‘విదేశాలకు వెళ్లి వీళ్లు టాయిలెట్లు కడిగి సంపాదిస్తారు. ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ పోజులు కొడతారు’ విదేశాల్లో ఐటీ కంపెనీల్లో పనిచేస్తూ మన దేశానికి విదేశీ మారకద్రవ్యం పంపిస్తున్న యువతను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇవి. క్రూడ్ ఆయిల్ ధర రెట్టింపై ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న తరుణంలో మన దేశాన్ని కాపాడుతున్నది ఆ యువత పంపే నిధులే. వారు పంపే నిధులే లేకపోయి ఉంటే అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంతో క్రూడ్ ఆయిల్ ధరలు రెట్టింపు అయినప్పుడు మన దేశం మిగిలిన దేశాల కన్నా ఎక్కువ గడ్డు పరిస్థితి ఎదుర్కొని ఉండేది. క్రూడ్ ఆయిల్‌కు మనం చెల్లించే విదేశీ మారకద్రవ్యం కంటే విదేశాల నుంచి మనవాళ్లు పంపే కరెన్సీ విలువ చాలా ఎక్కువ.
బీఆర్ఎస్ పాలనలో ఐటీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ తెలంగాణ ఐటీ రంగంలో గణనీయమైన ప్రభావం చూపించారు. రాష్ర్టానికి ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలను తీసుకువచ్చారు. ఆయనకు విషయ పరిజ్ఞానం ఉన్నది. విద్యావంతుల, ఐటీ జనరేషన్ అభిమానాన్ని ఎంతో సంపాదించారు. వివిధ భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. అదే సమయంలో ముఖ్యమంత్రికి ప్రత్యర్థులను బూతులు తిట్టడంలో నైపుణ్యం తప్ప ఇంగ్లిష్, తెలుగు భాషల్లో నైపుణ్యం లేనే లేదు. విషయ పరిజ్ఞానం అసలే లేదు. దాంతో ఎదుటివారిని చిన్నచూపు చూడాలనే ఉద్దేశంతో ఇంగ్లిష్‌లో మాట్లాడుతారు. విదేశాల్లో టాయిలెట్లు కడిగి సంపాదిస్తారని నోటికి వచ్చినట్టు మాట్లాడటం ద్వారా ఎదుటివారి ప్రతిభను తగ్గించామని ఆయన అనుకుంటారు. కానీ అలాంటి మాటల ద్వారా తనను తానే మరింత చులకన, తక్కువ చేసుకుంటున్నారు.
అమెరికా-ఇరాన్ యుద్ధం తరువాత క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి ప్రపంచంలో అనేక దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. యుద్ధం ఒకటి రెండు వారాల్లో ఆగిపోతుందని అంతా అనుకున్నారు. అయితే, ఆగే సూచనలు ఏకోశానా కనిపించటం లేదు. హైదరాబాద్‌లో ఇటీవల బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాన మంత్రి మోదీ పొదుపు సూత్రాలు ప్రజలకు సూచించారు. పెట్రోల్, డీజిల్ పొదుపుగా వాడాలని, ఏడాది పాటు బంగారం కొనవద్దని సూచించారు. అయితే, మన విదేశీ మారకద్రవ్యాన్ని మింగేసే వాటిలో ఈ రెండే ప్రధానమైనవి.
వైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్పర్సన్, కాంగ్రెస్ మహిళా నాయకురాలు ‘బంగారం కొనవద్దని చెప్పడానికి నువ్వెవరు’ అంటూ ప్రధాని మీద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారికి మార్గదర్శకం చేసే నాయకునికే విదేశీ మారకద్రవ్యం గురించి అవగాహన లేదు. టాయిలెట్లు కడిగేవారంటూ దేశాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్న వారిని చిన్నచూపు చూస్తే..బూతులతోనే రాజకీయంగా ఎదగవచ్చునని నమ్మేవాళ్లు అంతకన్నా ఏంమాట్లాడుతారు?
యుద్ధానికి ముందు క్రూడ్ ఆయిల్ 60 డాలర్లకు బ్యారెల్ ఉంటే..యుద్ధం మొదలయ్యాక ఇప్పుడు 100 నుంచి 115 డాలర్ల మధ్య ఊగిసలాడుతున్నది. అంటే దాదాపు రెట్టింపు ధర అయింది. ఇదే ధర, ఇవే పరిస్థితులు ఇంకొన్నాళ్లు కొనసాగితే మన దేశం కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. మన దేశం దాదాపు 88 శాతం క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నది. 2026 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలోనే క్రూడ్ ఆయిల్ దిగుమతి బిల్లు 134.7 బిలియన్ డా లర్లు. బంగారం దిగుమతి విలువ 72 బిలియన్ డాలర్లు. ఈ రెండింటికే 216 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం వ్యయం అవుతున్నది.
ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం ద్వారా వారు పంపే నిధులను చూస్తే ప్రపంచంలో అతి పెద్ద రెమిటెన్స్ గ్రహీత మన దేశమే. 2024లో 118.7 బిలియన్ డాలర్లు 2025లో 135.4 బిలియన్ డాలర్లు పంపారు. మన జీడీపీలో ఇది 3.5 శాతం. ఈ నిధుల్లో అమెరికా నుంచి 27 శాతం (వైట్ కాలర్ ఉద్యోగాలు), యూఏఈ నుంచి 19 శాతం వస్తుంటే..కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో పాటు అనేక దేశాల నుంచి మిగిలిన నిధులు వస్తున్నాయి. 2026లో మన క్రూడ్ ఆయిల్ దిగుమతి బిల్లు 134.7 బిలియన్ డాలర్లు. అయితే మన ఉద్యోగులు విదేశాల నుంచి 2025లో పంపిన నిధులు 135.4 బిలియన్ డాలర్లు. అంటే మన క్రూడ్ ఆయిల్ బిల్లు ఎంతో.. విదేశాల్లో పనిచేస్తూ మన దేశానికి తమ శ్రమను డాలర్ల రూపంలో పంపుతున్న నిధులు కూడా దాదాపు అంతే మొత్తం.
మనవాళ్లు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ 135 బిలియన్ డాలర్లు పంపుతున్నారంటే మన కరెన్సీలో చెప్పాలంటే రూ.13 లక్షల కోట్లు. ఇదంతా తమ కుటుంబానికి, బంధువులకు, స్నేహితులకు, పుట్టిన ప్రాంతానికి దూరంగా బతుకుతూ వారు పంపుతున్న నిధుల విలువ. కానీ మన రాష్ట్ర పాలకులు వారికి ఇస్తున్న విలువ విదేశాల్లో టాయిలెట్లు కడుగుతూ సంపాదిస్తారనే చీదరింపు వ్యాఖ్యానం. దేశం సంక్షోభంలో ఉన్నా పాలకుల విలాసాలకు లోటేమీ లేదు. వారి వాహనాల సంఖ్యకు లోటు లేదు. విదేశీ ఆక్రమణదారుల నుంచి దేశాన్ని రక్షించే సైనికులు ఎలాంటివారో తమ కష్టాన్ని డాలర్లలో సొంత దేశానికి పంపే ఈ ఉద్యోగులు అంతటి గౌరవానికి అర్హత ఉన్నవాళ్లు. అయితే బూతులను, అక్రమాలను నమ్ముకొని ఎదిగిన వారికి ఇలాంటి వారి విలువ తెలియదు .
ఒకవైపు బంగారం, క్రూడ్ ఆయిల్ బిల్లులు దేశాన్ని కుంగదీస్తుంటే..మరో వైపు పులిమీద పుట్రలా స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నిధులు వెనక్కి తీసుకోవటం దేశానికి భారంగా పరిణమించింది. 2025లో స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1.58 లక్షల కోట్లు ఉపసంహరించుకుంటే, 2026లో ఒక్క జనవరిలోనే రూ.35,962 కోట్ల్లు ఉపసంహరించుకున్నారు. వీటన్నిటి వల్ల రూపాయి బలహీనపడుతున్నది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ దేశానికి ఆశాకిరణాలుగా నిలుస్తున్నారు విదేశాల్లో పనిచేస్తున్న మన భారతీయ ఉద్యోగులే. వారు పంపే నిధులే మన దేశానికి శ్రీరామరక్ష.
తాజా అంచనాల ప్రకారం మన దేశానికి 2026లో 140 బిలియన్ డాలర్ల వరకు రెమిటెన్స్ రావచ్చునని అంచనా. స్థానికంగా తమకు మంచి అవకాశాలు లేక విదేశాలకు వెళ్లి మాతృదేశాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్న వారిని గౌరవించే సంస్కారం పాలకులకు ఉండాలి. మంది సొమ్ము మీద బతకటం తప్పు..కానీ టాయిలెట్లు కడిగి సంపాదించటం తప్పు కాదు.