వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఇటీవల ప్రభుత్వాధికారులకు, గిరిజన రైతులకు మధ్య జరిగిన అవాంఛనీయ ఘటనపై పౌర సమాజం పక్షాన కొన్ని విషయాలను ప్రభుత్వం ముందు పెట్టదలుచుకున్నాం. లగచర్లలో ఫార్మా విలేజ్ నిమిత్తం భూసేకరణ కోసం తలపెట్టిన గ్రామసభలో చెలరేగిన ఘర్షణ ఆందోళన కలిగిస్తున్నది. ఇలాంటి ఘటనలు సమస్యను మరింత జటిలం చేస్తాయని, పరిష్కారానికి దోహదపడవని భావిస్తున్నాం. అయితే, చట్టపరిధిలో సజావుగా జరగాల్సిన ప్రక్రియ, అలా జరగకుండా ఎందుకు ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చిందో నిష్పాక్షికంగా పరిశీలించాలి.
సంఘటన వెనుక ఉన్న నేపథ్యాన్ని, గిరిజన రైతుల ఆవేదననూ సమగ్రంగా పరిశీలించాలి. గ్రామస్థులు ఎందుకంత తీవ్రంగా ప్రతిస్పందించవలసి వచ్చిందో కారణాలు తెలుసుకోవాలి. పూర్వాపరాలను పరిశీలించకుండా, సంఘటనను మాత్రమే చూసినప్పుడు సరైన నిర్ణయానికి రాలేం, సమస్యను పరిష్కరించలేం. ఈ సంఘటనకు గత ఆరు నెలల నేపథ్యం ఉన్నది. ఫార్మా విలేజ్ కోసం ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణ ప్రయత్నాలను లగచర్ల వాసులు మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నారు. వాళ్లు ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వలేమని, బలవంతపు భూ సేకరణ జరగకుండా నిరోధించి తమ భూముల ను పరిరక్షించాలని ప్రభుత్వానికి, వివిధ రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు విజ్ఞప్తులు చేశారు. వారికి ప్రభుత్వం వైపు నుంచి న్యాయమైన స్పందన కరువైంది. కొంతమంది నాయకులు, అధికారులు, వ్యక్తులు అదేపనిగా రైతులను వేధించడం వల్ల వారిపట్ల గ్రామస్థుల్లో తీవ్ర ఆగ్రహం చోటుచేసుకున్నది. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా అధికారులు అంతకంతకూ ఒత్తిడి పెంచుతూపోయిన నేపథ్యంలో ఏర్పడిన నిస్సహాయ స్థితిలోంచి ప్రజాగ్రహం పెల్లుబుకింది. ఆగ్రహ ప్రకటన అదుపు తప్పి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో ఘర్షణ వాతావారణం నెలకొన్నది. ప్రజాస్వామ్యంలో ఈ రకమైన దాడులు సమస్యలకు పరిష్కారం చూపవు. అంతేకాకుండా సమస్యను పక్కదారి పట్టించడానికి కారణమవుతాయి. గ్రామంలోని 80 శాతం జనాభా ఆమోదించకుండా భూ సేకరణ చేయకూడదని 2013 భూ సేకరణ చట్టం నిర్దేశిస్తున్నది. రైతులను, గ్రామస్థులను విశ్వాసంలోకి తీసుకొని భూ సేకరణకు పూనుకొని ఉంటే ఇలాంటి అవాంఛనీయ ఘటన తలెత్తేది కాదని మేం భావిస్తున్నాం.
నవంబర్ 11వ తేదీన జరిగిన అవాంఛనీయ ఘటనపై విచారణ జరిపించాలి. అయితే అది కూడా చట్టసమ్మతంగానే జరగాలి తప్ప, ప్రతీకార దృష్టితో కాదని తెలియజేస్తున్నాం. అర్ధరాత్రి వందల మంది పోలీసులు లగచర్ల గ్రామాన్ని చుట్టుముట్టి 66 మందిని అరెస్టు చేశారు. 37 మందిని జైలుకు పంపించారు.
అరెస్టు చేసినవారిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితులు ఆరోపిస్తున్నారు. వారు సరిగా నడవలేకపోతున్న వీడియోలు చూస్తే, ఆ ఆరోపణలకు బలం చేకూరుతున్నది. లగచర్ల ఘటనపై, గ్రామస్థుల ఆందోళన, ఆరోపణలపై వెంటనే జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యం గా భయకంపితులైన రైతులకు, గ్రామస్థులకు సాంత్వన చేకూర్చే చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. ఇరుపక్షాలకూ ఆమోదయోగ్యమైన వ్యక్తులతో కమిటీ వేసి గ్రామస్థులతో సంప్రదింపులు జరపాలని, శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకు భిన్నంగా సంఘటనను అడ్డం పెట్టుకొని గిరిజన రైతుల మీద, ఉద్యమ నాయకుల మీద అణచివేతకు పూనుకుంటే సమస్య మరింత జటిలంగా మారుతుంది తప్ప పరిష్కారం కాదని తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ప్రజాస్వామిక వైఖరితో వ్యవహరించాలని కోరుతున్నాం.
కె.శ్రీనివాస్, సంగిశెట్టి శ్రీనివాస్, టంకశాల అశోక్, కట్టా శేఖర్‌రెడ్డి, డి.పాపారావు, దంటు కనకదుర్గ, కె.సీతారామారావు, గోరటి వెంకన్న, శ్రీధర్‌రావు దేశ్‌పాండే, హమీద్ మహ్మద్ ఖాన్, శ్రీశైల్‌రెడ్డి పంజుగుల, బద్రి నర్సన్, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, వఝల శివకుమార్, ఎర్రోజు శ్రీనివాస్, అజయ్‌కుమార్ వారాల, సజయ కాకర్ల, సంధ్య పీవోడబ్ల్యూ, పాశం రఘునందన్ రెడ్డి, వి.ప్రకాశ్, దేవీప్రసాద్‌రావు, జూలూరు గౌరీశంకర్, కాంచనపల్లి, గోవర్ధన రాజు, మంగళంపల్లి విశ్వేశ్వర్, పిట్టల రవీందర్, అస్కాని మారుతీసాగర్, పెద్దింటి అశోక్ కుమార్, మల్లావఝల, విజయానంద్, స్వర్ణ కిలారి, సుబ్బయ్య వనపట్ల, తైదల అంజయ్య, కె.రంగాచారి, దీప్తి సరళ, డాక్టర్ ఎ.రఘుకుమార్, బి.భుజంగరావు, ఎం.ఎ.హమీద్, ఎల్.శ్రీనివాస్ రెడ్డి