స్వయం పాలన.. తెలంగాణ మట్టి మనుషులను బానిసత్వం నుంచి స్వతంత్రులను చేస్తుందని గట్టిగా నమ్మి కేసీఆర్ ఏర్పాటు చేసిన పార్టీ 22 ఏండ్లను పూర్తి చేసు కుంది. ఆయన నమ్మకం నిజమైంది. నేడు తెలంగాణ అన్ని రంగాల్లో వెలు గులు విరజిమ్ముతున్నది. అభివృద్ధి ఒక ప్రాంతానికి, కొన్ని రంగాలకు, కొంతమంది ప్రజలకే పరిమితం కాకుండా అందరికీ అందేలా, సంక్షేమ అభివృద్ధి ఎజెండాయే లక్ష్యంగా బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టింది. నేటి ప్లీనరీ దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల మధ్య జరుగుతున్నది.
బడా కార్పొరేట్ సంస్థల చేతిలో కీలుబొమ్మగా మారిన బీజేపీ ప్రభుత్వం అణగారిన ప్రజల ఉసురు తీస్తున్నది. మోదీ నియంతృత్వ పాలనకు ముగింపు పలకాల్సిందేనని దేశంలోని మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువత ముక్తకంఠంతో అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే, అట్టడుగు వర్గాల ప్రజల హక్కులను కాలరాస్తూ వారి శ్రమను దోచిపెట్టి బడాబాబుల జేబులు నింపుతున్నది బీజేపీ సర్కారు.
ఇలాంటి పాలన కొనసాగితే సగటు జీవి బ్రతికి బట్టకట్టే పరిస్థితి ఉండక పోవచ్చు. ఈ నేపథ్యంలోనే దేశంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఏర్పాటు అవసరాన్ని గుర్తించి బీఆర్ఎస్ను ప్రకటించారు కేసీఆర్. నేడు అనతి కాలంలోనే దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించే స్థాయికి బీఆర్ఎస్ చేరింది. ఈ 22 ఏండ్ల చరిత్ర వెనుక కేసీఆర్ కఠోర శ్రమ ఉంది. ఉద్యమ పార్టీగా తన పయనాన్ని మొదలుపెట్టి, ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసి, అవమానాలను భరించి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి స్వయంపాలనను సాధించడానికి అనేక మైలురాళ్లను అధిగమించింది.
దేశంలో, రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు వచ్చాయి. పోయాయి. కానీపార్టీ పెట్టి, ఉద్యమానికి నాయకత్వం వహించి, లక్ష్యాన్ని చేరుకొని అధికారంలోకి వచ్చిన నేతలు బహు అరుదు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీని రెండు పర్యాయాలు అధికారంలో నిలబెట్టిన వారిలో ఒకరు కేసీఆర్, మరొకరు ఎన్టీఆర్ మాత్రమే. ఈ మధ్యకాలంలో 50పైగా కొత్త పార్టీలొచ్చాయి, పోయాయి. కానీ కేసీఆర్, ఎన్టీఆర్లకు ప్రజల్లో ఆదరణ తగ్గలేదు. వారు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే దీనికి కారణం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలలో కూడా అమలుకు నోచుకున్నాయంటే మన రాష్ట్ర పథకాలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థం అవుతుంది.
రైతు పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకానికి ఐక్యరాజ్య సమితి కితాబు ఇచ్చింది. రైతులకు ఇచ్చే పెట్టుబడి సహాయం వ్యవసాయ సుస్థిర అభివృద్ధిలో రైతు కీలక భాగస్వామ్యానికి ఎంతో దోహదపడుతుందని అభిప్రాయపడింది. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తును సరఫరా చేయడమే కాక ప్రాజెక్టుల ద్వారా సాగునీరును అందించడంతో తెలంగాణ దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ర్టాలైన పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ర్టాలకు దీటుగా, గ్రామీణాభివృద్ధికి వెన్నెముకగా నిలబడింది. దేశంలో ఉన్న ప్రస్తుత వ్యవసాయ సంక్షోభాన్ని అరికట్టటం కేసీఆర్ ద్వారానే సాధ్యమవుతుందని జాతీయ రైతు నేతలు భావిస్తూ, కేసీఆర్ పక్షాన నిలబడడం గర్వించదగినది. భారతదేశ రాజకీయాలలో సమూల మార్పులు తీసుకురావడానికి, అట్టడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పని చేయనున్నది. చైతన్యం కలిగిన భారత ప్రజలు బీఆర్ఎస్ ప్రస్థానాన్ని అర్థం చేసుకొని, కేసీఆర్ వెంట నడువాలి. బీఆర్ఎస్ను దేశంలోనే అగ్రశ్రేణి పార్టీగా రూపొందించ టానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలి.
డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి: 95530 86666
(వ్యాసకర్త: వికలాంగుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్)