‘పహల్గాంలో 26 మంది పర్యాటకులను మతం పేరిట హతమార్చింది మేమే’నని ప్రకటించిన లష్కరే తోయిబా విషపుత్రిక ‘టీఆర్ఎఫ్’ను, వారి రాక్షసత్వాన్ని భారతీయులు ముక్తకంఠంతో ఖండించారు. ఉగ్రవాదులను పెంచి పోషించిన పాకిస్థాన్‌ను తిట్టి, శాపనార్థాలు పెట్టారు. ఉగ్రమూకలను పట్టి హతమార్చటానికి, పాక్‌ను కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం ఏ చర్యలు చేపిట్టినా మేం సహకరిస్తామని ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రధాని మోదీకి మద్దతు ప్రకటించాయి.
కొందరు ముస్లిం బాలబాలికలు కొన్నేండ్లుగా తాము దాచుకున్న కిడ్డీ బ్యాంకు ధనాన్ని, ఉగ్రవాదులను ఖతం చేసేటందుకు ప్రధాని మోదీకి పంపిస్తామని ముందుకురావటం అభినందనీయం. ఈ నేపథ్యంలో భారతీయ ముస్లింలు ముక్తకంఠంతో ఉగ్రదాడిని ఖండిస్తూ, పాక్‌ను నిరసిస్తూ, భారత ప్రభుత్వానికి మద్దతు ప్రకటించటం శుభ పరిణామం.
పర్యాటకులను కాపాడేందుకు ఉగ్రమూకలకు ఎదురునిలిచి తన ప్రాణాలర్పించిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా తండ్రి ముహమ్మద్ ‘పర్యాటకుల కోసం ప్రాణాలర్పించిన నా కుమారుడు నాకు గర్వకారణం’ అన్నారు. పై ఘటనలు సిసలైన భారతీయతకు, కశ్మీరియతకు ప్రతీకలు. అంతేకాదు, కశ్మీరీ ముస్లిం యువకులు గాయపడిన పర్యాటకులను భుజాలపై మోసుకెళ్లి వైద్యం చేయించారు. తమ తమ టాక్సీలలో హాస్పిటల్స్‌కు ఫ్రీగా తీసుకువెళ్లారు, విమానాశ్రయాలకు చేర్పించారు. భయాందోళనలో వణికిపోతున్న పర్యాటకులకు మసీదులలో ఆశ్రయమిచ్చి, సేవలందించిన కశ్మీరీ ముస్లిం మతాచార్యులు తమ తమ గృహాలతో ఆశ్రయమిచ్చి సేదదీర్చారు. పర్యాటకులను ఆత్మీయంగా సాగనంపిన కశ్మీరీ ముస్లిం కుటుంబీకులు, సమస్త భారతీయులకు ఆదర్శనీయులే! అందుకే, పర్యాటకులు, భారతీయులందరి తరఫున వారికి నా కృతజ్ఞతాభివందనాలు. హేట్సాప్ కశ్మీర్ ముస్లిం సహోదరీ సహోదరులారా హేట్సాప్.
పాకిస్థాన్ ఉగ్రవాదులను కశ్మీర్‌పైకి ఎగదోయడానికి ముఖ్య కారణమేమిటో తెలుసుకుందాం. కొందరు రాజకీయ నాయకులు రౌడీలు, గూండాలను పోషిస్తున్నట్టే, పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందన్నది జగమెరిగిన సత్యం. పాక్‌తో పలు ముఠాలుగా పెరుగుతున్న ఉగ్ర బృందాలను వివిధ కంప్యూటర్లతో పోల్చితే, వాటన్నింటికీ సర్వర్ పాక్ ‘ఐఎస్ఐ’ అన్నదీ జగద్విదితమే. ఇటీవల పాక్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ ‘స్కైన్యూస్’తో మాట్లాడుతూ… ‘అమెరికా, పశ్చిమదేశాల కోసం ఉగ్రవాదులను పోషించే చెత్త పనిని నెత్తికెత్తుకున్నామ’ంటూ తమ తప్పును అంగీకరించారు. అలాగే పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్, పాక్ ప్రవాసీ వ్యాపారవేత్తల సభలో మాట్లాడుతూ.. ‘హిందువులు వేరు, ముస్లింలు వేరు’ మనది ముస్లిం జాతి, హిందువులతో మనకు కుదరని పని. ఈ ‘ద్విజాతి సిద్ధాంతం’తోనే అవతరించింది మన పాకిస్థాన్. ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని మీ పిల్లలకూ ప్రబోధించండి! మీరు విస్మరించకండి’ అంటూ పసి హృదయాలలో కూడా మత విద్వేష బీజాలను నాటమని ప్రబోధించాడు. అంతేకాదు, ‘కశ్మీర్ సమస్యనూ మనమెప్పటికీ వదులుకోకూడదు. ఎందుకంటే కశ్మీర్ మన కంఠనాళం’ అని కూడా వక్కాణించాడు. దాన్నంతగా ఎందుకు నొక్కి చెప్పాడంటే.. పాక్ ప్రజల్లో ఆగ్రహజ్వాలలు ప్రజ్వరిల్లినప్పుడల్లా, వాళ్ల దృష్టిని భారత్ వైపు మళ్లించాలి. అందుకు పాక్ పాలకులకున్న ఏకైక సాకు కశ్మీరే! ఎందుకంటే పాకిస్థాన్ ఒక విఫల ప్రజాస్వామ్య దేశం! పాక్ మత పెద్దలు, సైనికాధికారుల చేతి రిమోటే పాక్ ప్రధాని.
