Arbitration | దేశ న్యాయవితరణ విషయంలో ప్రజలకు కొన్ని ప్రగాఢమైన అభిప్రాయాలు, నమ్మకాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి న్యాయం తొందరగా దొరకదు, దొరకనివ్వరు, దొరకటం లేదు, దొరికినా అది అత్యంత వెలగలది. ప్రాణాలు పోతుంటాయి.. తరాలు గడుస్తుంటాయి.. కానీ, కోర్టుల్లో దొరికేది వాయిదానే తప్ప న్యాయం కాదన్నది చాలామంది అభిప్రాయం. ఇంకా చెప్పాలంటే మనం చచ్చే వరకు కోర్టుల్లో న్యాయం దొరకదు అన్నది స్పష్టంగా వినిపించే మాట.
ప్రజల్లో ఈ రకమైన అభిప్రాయం ఏర్పడేందుకు కారణాలు లేకపోలేదు. ఇవేవో ఊసుపోకకు అనే మాటలు, అభిప్రాయాలు కావు. ఢిల్లీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, 30 ఏండ్ల నుంచి మూడు రోజుల కిందటి వరకు, మన కోర్టుల్లో జడ్జిమెంట్ల కోసం ఎదురుచూస్తున్న కేసులు అచ్చంగా 4.44 కోట్ల పైచిలుకు ఉన్నాయని జాతీయ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ చెబుతోంది. వీటిలో 85 శాతానికి పైగా కేసులు జిల్లా స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయట. అంతేకాదు, దేశం మొత్తం మీద 6 లక్షల కేసులు 20 నుంచి 30 ఏండ్ల దాకా పెండింగ్‌లో ఉన్నాయి. ఇందుకు కారణాలు అనేకం.
మొత్తం పెండింగ్‌లో ఉన్నవాటిలో 1.08 కోట్ల కేసులు సివిల్ అయితే, 3.36 కోట్లకు పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పెండింగ్ లెక్కలు చూస్తే మనకు ముఖ్యంగా మూడు విషయాలు స్పష్టమవుతాయి. ఒకటి, దేశంలోని కోర్టుల్లో దినదినం కేసులు పెరుగుతున్నాయి లేదా కోర్టుల పనిభారం పెరుగుతోంది. రెండు, 30 ఏండ్ల నుంచి పేరుకుపోయిన కేసులతో పోలిస్తే క్రిమినల్ కేసులు ఒకే సంవత్సరంలో సివిల్ కేసుల సంఖ్యను దాటిపోతున్నాయి.
మూడు, దేశంలోని కోర్టుల మీద రోజురోజుకు క్రిమినల్ కేసుల భారం పెరుగుతున్నది. క్రిమినల్ కేసుల మాట అటుంచి, కోర్టుల మీద కేసుల భారం తగ్గించడానికి మనం కోర్టులకు వెళ్లకుండానే సమస్యను పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా చట్టపరమైన రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, 1996 నాటి ఆర్బిట్రేషన్ కన్సీలియేషన్ చట్టం. ఈ చట్టం 2021లో సవరణలు పొంది సివిల్ వివాదాల పరిష్కారంలో కోర్టుల ప్రమేయం పూర్తిగా తగ్గించింది. రెండోది, గత సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రకటితమైన మధ్యవర్తిత్వ చట్టం, 2023.
ఇద్దరు కక్షిదారులు సుశిక్షితులైన నిపుణుల సమక్షంలో తమ సమస్యను తామే పరిష్కరించుకుని ఒక ఒప్పంద పత్రం రాసుకొని, ఆ మధ్యవర్తి సంతకం తీసుకుంటే అది మధ్యవర్తిత్వం అవుతుంది. ఆ ఒప్పంద పత్రాన్ని కోర్టు డిక్రీగా పరిగణిస్తారని మధ్యవర్తిత్వ చట్టం చెబుతోంది. అలాకాక ఇద్దరు కక్షిదారులు తమ సమస్యను సుశిక్షితులైన నిపుణులకు అప్పజెప్పి తమ తగవు తీర్చమని అడిగితే అది ఆర్బిట్రేషన్ అవుతుంది.
ఆ మధ్యవర్తులు ఇచ్చే అవార్డు కోర్టు డిక్రీతో సమానమని, దానికి కక్షిదారులు కట్టుబడి ఉంటారని, అదే తుది నిర్ణయమని ఆర్బిట్రేషన్ చట్టం, 1996 చెబుతోంది. ఆర్బిట్రేషన్ ప్రక్రియ పూర్తిగా 1996 నాటి చట్టానికి లోబడి జరుగుతుంది. సాధారణంగా కాంట్రాక్టులు, భూవివాదాలు, ఇన్సూరెన్స్ పాలసీలు, చిట్‌ఫండ్ వ్యవహారాలు, ఫైనాన్స్ కంపెనీలు ఇచ్చే అప్పులు, ఇండ్లు, అపార్ట్మెంట్లు, ప్రాజెక్టుల నిర్మాణ సమయాల్లో సంస్థలు, వ్యక్తులు ఒప్పంద పత్రాలు రాసుకుంటారు.
