తెలంగాణలో పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న తీరును చూడగా ‘డెమోక్రసీ మార్కెట్’ అనే మాట స్ఫురిస్తున్నది. సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావటం యథాతథంగా సంతోషించవలసిన విషయమే తప్ప ఆక్షేపించవలసిందేమీ లేదు. ఏకగ్రీవం కావటం ప్రజల అభీష్టంతో స్వచ్ఛందంగా జరిగినట్టయితే. అందులో డబ్బు పాత్ర ఏ రూపంలో ఉన్నా, పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటి ప్రధానమంత్రి నెహ్రూ 1959లో ఏ ఉత్కృష్ట ప్రజాస్వామ్య లక్ష్యంతో ప్రవేశపెట్టారో అది మౌలికంగా భంగపడినట్టే. ప్రస్తుతం జరుగుతున్నది గనుకనే దీనిని ‘డెమోక్రసీ మార్కెట్’ అనవలసి వస్తున్నది.
మనకు ‘డెమోక్రసీ అండ్ ద మార్కెట్’, ‘మార్కెట్స్ అండ్ డెమోక్రసీ’ అనే భావనలతో అధ్యయనాలున్నాయి. అవి ప్రజాస్వామిక వ్యవస్థలో స్వేచ్ఛా వాణిజ్యానికి, పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించినవి. ప్రజాస్వామ్యమనే రాజకీయ వ్యవస్థ కూడా స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం కావటానికి బదులు పెట్టుబడిదారీ శక్తులకు ఉపయోగపడే సాధనంగా మారిందన్న వాదనలు కూడా అదే పాశ్చాత్య ప్రపంచం నుంచి వినవస్తున్నాయి. ఇది విస్తృతమైన వ్యవస్థలకు సం బంధించిన మాట. దీనిని పరిమిత దృష్టితో ప్రస్తుత పరిస్థితికి అన్వయించి తీసుకుంటే, పంచాయతీ ఎన్నికలలో కనిపిస్తున్నది ‘డెమోక్రసీ మార్కెట్’ అవుతున్నది. ఆ మాటను తెలుగులో నిర్వచించి చెప్పాలంటే, డెమోక్రసీ అనే దానిని డెమోక్రసీ అనే భావన పరిధి నుంచి బయటకు తెచ్చి, మార్కెట్లో నిలబెట్టి, డబ్బుకు అమ్మకం చేయటమన్నమాట. ‘ప్రజల శక్తి’ అనే అర్థం గల డెమోక్రసీ మాటను మొదట క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఉపయోగంలోకి తెచ్చిన గ్రీకు తత్తవేత్తలు గాని, మనవద్ద పంచాయతీరాజ్ పేరిట అదే భావనను అమలుచేయజూసిన నెహ్రూగాని ఈ రోజున ఇక్కడ జరుగుతున్న దానిని చూసి ఏమనగలరో అన్న ఆలోచన కలిగి నవ్వు వస్తున్నది.
ఇందులో మరొక సూక్ష్మం ఉన్నది. సర్పంచ్‌గా ఎన్నిక కాగల వ్యక్తి గ్రామం నుంచి లభించే రెవెన్యూ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి రాగల నిధులతో పాటు సొంత ధనాన్ని కూడా గ్రామాభివృద్ధికి వినియోగించదలిస్తే అందుకు అభ్యంతరం ఉండనక్కరలేదు. కానీ, వాస్తవ పరిస్థితి ఏమిటి? ఈ మూడు విధాలైన నిధులను కలిపినా గ్రామాభివృద్ధికి చాలటం లేదు. చాలుతున్న గ్రామాలు ఏవైనా ఉన్నాయేమో అనుమానాస్పదం. పనులు చేయాలని సర్పంచ్‌లపై వార్డుసభ్యుల నుంచి, ప్రజల నుంచి ఒత్తిళ్లు ఉంటాయి. ఒకవైపు ఆ ఒత్తిళ్లు తట్టుకోలేకపోవటం, మరొకవైపు పనులు చేయించకపోతే తనకు రాజకీయ భద్రత ఉండదనే భయంతో పలువురు వ్యక్తిగతంగా అప్పుచేసి మరీ పనులు చేయిస్తున్నారు. ఆ పనుల బిల్లుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. అప్పులు, వడ్డీల బరువు మోయలేక, బిల్లులు రాక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్న వార్తలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి.
