లోక్సభ 2024 ఎన్నికల ఫలితాలు రాగానే పత్రికల నిండా బీజేపీ బలహీనపడింది అని విశ్లేషణలు వచ్చాయి. ‘గెలిచి ఓడిన మోదీ’ అని పతాక శీర్షికలు కూడా కనబడ్డాయి. బీజేపీ సొంతంగా 240 సీట్లు మాత్రమే గెలవడంతో ఇది మోదీ పాలనకు చెంపపెట్టు అని రాసిన వారున్నారు. ఫలితాలు చూశాక సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయామే అన్న నిరాశ బీజేపీ వర్గాల్లో కనపడగా, 99 స్థానాలతో కాంగ్రెస్, 233 సీట్లతో ఇండియా కూటమి ఏదో సాధించినట్టు సంబురాలు చేసుకున్నాయి. మోదీ జోరుకు కళ్లెం పడినట్టే, ఇక ఆయన నితీష్, చంద్రబాబు దయపైనే ఆధారపడి మూడోసారి ప్రధానిగా కాలం గడపాలని కథనాలు, కార్టూన్లు కూడా వచ్చాయి.
అయితే జూన్ 7 నాడు పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎన్డీయే తరపున గెలిచినవారితో ఏర్పాటైన సభలో మోదీ ప్రసంగమంతా డీలా పడిన సభ్యులకు బూస్టింగ్ లాగా సాగింది. ఆయన గంభీరంగా మాట్లాడుతూ తమ విధానాలను మెచ్చి ప్రజలు తిరిగి ఎన్డీయేకు పట్టం కట్టారని చెప్తూ, గత మూడు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన సీట్లు మొత్తం ఈ ఒక ఎన్నికలో బీజేపీకి వచ్చినన్ని కూడా కావని, సంఖ్యలతో సభికుల ఛాతీని పొంగించారు. దాంతో బీజేపీలో నిరాశ మటుమాయమై గత పదేండ్ల జవసత్వాలు తిరిగి వచ్చినట్టయింది. తమకు సీట్లు ఎందుకు తగ్గాయి, మారాల్సిన అంశాలు ఏమిటి అనే ప్రధాన విషయాలపై చర్చ లేకుండానే ‘ఆల్ ఈజ్ వెల్’ అన్నట్టే ఆ సభ ముగిసింది.
తొమ్మిదో తేదీన మూడోసారి దేశ ప్రధానిగా మోదీ, ఆయన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులకు శాఖల కేటాయింపు వివరాలు విడుదలయ్యాయి. హోం, ఆర్థిక, రక్షణ, విదేశాంగ లాంటి ప్రధాన శాఖలు బీజేపీ సభ్యులకే దక్కడం కాకుండా తిరిగి ఆ శాఖలను గతంలో నిర్వహించినవారికే కట్టబెట్టింది. కొన్ని ప్రాంతాల ప్రజల తిరస్కరణను పరిగణనలోకి తీసుకోకుండా బీజేపీ తిరిగి అదే పాత్రధారులకు అవే పాత్రలను అప్పగించింది. సాధారణంగా ప్రభుత్వంలో ఒక అధికారి సమర్థవంతంగా తన విధులు నిర్వర్తించకపోతే ఆయనను తక్షణం బదిలీ చేస్తారు. పైన పేర్కొన్న ప్రధాన మంత్రిత్వ శాఖల నిర్వాకం వల్లే కొన్ని రాష్ర్టాల్లో ప్రజా వ్యతిరేకత పెల్లుబుకింది. కొత్తగా వ్యవసాయ చట్టాలు సృష్టించి, రైతుల సుదీర్ఘ ఆందోళనకు తట్టుకోలేక వాటిని రద్దుచేసి చెంపలేసుకున్నపుడు ఆ సూచన ఎవరిదీ అనే చర్చ జరగాలి. సైన్యంలో అగ్నిపథ్ నియామక విధానం శుద్ధ తప్పుడు నిర్ణయం. దీని వల్ల పంజాబ్, హర్యానా, రాజస్థాన్లలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. దాన్ని సవరించాలని ఎన్డీయే పక్షానికి చెందిన కొత్త మంత్రి చిరాగ్ పాశ్వాన్ బాహాటంగానే మాట్లాడుతున్నారు.