ఇద్దరు వ్యక్తులు లేదా రెండు సంస్థలు లేదా వ్యక్తులు, సంస్థల మధ్య ఒప్పందాలు కుదిరినప్పుడు వారి మధ్య లావాదేవీల విషయాల్లో సమస్యలు, వివాదాలు కూడా తలెత్తవచ్చు. ఈ వివాదాల పరిష్కారం ఒక ఆర్బిట్రేటర్ ద్వారా కాని, మధ్యవర్తి ద్వారా కాని పరిష్కరించుకుందామన్న క్లాజు కూడా ఆ పని ఒప్పంద పత్రంలో, కాంట్రాక్టుల్లో పొందుపరచుకొని ఆర్బిట్రేషన్ ద్వారా తగవులు తెంపుకోవచ్చు.
ఇక్కడ చాలామందికి తెలియని కిటుకు ఒకటి ఉంది. ఇలా తగవు తీర్చుకోవడానికి కాంట్రాక్టుల్లో ముందే ఒక ఆర్బిట్రేషన్ క్లాజు రాసుకోవడం లేదా అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తి తగాదాల విషయంలో వివాదం తలెత్తడం వంటి ఘటనల్లో ఆర్బిట్రేటర్‌ను నియమించుకోవాలని నిర్ణయించుకున్నా కోర్టుల ప్రమేయం అవసరమే లేదు. ఆర్బిట్రేటర్ల నియామకానికి గాని, తీర్పుల కోసం గాని కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. అందులోనూ న్యాయవాదుల జేబులు నింపాల్సిన అవసరం అంతకన్నా లేదు. చట్టంలోని 11(2) సెక్షన్ ప్రకారం తమ ఆర్బిట్రేటర్లను తామే నియమించుకోవచ్చు లేదా సెక్షన్ 6 ప్రకారం మధ్యవర్తిత్వ సంస్థల సహకారంతో ఆర్బిట్రేటర్లను నియమించుకోవచ్చు.
ఆర్బిట్రేటర్ల నియామకాల్లో గాని, పరస్పర ఒప్పందంతో నియమితులైన ఆర్బిట్రేటర్ల తీర్పులో కాని కోర్టుల ప్రమేయం ఉండదు. కానీ, ఒప్పందం రాసుకున్న వ్యక్తుల్లో ఎవరైనా మానసికంగా తటస్థంగా లేకున్నా, భయపెట్టి, బెదిరించి ఒప్పందాలు రాసుకున్నా, ఆర్బిట్రేటర్లతో కక్షిదారుల్లో ఎవరికైనా సంబంధ బాంధవ్యాలు ఉన్నా, లేదా వారి మధ్య వాణిజ్య, వ్యాపారపరమైన లావాదేవీలు ఉన్నా, అడిగినదానికి బదులుగా మరొక అవార్డు ఇచ్చినా, ఆ అవార్డులను సెక్షన్ 34(2) కింద కోర్టులు తోసిపుచ్చవచ్చు. అంతకుమించి ఆర్బిట్రేషన్ అవార్డులను ప్రశ్నించే హక్కులు కోర్టులకు లేవు. కోర్టు బయటే కొట్లాటలకు చెక్ పెట్టడానికి, కోర్టు జడ్జిమెంటుతో సమానమైన నిర్ణయాలు ప్రకటించడానికి, కోర్టుల కన్నా అతిశీఘ్రంగా, సులువుగా, చవకగా వివాదాలు పరిష్కరించుకోవడానికి సెక్షన్ 29(ఏ) ప్రకారం సెక్షన్ 23(4)కి లోబడి 12 నెలల్లో ఆర్బిట్రేషన్ అవార్డు ప్రకటించాల్సి ఉంది.
ఇన్ని అవకాశాలు, సదుపాయాలు ఉన్నా ఆర్బిట్రేషన్ ప్రక్రియ తగినంత ఆదరణకు నోచుకోలేదు. అందుకు కారణాలు ఉన్నా యి. ఈ చట్టంపై కావలసినంత ప్రచారం జరగలేదు. ప్రజలకు ఇలాంటి ఒక సులభమైన మార్గం అందుబాటులో ఉన్నదని తెలియదు. మధ్యవర్తిత్వం/ ఆర్బిట్రేషన్ వల్ల కేసులు త్వరితంగా పరిష్కారమైతే తమ వృత్తికి కాలం చెల్లిపోతుందన్న అభిప్రాయం వకీళ్లలో ప్రబలంగా ఉంది. కానీ, కేసులు త్వరగా పరిష్కారమైతే న్యాయవాదుల వృత్తి వృద్ధిలోకి రావడమే కాదు, వారి పట్ల గౌరవం కూడా పెరుగుతుంది.