నిధుల లభ్యతకు సంబంధించి మరొక సమ స్య ఏమంటే, రాజీవ్‌గాంధీ ప్రభుత్వం తెచ్చిన 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత అధికారాలు అన్నింటిని పంచాయతీలకు బదిలీ చేసి ఉంటే నిధుల సమస్య కొంత తగ్గేది. ఆ అధికారాలలో ఆర్థిక పరమైనవి కూడా ఉన్నాయి. ఆర్థిక అధికారాలను వదులుకోదలచని రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని మాత్రం మినహాయించి తక్కినవి పంచాయతీలకు సగౌరవంగా పువ్వులలో పెట్టి అప్పగించాయి. రాష్ర్టాలు ఇటువంటి పనులు చేస్తాయని తెలిసిన కేంద్ర ప్రభుత్వం తన గ్రాంట్లను నేరుగా పంచాయతీలకు అప్పగించే ప్రయత్నం చేయగా, ఆ చర్య రాష్ర్టాల ఫెడరల్ అధికారాలకు భంగకరమంటూ నానా యాగీ చేశారు. ఫెడరలిజం అనేది ఢిల్లీలో బయల్దేరి రాష్ట్ర రాజధానుల వరకు వచ్చి ఆగదని, ఆగకూడదని, అది గ్రామాల వరకు ప్రయాణిస్తేనే ఆ భావనకు సార్థకత ఉంటుందని తెలిసో లేక తెలియకనో మొత్తానికి రాష్ర్టాలు స్వయంగా తామే వాదించే ఫెడరలిస్టు సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూనే ఉన్నాయి. ఆ విధంగా ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిం’దన్నట్టు, చివరికి గ్రామాల ఆర్థిక పరిస్థితికి ఇది మరొక సమస్యగా మారింది.
ప్రస్తుతానికి తిరిగి వస్తే, ఇన్నిన్ని కష్టనష్టాలున్నా సర్పంచ్ అయ్యేందుకు తెలిసి తెలిసీ ఇంతమంది పోటీ పడటం ఎందుకు? ఆ పోటీ ప్రతి ఎన్నికకూ మరింత పెరగటం ఎందువల్ల? సర్పంచ్ పదవులకు వేలాలు, అభ్యర్థుల రకరకాల ఖర్చులు గతంలోనూ ఉన్నాయి. వాటి స్థాయి మాత్రం స్టాక్‌మార్కెట్ సూచీలతో, భారతదేశ జీడీపీతో, ప్రపంచంలో భారత ఆర్థికవ్యవస్థ స్థానం తో, దేశంలోని బిలియనీర్ల సంఖ్యతో, ఆసియాలోని కుబేరుల్లో భారత కుబేరుల ర్యాంకింగ్స్‌తో, ధనిక-పేద తారతమ్యాలతో, సరాసరి సగటు ఆదాయాలతో పోటీ పడి ఎప్పటికప్పుడు పెరుగుతున్నది. సర్పంచ్ పదవిని అలంకరించేందుకు మనుషులు పోటీ పడుతున్నారు. ఎప్పటికప్పుడు మరింత ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. ఇదే విషయమై ఈసారి మరొక ఆశ్చర్యకరమైన దృశ్యం కూడా కనిపించింది. నామినేషన్లు వేసేందుకు వచ్చినవారి క్యూల పొడవులు ఒకటైతే, ఆ ఫొటోలలోని మనుషులను చూడగా వారిలో పలువురు అతి సామాన్యుల వలె తోచటం మరొకటి.
ఎవరైనా అటువంటి కొద్ది గ్రామాలను నమూనాగా తీసుకొని, నామినేషన్ వేసిన ప్రతి ఒక్కరి ఆర్థిక నేపథ్యాన్ని, నామినేషన్ వేయటంలోని ఉద్దేశాలను తెలుసుకొని ఒక నివేదిక తయారుచేస్తే అనేక విషయాలు తెలియగలవు.
దీనంతటిని బట్టి తేలుతున్నదేమంటే, సర్పంచ్ వంటి, వార్డుసభ్యుల వంటి కడపటి స్థాయి పదవులు కూడా అధికారాన్ని, కాంట్రాక్టు అవకాశాలను ఆధారం చేసుకొని అమితమైన ఆకర్షణగా మారుతున్నాయి. ఈ ఆకర్షణ ఎప్పటికప్పుడు పెరుగుతున్నది. సంపన్నులకు, పైకులాల వారికి పరిమితమై ఉండిన ఆ స్థితి ఇతరులకు కూడా వ్యాపిస్తున్నది. అటువంటి వ్యాప్తి సహజ క్రమంలో జరిగితే దానిని వ్యవస్థల ప్రజాస్వామికీకరణగా, అధికార పరివర్తనగా భావించి సంతోషించవచ్చును. పంచాయతీరాజ్ వ్యవస్థను బల్వంత్ రాయ్ మెహతా సిఫారసుల ప్రకా రం దేశంలో ప్రవేశపెట్టినప్పుడు నెహ్రూ లక్ష్యం అదే. అప్పటి ఫ్యూడల్, కులవ్యవస్థలో గ్రామీణ స్థాయి అధికారాలన్నీ పెద్దవారి చేతిలో కేంద్రీకృతమై ఉండగా, ఆ స్థితిని భంగపరిచేందుకు, అధికార వికేంద్రీకరణకు, కింది తరగతులకు కూడా అధికారం లభించేందుకు పంచాయతీ వ్యవస్థ ఒక మంచి సాధనం కాగలదని భావించారాయన. బలవంతులైన వారి పన్నాగాలతో ఆ లక్ష్యం నెరవేరింది ఎంత, భంగపడింది ఎంత అనేది వేరే చర్చ. విషయం ఏమంటే, ప్రస్తుతం మనం చూస్తున్న మార్పులు సహజసిద్ధమైన ప్రజాస్వామిక ప్రక్రియగా జరగటం లేదు. ఇందులో పాత్రధారి డబ్బు అవుతున్నది. డబ్బున్నవారు తామే ఖర్చులు భరించి ఎవరితోనో నామినేషన్లు వేయిస్తున్నారనే మాట కూడా వినవస్తున్నది.
