ఎలాంటి సూచనలు లేదా హెచ్చరికలు లేకుండా మేఘాలు గర్జించి, విస్ఫోటమై పేలిపోతూ మేఘ విస్ఫోటాలు లేదా క్లౌడ్ బరస్ట్ రూపంలో ప్రళయం సృష్టించడం ఉత్తర భారత పర్వతశ్రేణుల్లో సర్వసాధారణం అయ్యింది. తాజాగా నేపాల్‌లో సంభవించిన జలప్రళయంలో దాదాపు 359 మంది మరణించినట్టు తెలుస్తున్నది. ఈ ఆకస్మిక వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతైనట్టు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రకృతి విలయం కారణంగా నేపాల్, టిబెట్‌లో 1,600 మందికి పైగా గల్లంతైనట్టు తెలుస్తున్నది. వీరిలో 500 మంది విదేశీయులు ఉన్నారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది.
కాశ్మీర్ లోయలోని కిశ్త్నాడ్ ప్రాంతంలో ఇటీవల సంభవించిన క్లౌడ్ బరస్ట్ విపత్తులో కనీసం 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 500 మందికి పైగా అమాయకుల ఆచూకీ లభించకపోవడం, వేలాదిమంది గాయపడ్డారు. లోయలో కొండ చరియలు విరిగిపడి నివాసగృహాలు పేకమేడల్లా కూలిపోవడం, ఆకస్మిక ప్రమాదకర వరదల్లో సర్వం కోల్పోవడం చూసి చలించి పోయాం. 2013లో ఉత్తరాఖండ్ పర్వత లోయల్లో సంభవించిన మేఘ విస్ఫోటనంలో కనీసం 6,000 మంది సామాన్యులు మరణించడం ఒక అతి భయంకర చీకటి అధ్యాయంగా నమోదైంది. ఆకస్మికంగా, వాయువేగంగా, అతి కొద్ది సమయంలో (గంట లోపు), వాతావరణ శాఖ ముందస్తు అంచనాలకు దొరక్కుండా, కొద్ది ప్రాంతంలోనే ఉరుములు, మెరుపుల గర్జనల నడుమ భయంకర కుండపోతతో తీవ్ర వరదలతో కొండచరియలు విరిగిపడడం, ఊర్లన్నీ ఊడ్చిపెట్టుకుపోవడం, అపార ఆస్తి, ప్రాణనష్టాలు నమోదు కావడం ఒక సహజ ప్రకృతి ప్రకోపంగా మేఘ విస్ఫోటనాన్ని వర్ణిస్తున్నారు.
అతి కొద్ది ప్రదేశంలో అపారమైన కుండపోత వర్షం ఆకస్మికంగా, ప్రమాదకర స్థాయిలో కురువడాన్ని మేఘ విస్ఫోటంగా అర్థం చేసుకోవాలి. కేవలం ఒక గంట లోపు 10 సె.మీ కుండపోత వర్షం 30 ఘనపు కి.మీ వైశాల్యంలో మాత్రమే కురువడాన్ని క్లౌడ్ బరస్ట్ ప్రక్రియగా వాతావరణ శాఖ నిర్వచిస్తున్నది. గాలి స్వల్పంగా వేడెక్కడం, గాలిలో తేమ పెరిగి ఆకాశం వైపు ప్రయాణించి, మేఘాలు అవక్షేపం చెంది కుండపోత వర్షానికి కారణం అవుతున్నట్లు తేల్చారు. మేఘ విస్ఫోటనం ఆకస్మికంగా, హింసాత్మకంగా మార్చడం సర్వసాధారణం.
మేఘ విస్ఫోటాలను వాతావరణ శాఖ ముందస్తుగా గుర్తించడానికి అవకాశం లేనందున ప్రాణ, ఆస్తినష్టాలు అధికంగా నమోదవుతున్నాయి. ఆకస్మికంగా అతి పెద్ద స్థాయిలో వర్షం కురువడంతో ఆ తీవ్రమైన వరదలకు కొండచరియలు కూడా విరిగి పడడం వల్ల అపార నష్టాలను చవిచూడాల్సి వస్తున్నది. అతి ఎత్తైన పర్వతాలకు వీస్తున్న గాలి తాకడంతో ఆ శీతల గాలి పైకి ప్రయాణించి, అవక్షేపం ఏర్పడి కుండపోత వానలకు కారణం అవుతున్నది. ఎత్తైన పర్వతాలు మేఘాలకు అడ్డుపడి, అవి కదులకుండా బంధించడంతో కుండపోత అవకాశాలు పెరుగుతున్నాయి. వేడి, తేమ కలిగిన గాలి పైకి ప్రయాణించడం, చల్లబడడం, అవక్షేపం అయిన వెంటనే వేగంగా కుండపోత కురువడాన్ని క్లౌడ్ బరస్ట్ అని స్పష్టమవుతున్నది.
ఎత్తైన పర్వత శ్రేణులు మేఘ విస్ఫోటాలకు అనువైన ప్రదేశాలుగా మారుతున్నాయి. వాతావరణ సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగినపుడు, గాలి 7 శాతం అధికంగా తేమను కలిగి ఉండడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం పెరుగుతుంది. పర్వత ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో అస్తవ్యస్త పట్టణీకరణ, అడవులను విచక్షణారహితంగా నరికివేయడం, చిత్తడి నేలలు తగ్గిపోవడం, భూమిలో నీరు ఇంకిపోవడం లాంటి కారణాలు క్లౌడ్ బరస్ట్‌లకు ఊతమిస్తున్నాయి. వేడెక్కిన సముద్ర జలాలు అధిక తేమను విడుదల చేయడం, స్థానిక వాతావరణ పీడనాలు తగ్గడం, అస్థిర వాతావరణం, అధికంగా మంచుకొండలు కరుగడంతో మేఘ విస్ఫోటాలకు అవకాశం పెరుగుతున్నది. పలు కారణాలతో వాతావరణ ఉష్ణోగ్రతలు పెరుగడం వల్ల అనేక అనర్థాలు, అందులో మేఘ విస్ఫోటాలు లాంటివి తరచుగా జరుగడం చూస్తున్నాం.
మేఘ విస్ఫోటాలు వేగంగా, ఆకస్మికంగా, అతి కొద్ది సమయంలో, అతి తక్కువ ప్రదేశంలో తీవ్ర కుండపోత రూపంలో సర్వస్వం ఊడ్చి పెట్టుకుపోతుంది. ముందస్తు అంచనాకు దొరుకని కౌడ్ బరస్ట్‌లకు వాతావరణ ప్రతికూల మార్పులు, భూతాపం, గాలిలో తేమ పెరుగడం, పర్వతాలు మేఘాల కదలికలను అడ్డుకోవడం, పీడనాలు తగ్గడం లాంటివి ఇలాంటి విధ్వంసకర విపత్తులకు కారణం అవుతున్నాయని గమనించాలి. తద్వారా వాతావరణ మార్పులను నియంత్రించడానికి ఆలోచనాత్మక నిర్ణయాలను అమలుపరచాలి. అపార ప్రాణనష్టాల నివారణకు ముందడుగు వేయాలి.
– డాక్టర్ బీ మధుసూదన్‌రెడ్డి 9949700037