రాజకీయ నాయకులు మాట్లాడే తీరే వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అనాలోచితంగా మాట్లాడేవారికి ప్రజల్లో కనీస గౌరవం దక్కదు. అనుభవం, పరిపక్వత, వ్యూహాత్మకంగా ఆలోచించడం, పాలించే సామర్థ్యం, ఉన్నది ఉన్నట్టుగా, లేని లోటు పాట్లను ఒప్పుకోవడం లాంటి లక్షణాలున్న నాయకులే నిజమైన నాయకులు. అలాంటి నాయకులనే ప్రజలు కోరుకుంటారు.
రాజకీయ పార్టీలు ఇటీవల చేసే భాషణల్లో విపరీత ధోరణి పెచ్చుమీరుతున్నట్టుగా అనిపిస్తున్నది. బీజేపీలో సీనియర్ నాయకుడు, దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల హైదరాబాద్ సభలో ‘తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఒక్క కేసీఆర్ కుటుంబమే అభివృద్ధి చెందింద’ నడం ఆయన స్థాయికి తగిన మాటలు కావు. ఏ రంగం అభివృద్ధికి నోచుకోలేదో చెప్పి, వాటిని అధిగమిస్తామని చెప్పవచ్చు. కానీ ఒక కుటుంబం మీద ఆరోపణ చేయడం సమ్మతమైంది కాదు.
బీజేపీ నాయకురాలు డీకే అరుణ ‘ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు ముక్కునేలకు రాసి ప్రజలను క్షమాపణ అడగాలి’ అంటూ ఆరోపించారు. చిన్నప్పుడు ఏదైనా తప్పుచేస్తే ముక్కు నేలకు రాయడమన్నది ఒక శిక్షగా ఉండేది. హామీలు నెరవేర్చక పోవడమనేది తప్పుకాదు. నేరం అంతకంటే కాదు. ఆమరణ నిరాహార దీక్ష చేసి, రాష్ర్టాన్ని సాధించిన ఒక వ్యక్తికి సహజంగానే మన రాష్ర్టాన్ని దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న బలమైన కోరిక ఉంటుంది.
అలా ఇచ్చిన హామీల్లో 90 శాతం పూర్తి చేసి, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత ఒక్క సీఎం కేసీఆర్‌కే దక్కింది. హామీ నెరవేర్చకుంటే ముక్కు నేలకు రాయడమే శిక్ష అనుకుం టే, ముందుగా ప్రధాని ఆ పని చేయాలి. ప్రధానిగా ప్రమాణ స్వీకారం కాగానే, దేశంలోని నల్ల ధనాన్ని వెలికితీసి, ప్రజలందరికీ ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్నా రు. ఎంతమంది ఖాతాలో వేశారో తెలియదు. నిజంగానే వేసి ఉంటారేమో? లేకుంటే ఆవిడ అంత ధైర్యంగా అలా అంటారా?
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజ న్ జ్యోతి.. కేసీఆర్ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు’ అంటూ ఆరోపించారు. ఈ ప్రభుత్వం సంక్షేమాన్నే విస్మరిస్తే నీతిఆయోగ్ ప్రకారం ఐదేండ్లలోనే తెలంగాణలో పేదరికం 7.3 శాతం నిటారుగా క్షీణించినట్టు పేర్కొన్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణం 12 శాతం పెరిగిందని కూడా తెలిపింది. మరి ఈ గణాంకాల సంగతేందన్నట్టు?
తెలంగాణ ఎన్నికల ఇన్చార్జీ జావదేకర్ లాంటి సీనియర్ నాయకుడు ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సభలో ‘కేసీఆర్ గత పదేండ్లలో రాష్ర్టాన్ని సర్వనాశనం చేశారు’ అంటూ ఆవేశంగా మాట్లాడారు. ఒక జాతీయ నాయకుడు ఇలా మాట్లాడవచ్చా? నిజంగానే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం నాశనమైందా? అభివృద్ధి చెందిందా? వీరికి కూడా తెలియదా? రాష్ట్రం సాధించిన ప్రగతికే కదా జాతీయ అవార్డులు దక్కుతున్నది. ఆ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడితే ప్రజలు నమ్ముతారా?