మణిపూర్లో బీజేపీ ఉన్న ఒక్క సీటును కోల్పోయి కాంగ్రెస్ రెండు స్థానాల్లో ఎందుకు గెలుపొందింది. అక్కడ రాజుకున్న మంటలను గాలికి వదిలేయడమే అందుకు కారణం. మహారాష్ట్రలో పార్టీలను చీల్చి ప్రభుత్వాన్ని కూలగొట్టిన వర్గాలను అక్కడి ఓటర్లు ఎందుకు ఛీ కొట్టారో, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్లకు ఎందుకు జై కొట్టారో ఆలోచించాలి. మరాఠా ప్రజలు ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని దిగిపోమని చెప్పినట్టుగా ఫలితాలున్నాయి. కశ్మీర్ లోయలో ఉపా కేసులో జైల్లో ఉన్న ఇంజినీర్ రషీద్ స్వతంత్ర అభ్యర్థిగా గెలవడం అక్కడి ప్రజల నిరసనకు నిదర్శనం. ప్రజలు వ్యతిరేకించిన ఇలాంటి ఎన్నో నిర్ణయాలకు హోం, ఆర్థిక, రక్షణశాఖల గత మంత్రులు బాధ్యత వహించాలి. ఆయా శాఖలను తిరిగి అదే వ్యక్తులకు కట్టబెడితే ప్రజల ఓటుకు విలువేముంటుంది? గత ఐదేండ్లలో మోదీ, ఆయన మంత్రివర్గం విధానాలు నచ్చనందువల్లనే ఫలితాలు ఇలా వచ్చాయనే స్పృహ ఎన్డీయేకు అవసరం.
2019లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే శక్తినిచ్చిన జనం ఇప్పుడు బీజేపీని సంకీర్ణంలోకి నెట్టేశారు. ఎన్డీయే మాత్రం ఎలాగైతేనేమి ప్రభుత్వం మాదే కదా అని అనుకుంటున్నది. రాబోయే కాలంలో బీజేపీ ఎజెండాలో ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేదని మంత్రివర్గ విస్తరణ స్పష్టం చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు కూడా లోక్సభ ఎన్నికలతో పాటు జరిగినందు వల్ల ఏపీ, ఒడిశాలో గత పాలకపక్షాలు ఘోర ఓటమి పాలు కాగా ఎన్డీయే లాభపడింది. ఇలా వివిధ సమీకరణాల వల్ల ఎన్డీయేకి మూడోసారి అధికారం దక్కింది. ఓటమి అంచుల దాక ఎందుకు వెళ్లామా అనే పునరాలోచన లేకుండా మా దారి రహదారి అనుకుంటే ఎన్డీయే కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు తీవ్ర నష్టం జరుగుతుంది.
కేంద్రం నిర్ణయాలకు వారు తమ రాష్ర్టాల ప్రజలకు జవాబుదారులౌతారు. కాబట్టి మోదీ బలగం తీసుకొనే నిర్ణయాలను నిలదీయవలసిన అవసరం వాటికున్నది. మంత్రివర్గంలో చేరినా తమ ప్రాథమ్యాలను మరువకూడదు. గుడ్డెద్దుల్లా మోదీ వెంట నడిస్తే రాబోయే కాలంలో రెంటికీ చెడే అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఎన్డీయే, ప్రధానంగా మోదీ కోటరీ తీసుకొనే ప్రజా వ్యతిరేక నిర్ణయాల తీవ్రతను బట్టి తాము అడుగులు వేయాల్సి ఉంటుంది. జనం బీజేపీని కాకుండా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను నమ్మి ఓటేశారు. చివరికి అధికారం యావత్తు బీజేపీ చేతుల్లోకి పోయింది. బీజేపీకి పూర్తి స్వేచ్ఛనీయకుండా అంశాల వారీగా మద్దతునిస్తూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, జన సామరస్యతను కాపాడే బాధ్యత ఎన్డీయే మైనస్ బీజేపీ పక్షాలపై ఉన్నది.
– బి. నర్సన్ 9440128169