ప్రజాస్వామ్యానికి ప్రశ్న ప్రాణవాయువు లాంటిది. ప్రజల తరఫున ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించే గురుతర పాత్రను మీడియా పోషిస్తుంది. పాలకులు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారైతే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. సమాధానాలు చెప్పలేనివారు ‘శేషం కోపేన పూరయత్’ అన్నట్టుగా అక్కసు పెంచుకుంటారు. తప్పొప్పులను ప్రతిబింబించే అద్దం లాంటి మీడియా మీద అడ్డగోలుగా దాడులకు తెగబడతారు. ‘నమస్తే తెలంగాణ’ పత్రిక వరంగల్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడిచేయడం ఈ కోవలోనిదే! కల్లబొల్లి కబుర్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు హామీలను, గ్యారెంటీలను, డిక్లరేషన్లను చుట్టచుట్టి చూరులో చెక్కింది. ప్రజాసమస్యలు గాలికిపోయాయి. పరిపాలన పడకేసింది. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టుగా సర్కా రు పెద్దలే కాంట్రాక్టులు, కమీషన్ల కోసం కుమ్ములాడుతున్నారు. వా టాలు తేలక మంత్రులు గల్లాలు పట్టుకుంటున్నారు. ఏకంగా ఓ మం త్రి ఇంటిమీదే పోలీసులు దాడిచేయడం ఈ అరాచకానికి పరాకాష్ఠ.
ఈ దుర్మార్గ పాలనపై ‘నమస్తే తెలంగాణ’ అనుదినం ప్రశ్నలు సంధిస్తున్నది. హామీల అమలుపై నిలదీస్తున్నది. పరిపాలన వైఫల్యాలను ఎండగడుతున్నది. అవినీతి గుట్టు విప్పుతున్నది. కుంభకోణాలను రట్టు చేస్తున్నది. దళిత, బహుజనులపై, విద్యార్థులపై, నిరుద్యోగులపై, గిరిజనులపై సర్కారు, కాంగ్రెస్ పెద్దలు అమానుష దాడులకు తెగబడితే పీడితుల పక్షాన నిలిచి నిలదీస్తున్నది. ఇన్నాళ్లూ నోటీసులతో భయపెట్టాలని చూశారు. వాటితో లాభం లేదనుకొని ఇప్పుడు ప్రత్యక్ష దాడులకు తెగబడుతున్నారు. ఇన్నాళ్లుగా సోషల్ మీడియా యోధులపై కక్షగట్టి పనికిరాని అక్రమ కేసులు పెట్టి వేధిస్తుండటాన్ని మనం చూశాం. అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా అరెస్టులు చేయడం, పోలీసు స్టేషన్లలో గంటలకొద్దీ పడిగాపులు పెట్టడం వంటి ఎమర్జెన్సీ మార్కు ఎత్తుగడలను గమనించాలి. మహిళా జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయడం మరీ ఘోరం. రాజకీయ పోస్టులపై కేసులు పెట్టొద్దని ఇటీవలే సర్కారుపై హైకోర్టు గట్టిగా అక్షింతలు కూడా వేసింది. అయినా బుద్ధిరాని అధికార పార్టీ నేతలు ఫోర్త్ ఎస్టేట్లా నిలిచిన పత్రిక రంగంపై ప్రత్యక్ష దాడులకు సిద్ధపడ్డారు.
ప్రజలు, వారి తరఫున మీడియా వేసే ప్రశ్నలకు తమ దగ్గర సమాధానాలు లేనప్పుడే పాలకుల్లో అసహనం పెరుగుతుంది. వరంగల్లో జరిగింది అదే. అధికార మదంతో కండ్లు మూసుకుపోయిన పాలకులు అక్షరం గొంతు నులుమాలని చూస్తున్నారు. ముష్కరదాడులతో ప్రశ్న ల నోరు మూయించాలని అనుకోవడం అజ్ఞానం, భ్రమ తప్ప మరోటి కాదు. రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే నాయకుడి పార్టీకి చెందిన నేతలు రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్ర హక్కుతో ప్రశ్నించే మీడియాపై దాడులకు తెగబడటం వారిలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనం. కాంగ్రెస్కు పుట్టుకతో వచ్చిన ఈ బుద్ధి పుడకలతో గానీ పోదని అంటారు. ఎమర్జెన్సీ రోజుల్లో పత్రికలపై సాగించిన దమననీతిని తెలంగాణ కాంగ్రెస్ పాలకులు గుర్తుచేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా నాడు నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచింది. ఆ తర్వా త జరిగిన ఎన్నికల్లో ప్రజాగ్రహ తుఫానులో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. నిరంకుశ పాలన తుడిచిపెట్టుకుపోయింది. తెలంగాణలోనూ అదే జరుగుతుందని చెప్పక తప్పదు.