కవి, రచయిత ‘ఎలనాగ’ స్పష్టతకు పెట్టింది పేరు. కవిత్వం రాసినా, భాష మీద, కవిత్వం మీద, కథ మీదనో విమర్శ చేసినా, అనువాదం చేసినా, అనువాద విషయాల మీద చర్చించినా సందేహాతీతమైన ప్రకటనలా ఉంటుంది వారి అభివ్యక్తి. ఎలనాగ రచనలు వారిలోని బహుళత్వాన్ని మాత్రమే గాక అభిప్రాయాల్లో నిర్దుష్టతను స్పష్టపరుస్తాయి.
ఎలనాగ రాచించిన ‘పళ్లెరం’ వ్యాస సంపుటి విశిష్టమైనది. ఇందులో మూడు ప్రధాన అంశాలపై వ్యాసాలున్నాయని తన ‘నాలుగు మాటలు’గా చెప్పుకొన్నారు. నిజానికి ఈ సంపుటిలో నాలుగు అంశాలపై వ్యాసాలున్నాయి. అవి సంగీతం, సాహిత్యం, భాష, అనువాదాలు. సంగీతం గురించి రాయగల బహుకొద్ది మంది సాహిత్యకారుల్లో ఎలనాగ ఒకరు. నిజానికి ఉత్తరాది ఘరానాల గురించి సామల సదాశివ తర్వాత, ఎలనాగ గారే రాస్తున్నారు. ‘పళ్లెరం’లోని 46 వ్యాసాల్లో 9 వ్యాసాలు సంగీతానివే.
‘పళ్లెరం’లో ఉన్న సాహిత్యవ్యాసాల్లో సింహభాగం కవిత్వంగురించి లేదా కవుల గురించే ఉన్నాయి. కొన్ని సంపుటాలపై రాసిన వ్యాసాలున్నాయి. కవిత్వంలో వ్యక్తీకరణలో ప్రత్యేకమైన చాలా వ్యాసాలున్నాయి. కొన్ని కవితల ఆధారంగా కవి లక్షణాన్ని అంచనా వేయడంలో ఎలనాగ గారిది ప్రత్యేకత. మోహన్ రుషి కవిత్వం గురించి చెబుతూ ‘అరిగిపోయి మురిగిపోయిన పదాల కోసం పాకులాట అసలే కన్పించదు’ అంటారు. ఏనుగు నరసింహారెడ్డి గురించి రాస్తూ ‘All usion’ను అందంగా భాసిల్లజేసే కవుల్లో ఈయన ఒకడంటారు. సమీక్షల్లో అభిప్రాయాన్ని స్పష్టంగా సున్నితమైన భాషలో చెప్పటం ఎలనాగ ప్రత్యేకత.
భాష మీద ఎలనాగకు చాలా శ్రద్ధ. అక్షరాల్లో తప్పు దొర్లినా, వాక్యనిర్మాణంలో దోషమున్నా కచ్చితంగా ఎత్తి చూపుతారు. ‘భాషా సవ్యతకు బాటలు వేద్దామని’ ఒక పుస్తకమే రాశారు. మనం తరచూ ఒకే పదమని భ్రమించే ‘వస్తుంది’, ‘వస్తున్నది’, ‘వస్తోంది’లకు గల తేడాను వాడకాన్ని వివరిస్తూ రాసిన వ్యాసం మన ఆలోచనను మెరుగు పరచడమే కాకుండా ముగ్ధుల్ని చేస్తుంది. మనం చుక్కలను పదాలకు మధ్య పెట్టాల్సి వచ్చినప్పుడు లెక్కాపత్రం లేకుండా పెడతాం. కానీ దానికీ ఓ అర్థముందని లెక్క ప్రకారమే ఆ చుక్కలు పెట్టవలసి ఉంటుందని ఒక వ్యాసం రాశారు.
కవినుంచి అనువాదకునిగా, విమర్శకునిగా ఈ సంపుటిలో అనువాద సమస్యల మీద 9 వ్యాసాలున్నాయి. అనువాదంలో తీసుకోవలసిన జాగ్రత్తల మీద, ఇబ్బందుల మీద, కచ్చితత్వం మీద, మూలగ్రహణ సామర్థ్యం మీద, అనువాదకునికి ఉన్న స్వేచ్ఛ మీద, అనువాద పద్ధతుల మీద సవివరరమైన చర్చ చేశారు. అనేక రంగాల జ్ఞాన భాండాగారంలాంటి ‘పళ్లెరం’ వ్యాస సంపుటిలో స్పష్టత, సంక్షిప్తిత, నిర్దిష్టత ఉన్నది. సాహిత్యకారులకు అత్యంత ఉపయుక్తమైన గ్రంథమిది.
–డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి, 89788 69183