డల గోసగా కవి సుబ్బన్న రాసిన ఈ స్మృతి కవితల పొత్తం దుఃఖం గురించి, మరణం గురించి ఆలోచించేటట్లు చేసి నన్ను ఎన్నో నిద్రలేని రాత్రులకు గురిచేసింది’.
(కొల్లాపురం విమల)
‘సుబ్బయ్య అమ్మ రాయాలనుకున్న కొన్ని అనుభవ శకలాలను ఈ ‘పసరంటిన కొడవలి’లో పొదిగారు. సుబ్బయ్య తన తల్లి కన్నీళ్లను సిరాగా వాడినట్లున్నారు’.
(రావులపాటి సీతారాం)
‘పసరంటిన కొడవలి’ కేవలం అమ్మ మీద రాసినది కాదు, తల్లి దూరమైనప్పుడు వచ్చిన సుట్టాలందర్ని పట్టుకొని ఏడ్చే కొడుకుల దుఃఖం ఉన్నది. ఈ సంపుటిలో సుబ్బన్న అమ్మ మీదనే రాయలే. అమ్మగా మారి రాశాడు. అందుకే ఈ అక్షరాల్లో చనుబాల తీపి వాసన ఉన్నది.
(తగుళ్ళ గోపాల్)
అమ్మ! నీ పేరు మీద
ఏటా రెండు మొక్కలు నాటుతున్న
ఈ మట్టికి మాత్రమే మన అనుబంధం తెలుసు
నిన్నెంత పిలిచినా పలకవనీ తెలుసు
నా బిడ్డకు నీ పేరు పెట్టుకున్న
అమ్మా అని పిలిస్తున్న!!
అమ్మను ప్రకృతిలో భాగం చేశాడు కాబట్టి, ఈ భూమికి, చెట్టుకి ఉన్న సంబంధమే తల్లీకొడుకుల అనుబంధంగా అనుభూతి చెందుతున్నాడు. అందుకే ఇంటిముందు చెట్టులో అమ్మను చూసుకుంటున్నాడు. ఎంత పిలిచినా పలకదని బిడ్డకే ఆమె పేరు పెట్టుకుని ‘అమ్మా’ అని ఆప్యాయంగా పిలుచుకుంటున్నాడు. ప్రతిరోజూ తల్లి కోసం తల్లడిల్లుతున్న తండ్రిని చూసి పిల్లలు మీ అమ్మేదని అడిగితే! నింగిన పొన్నచెట్టు కింద అవ్వని/మా అమ్మ అని చూపిస్తున్న…అంటూ అమ్మని ఒక చైతన్యకెరటమని..నిత్యం స్ఫూర్తిని ప్రసాదించే స్ఫూర్తి ప్రధాత అని కొనియాడతాడు.
ఈ సంపుటిలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాతృమూర్తి తారకమ్మ మీద ఒక కవిత, ఇంకా తమ విలువైన ముందుమాటలిచ్చిన ముగ్గురి మాతృమూర్తులైన సౌభాగ్యలక్ష్మి, మాణిక్యం, ఎల్లమ్మ మీద కొన్ని కవితలున్నయి. తనలాగా అమ్మని కోల్పోయిన తన ప్రియమిత్రుల అమ్మల జ్ఞాపకాల్ని తడుముకుంటూ, గుండెల్ని పిండేసే కవితల్ని ఆ బహుజన మహతల్లుల స్మృతిలో అల్లి, ఈ ‘పసరంటిన కొడవలి’ లాంటి ఉత్తమ స్మృతి కవిత్వ సంపుటిని ప్రచురించినందుకు వనపట్ల సుబ్బన్నకు హృదయపూర్వక అభినందనలు.
ప్రొఫెసర్ బాణాల శ్రీనివాసరావు
94404 71423
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