మొత్తం మీద ప్రజాస్వామ్యమనే భావన ఈ విధంగా గ్రామస్థాయిలోనూ ఓడిపోతున్నది. డేనియెల్ బెల్ అనే మేధావి ఒకరు ‘ఎండ్ ఆఫ్ ఐడియాలజీ’ పేరిట 1960లో ఒక థియరీ రాశాడు. తర్వాత 32 ఏండ్లకు ఫ్రాన్సిస్ ఫుకుయామా ‘ఎండ్ ఆఫ్ హిస్టరీ’ పేరిట మరొక థియరీ రాశాడు. అదే వరుసలో ఇప్పుడు ఎవరైనా ‘ఎండ్ ఆఫ్ గ్రాస్ రూట్ డెమోక్రసీ’ అని రాస్తే అతికినట్టు సరిపోతుంది. ఆ రచనను నెహ్రూకు అంకితమిస్తే ఆయన ఆత్మ ఎంతైనా క్షోభించగలదు. తనతో పాటు, ప్రజాస్వామ్య ప్రేమికులందరు కూడా క్షోభపడవచ్చు. కానీ, ప్రజాస్వామ్యం పేరిట అధికార వ్యాపారం, ధన వ్యాపారం సాగిస్తున్నవారంతా ఆనందించవచ్చు.
అదే సమయంలో ముఖ్యమైన ప్రశ్న ఒకటి వేసుకోవాలి. పంచాయతీ ఎన్నికల సందర్భంలో చూస్తున్న ‘డెమోక్రసీ మార్కెట్’ అన్నది శాశ్వతస్థితా? ఆ మాటకు వస్తే పంచాయితీ ఎన్నికలు అనేమిటి, అన్ని ఎన్నికలూ ‘మార్కెట్’లోనే ఉంటున్నాయి గదా? అసలు ప్రజాస్వామిక వ్యవస్థే ప్రత్యక్షంగానో, వివిధ పరోక్ష రూపాలలోనో మార్కెట్లో ఉంది గదా? పంచాయతీ ఎన్నికలన్నవి ఇప్పుడొక సందర్భంగా ముందుకువచ్చి చిత్ర విచిత్రాలు అనేకం జరుగుతున్నందున దానిని ఒక అవకాశంగా తీసుకొని చర్చిస్తున్నాము గాని, విస్తృతార్థంలో అన్నీ తమ ఒరిజినల్ నిర్వచనాల పరిధి నుంచి వెలికివచ్చి మార్కెట్లో నిలబడ్డవే. ఇది ఇక మార్పులేని శాశ్వత స్థితా అన్నది ప్రశ్న.
సమాజానికి, పరిణామాలకు, చరిత్రకు గల శక్తి అద్భుతమైనది. తిరుగులేనిది అంటూ ఏమైనా ఉంటే అది మాత్రమే. కనుక మనం ప్రస్తుతం చూస్తున్న ‘డెమోక్రసీ మార్కెట్’ సైతం సమాజం, పరిణామాలు, చరిత్రల బలిమితో వెనుక ముఖం పట్టక తప్పదు. ‘ఎండ్ ఆఫ్ ఐడియాలజీ’ రచయిత డేనియెల్ బెల్ ఈ విషయమై తన జీవితకాలంలో ఏమీ అన్నట్టు లేదు గాని, ‘ఎండ్ ఆఫ్ హిస్టరీ’ రాసిన పుకుయామా మాత్రం ఒక ఇంటర్వ్యూలో తన థియరీ తప్పుగా తేలిందని అంగీకరించాడు. పరిణామాలు అనూహ్యమైన మలుపులు తిరిగి కొత్త చరిత్రను సృష్టిస్తాయన్నది తన ఉద్దేశం. ఆ విధంగా ఆలోచించినప్పుడు, తెలంగాణ వంటి చైతన్యశీలమైన సమాజం ‘డెమోక్రసీ మార్కెట్’ దశలోనే శాశ్వతంగా ఉండిపోతుందని భావించనక్కరలేదు. ఈ నేల ఎన్నెన్నో అవాంఛనీయ దశలను ఛేదించినందున ఈ దశను కూడా ఛేదించగలదు.