భారత్‌పై దాడికి దుస్సాహసం చేసిన పాకిస్థాన్‌కు.. భారత్ చేస్తున్న ప్రతిదాడిని తట్టుకుని నిలబడలేక ముచ్చెమటలు పడుతున్నాయి. పాకిస్థాన్ ప్రయోగిస్తున్న మిసైళ్లను భారత సైన్యం లేచీలేవంగనే తుత్తునియలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తమ దేశంలోని సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేసుకుంటున్నది.
మీరు తగినంత పెద్ద అబద్ధం చెప్పి దాన్ని పదేపదే చెప్తూ ఉంటే చివరికి ప్రజలు దానిని నమ్మడం ప్రారంభిస్తారు. ఆ అబద్ధాన్ని రాజకీయ, ఆర్థిక, సైనిక పరిణామాల నుంచి రాష్ట్ర ప్రజలను రక్షించగలిగినంత కాలం మాత్రమే అబద్దాన్ని కొనసాగించవచ్చు. అందువల్ల సమాజంలో అసమ్మతిని అణచివేయడానికి అన్ని అధికారాలను ఉపయోగించడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సత్యం అబద్ధానికి ప్రధాన శత్రువు అంటూ నాజీ ప్రచారమంత్రి జోసెఫ్ గోబెల్స్ ప్రభుత్వవర్గాలకు, పార్టీ అనుచరులకు చెప్పేవాడు. ఇప్పుడు పాకిస్థాన్ కూడా ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నట్టు స్పష్టమవుతున్నది.
ఫేక్ ప్రచారాన్ని నమ్మకున్న పాక్: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ సోషల్ మీడియాలో భారత్‌పై అబద్ధపు ప్రచారాన్ని చేపడుతున్నది. పాకిస్థాన్ అనుకూల సోషల్ మీడియాలో ఈ ప్రచారానికి తెరలేపింది. ఈ ప్రచారం కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాదు, మ్యానిపులేట్ చేసే చర్యగా అభివర్ణించవచ్చు. జమ్మూ ఎయిర్పోర్ట్ తగలబడిపోయిందని పాకిస్థాన్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నది. ఈ ఫొటోలు నిజం కావని భారత్‌కు చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో-పీఐబీ తేల్చేసింది. ఈ ఫొటోలు ఇప్పటివి కావని వెల్లడించింది. అసలు ఈ ఫొటోలు ఇండియాకు చెందినవే కావని, 2021 ఆగస్టులో కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన బాంబింగ్‌కు సంబంధించిన పాత ఫొటోలని తెలిపింది. కానీ వీటిని జమ్మూ ఎయిర్పోర్ట్ ఫొటోలుగా పాకిస్థాన్ ప్రచారం చేస్తున్నదని పేర్కొన్నది.
ఏటీఎంలు మూతపడ్డాయట : పాత వీడియోలను కొత్త వీడియోలుగా ప్రచారం చేస్తున్న పాకిస్థాన్ కొత్తసీసాలో పాతసారా పోసినట్టుగా వ్యవహరిస్తున్నది. ఇండియా మీద దాడి చేశామంటూ పాకిస్థాన్ సైన్యం తమ దేశ ప్రజల ముందు చెప్పుకుంటున్నది. అలాగే ఇండియాలో ఏటీఎంలు మూతపడ్డాయని సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నది. ఈ ఫేక్ న్యూస్‌ను పీఐబీ కొట్టిపారేసింది. భారత్‌లో ఏ ఒక్క ఏటీఎం కూడా మూతపడలేదని, మరింత క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నది. వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు కూడా ఇదే విషయాన్ని తేల్చిచెప్పారు.
గుజరాత్ ఎయిర్‌పోర్ట్‌పై దాడి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని ఎయిర్‌పోర్ట్‌ను ధ్వంసం చేశామంటూ పాక్ సైన్యం సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటున్నది. 2021 జులై 7వ తేదీన ఒక ఆయిల్ ట్యాంకర్ పేలిపోయిన ఫొటోలను జతచేసి, ఇవే గుజరాత్ ఎయిర్పోర్ట్ ఫొటోలంటూ ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నది. ఇరుదేశాల మధ్య టెన్షన్ వాతావరణం ఉన్నందున బీసీసీఐ ఐపీఎల్ మ్యాచ్‌ను రద్దు చేసుకుంది. కానీ ఈ వార్తను కూడా పాక్ మరోవిధంగా ప్రచారం చేసుకుంటున్నది. కలకత్తా వెదర్ రిపోర్టు ప్రకారం ఐపీఎల్ మ్యాచ్ రద్దు అయ్యిందని ప్రచారం చేసుకుంటున్నది.
జలంధర్‌లో డ్రోన్ అటాక్: ఎప్పుడో ఏదో ప్రాంతంలో పంటపొలాల్లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు పాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది జలంధర్‌లో తాము చేసిన డ్రోన్ అటాక్ అంటూ పాక్ ప్రచారం చేస్తున్నది. ఈ ఫేక్ వార్తను కూడా పీఐబీ కొట్టిపారేసింది. ఆపరేషన్ సిందూర్-2 ప్రారంభమైన తర్వాతే పాకిస్థాన్ లింక్డ్ అకౌంట్స్‌లో ఇలా చాలా రకాలుగా తప్పుడు ప్రచారం జరుగుతున్నది. భారతదేశంలోని ఎయిర్‌పోర్టులు మూతపడ్డాయని మరో వార్త ప్రచారంలో ఉంది. దేశంలో ఎక్కడా ఎయిర్‌పోర్ట్‌లు మూతపడలేదు. సెక్యూరిటీ తనిఖీలను దృష్టిలో పెట్టుకుని, ప్రయాణికులు మూడు గంటల ముందుగా ఎయిర్‌పోర్ట్‌కు రావాలని మాత్రమే అధికారులు సూచించారు. ఇలా యుద్ధంలో పాకిస్థాన్ పలాయనం చిత్తగిస్తూ తమ దేశంలో మాత్రం ఫేక్ వీడియోలను వైరల్ చేసుకుంటున్నది. పాకిస్థాన్ ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేసుకుంటున్నప్పటికీ సోషల్‌మీడియా యుగంలో ప్రపంచం నిజాలు తెలుసుకుంటున్నది. పాకిస్థాన్ నవ్వుల పాలవుతున్నది.