జాతీయ నాయకులకు మన రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి గురించి అంతగా తెలియకపోవచ్చు. కానీ స్థానిక నాయకులు నిజమేదో, అబద్ధమేదో వివరించాలి కదా? వేలాదిమంది పాల్గొనే సభలో రాష్ట్రం స్థితిగతులేంటివన్న విశ్లేషణ చేయకుండానే మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకోలేరా?
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకనే కదా దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండించింది. గతంలో బీడు బారిన పొలాలు, ఏండ్లకేండ్లు నీటి వనరులు లేక పడావు బెట్టిన పొలాలే , పచ్చ గా ఏపుగా సమృద్దిగా ఏటా 2, 3 పంటలు పండిస్తూ రైతన్నల కండ్లల్లో కాంతులు మెరవడం సర్వనాశనం చేసినట్టా? మండుటెండల్లో కూడా చెరువులు మత్తళ్లు దుంకటం, వానకాలం రాకముందే రైతులు దుక్కిళ్ళు దున్నడం సర్వనాశనం అయినట్టా? రైతులు చనిపోతే వారికి బీమా ఇచ్చి కుటుంబాన్ని కాపాడడం సర్వనాశనం చేసినట్టా?
కేంద్ర వాటర్ కమిషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం గత పదేండ్ల సగటు నీటి నిల్వల్లో తెలంగాణ 64.3 శాతంతో మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో గుజరాత్ 14.6 శాతంతో ఉండడం రాష్ర్టాన్ని సర్వనాశనం చేసినట్టా? విజ్ఞత గల వ్యక్తులు ఆలోచించాలి.
నిజానికి బీజేపీకి తెలంగాణలో అసలు క్యాడరే లేదు. ఓ ఇద్దరు, ముగ్గురు చోటా, మోటా నాయకులున్నారేమో గాని, గట్టిగా, గంప గుత్తగా తప్పనిసరిగా బీజేపీకే ఓటు వేసేవాళ్ళు బహు కొద్దిమంది ఉండవచ్చు. అట్లాంటి క్యాడరే లేని పార్టీ ఈసారి మా ప్రభుత్వమే రాజ్యమేలుతుందంటే నమ్మశక్యమా?
మన ప్రధాని తన ప్రసంగంలో ‘గతంలో ఒక గుజరాతి వచ్చి మీకు స్వాతంత్య్రం ఇచ్చారు. ఇప్పుడు ఈ గుజరాతి వచ్చి వికాసాన్ని కల్పిస్తాడు’ అన్న మాటలు, గల్లీల్లో ఉన్న, చిల్లర మల్లర నాయకులకే తగును. ఒక ప్రధాని నోటి నుంచి ఇట్లాంటి విభజన చేసే మాటలు ఈ దేశ ప్రజలు ఎన్నడూ ఊహించలేదు. దేశ ప్రధానే ప్రజలను విడగొట్టే మాటలు మాట్లాడితే మన దేశం పరువే పోయినట్టు అనిపిస్తున్నది.
బీజేపీ నాయకులు తమ పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్ట పరుచుకుని, అన్ని స్థానాల్లో పోటీచేసే నాయకుల ను తయారు చేసుకొ ని, వారివారి సామర్థ్యాలను, పరిపక్వతను పెంచుకుని ఈ రాష్ర్టా న్ని ఏలుదామన్న కల లు కంటే బాగుంటుందేమో? బీజేపీ నాయకులు ఆలోచించుకోవా లి. లేదంటే మొదటికే మోసం వస్తుంది.
-డాక్టర్ మాచెర్ల వాణీ మనోహర్
9989620452