ఆర్బిట్రేషన్ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ఆర్బిట్రేషన్ సంస్థలను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకునే వెసులుబాటు ఉన్నా అలాంటి సంస్థలు ఏర్పాటు చేయడానికి వీలు కనిపించాల్సిన భారత ఆర్బిట్రేషన్ కౌన్సిల్ చట్ట సవరణ జరిగి నాలుగు ఏండ్లు అయినా ఇంకా ఏర్పాటు కాలేదు. అవగాహన లోపం వల్ల కొందరు న్యాయవాదులు చట్టంలోని సెక్షన్ 34(2)ను సరిగా ఉపయోగించుకోలేక కోర్టుల సమయాన్ని వృథా చేయడమే కాక, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార సిద్ధాంతాలనే పక్కదారి పట్టిస్తున్న దాఖలాలు ఉన్నాయి. ఆర్బిట్రేషన్ అవార్డులు ప్రకటితమయ్యాక కోర్టులు అనవసరంగా పట్టించుకోకూడదని భారత సర్వోన్నత న్యాయస్థానం చేస్తున్న సూచనలను పెడచెవినపెట్టి సరిగా పట్టించుకున్న నాథుడే లేడు. పైపెచ్చు ఆర్బిట్రేటర్ల నియామకం కేవలం పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులతోనే జరుగుతుందని, ఆర్బిట్రేషన్ ఒక ‘ఓల్డ్ బాయ్స్ క్లబ్’గా మారిందని ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ ఇటీవల వ్యాఖ్యానించారు.
నిర్మాణ రంగంలో ఉన్న అనేకులు వారికి, లబ్ధిదారులకు మధ్య వచ్చే వివాదాలను కోర్టు ప్రమేయం లేకుండా తామే ఆర్బిట్రేర్లను నియమించుకొని పరిష్కరించుకోవచ్చని వారికి ఇంకా తెలియదు. దీని మీద విస్తృత ప్రచారం జరగాల్సి ఉంది. ఆర్బిట్రేషన్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని తమకు, ప్రజలకు మధ్య వచ్చే సమస్యలు పరిష్కరించుకోవచ్చని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, సంస్థలకూ తెలియదు.
ఆర్బిట్రేషన్ అనేది ఇద్దరు కక్షిదారులు పరస్పర సమ్మతితో స్వచ్ఛందంగా చేసుకునే ప్రక్రియ. ఆర్బిట్రేటర్‌ను ఉమ్మడిగా నియమించుకోవడం కాని, ఆర్బిట్రేషన్ సంస్థలను కోరడం కాని జరగాలి. కానీ, ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకొని ఎదుటి పార్టీని ఆర్బిట్రేషన్‌కు లాగడం చట్ట విరుద్ధం. ఈ విషయం అర్థం కాని ఫైనాన్స్ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇలా చేయడం వల్ల తమ అజ్ఞానంతో ప్రాప్తి పొందడమే కాకుండా ఎదుటివారి అజ్ఞానాన్ని కూడా సొమ్ము చేసుకున్నట్టు అవుతుంది. చట్టాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు, కాంట్రాక్టు వ్యవహారాలు, వారసత్వ వివాదాలు కోర్టుల ప్రమేయం లేకుండా సత్వరంగా పరిష్కరించుకోవచ్చు. భారత ఆర్బిట్రేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేసి ప్రైవేటు ఆర్బిట్రేషన్ సంస్థల పరిపాలన ఇతర వ్యవహారాలను పర్యవేక్షించడం ద్వారా సంస్థాగత ఆర్బిట్రేషన్ ఇంకా సులభతరం అవుతుంది.
ఇద్దరు కక్షిదారులు నిపుణుడి సమక్షంలో తమ సమస్యను తామే పరిష్కరించుకుని ఒక ఒప్పంద పత్రం రాసుకొని, ఆ మధ్యవర్తి సంతకం తీసుకుంటే అది మధ్యవర్తిత్వం అవుతుంది. ఆ ఒప్పంద పత్రాన్ని కోర్టు డిక్రీగా పరిగణిస్తారు. అలా కాకుండా ఇద్దరు కక్షిదారులు తమ సమస్యను సుశిక్షితులైన నిపుణులకు అప్పజెప్పి తగవు తీర్చమని అడిగితే అది ఆర్బిట్రేషన్ అవుతుంది.
-జి.జ్యోతిరావు
96768 75789