భారతదేశంలో అత్యధిక సంపద కొందరు కార్పొరేట్ల వద్ద పోగుపడినట్టే పాకిస్థాన్‌లోని అత్యధిక సంపద కొందరు మత పెద్దలు, సైనికాధికారుల వద్ద పోగుపడింది. దాన్ని కాపాడుకోవడానికి, మరింత పెంచుకోవడానికి వాళ్లు చేస్తున్న స్వార్థ రాజకీయాల కారణంగా పాకిస్థాన్ నేడు రాజకీయ, ఆర్థిక సంక్షోభాలలో కొట్టుమిట్టాడుతున్నది. ఆకలితో, ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నది. ఐనా సరే పాక్ ప్రజలు తిరగపడకుండా ‘ధనబలం + సైనిక బలం + మతోన్మాదం’తో ముప్పేట బిగింపులతో అణచివేస్తున్నారు. వాళ్ల దోపిడీని, అణచివేతనూ సహించలేకనే నాడు పాక్ నుంచి ‘బంగ్లాదేశ్’ విడిపోయింది. నేడు బలూచిస్థాన్ అందుకు సిద్ధంగా ఉన్నది. ఈ విషమ పరిస్థితుల్లో పాక్ ప్రజల ఆగ్రహాన్ని భారత్ వైపు మళ్లించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అలా ‘పాక్ పాలకుల డైవర్షన్ పాలిటిక్స్’లో భాగమే ‘పహల్గాం’ హత్యాకాండ అన్నది వాస్తవం.
పర్యాటకులను ఇలా మతం పేరిట హత్య చేయించుట ద్వారా పాక్ పాలకులు సాధించ దలచుకున్న లక్ష్యాలివే..
1.పాక్ ప్రజల ఆగ్రహావేశాలను తమ మీది నుంచి భారత్ వైపు మళ్లించటం. 2.హిందువులనే హత్య చేయించటం ద్వారా భారతీయ హిందువుల్లో కశ్మీరీ ముస్లింల పట్ల విద్వేషాన్ని రగిలించటం. తత్కారణంగా ముస్లిం దేశమైన పాక్‌తో కలిసి ఉండటమే శ్రేయస్కరం అన్న భావనను కశ్మీరీ ముస్లింలలో రేకెత్తించటం. 3. పర్యాటకులను హతమార్చటం ద్వారా కశ్మీర్ రావటానికే భయాన్ని రేకెత్తించటం, పర్యాటకరంగమే జీవనాధారంగా ఉన్న కశ్మీర్ ముస్లింల ఉపాధికి గండికొట్టి, వాళ్లను భారత్‌పై తిరగబడేలా చేయటం. 4. ఈ మతపర హత్యాకాండల ద్వారా భారత్‌లోని మత విద్వేషాలకు ఆజ్యం పోసి భారత జాతీయ సమైక్యతకు గండి కొట్టడం ద్వారా, భారత్‌ను బలహీన పరచటం. 5.అమెరికా ఉపాధ్యక్షుడు భారత్‌లో పర్యటిస్తున్నప్పుడే, భారత్‌పై తెగబడటం ద్వారా అంతర్జాతీయంగా తమ శక్తి సామర్థ్యాలను చాటుకోడటం-మేమేం చేసినా అమెరికా మా జోలికి రాదు, ఎందుకంటే, దానికి మాతో అవసరం ఉంది గనుక! అన్న సంకేతాన్ని భారత పాలకులకు అందజేయటం, ఇవీ, పాక్ పాలకుల లక్ష్యాలు!
పాక్ ఆర్మీ చీఫ్ ‘కశ్మీర్ సమస్యను మేం ఎప్పటికీ వదులుకోమని ప్రకటించిన వారంలోపే జరిగింది పహల్గాంలో ఉగ్రదాడి. కాబట్టి ఇది యాదృచ్ఛికం కాదు, పాక్ పాలకులు ముమ్మాటికీ ప్రణాళికాబద్ధంగా చేయించిన హత్యాకాండనే.
– పాతూరి వేంకటేశ్వర్రావు 98490 81889