తెలంగాణలో వరంగల్ కేంద్రంగా ‘జనధర్మ’ పత్రికను స్థాపించి ప్రజలను చైతన్యపరిచిన మహోన్నత పత్రికా సంపాదకులు ఎం.ఎస్.ఆచార్య. ‘ధర్మో రక్షతి రక్షితః’ ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందనే వేద వాక్యాన్ని ప్రమాణంగా తీసుకొని ‘జనధర్మ’ పత్రికను నెలకొల్పారు. తన పత్రిక ద్వారా నిర్భయంగా ధర్మరక్షణకు కృషిచేశారు.
రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ దృఢంగా నిలబడిన ఎం.ఎస్. ఆచార్య నమ్మిన ధర్మాన్ని ప్రచారం చేసి హైదరాబాద్ విముక్తిలో పాత్రధారుడయ్యారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టనివాడు, స్థిరమైన లక్ష్యాలతో, తాను నమ్మిన విశ్వాసాలను ప్రచారం చేయడంలో ఎన్ని ప్రతిబంధకాలెదురైనా చలించకుండా ‘జనధర్మ’ పత్రికను నడిపి ఆదర్శ సంపాదకులుగా నిలిచారు ఎం.ఎస్.ఆచార్య. పత్రికారంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పి, ఉన్నత వ్యక్తిత్వంతో రాజకీయాలకతీతంగా అందరిచేత గౌరవింపబడిన ఎం.ఎస్.ఆచార్య, మా నాన్న అయిన నాటి విద్యాశాఖమంత్రి మండలి వెంకటకృష్ణారావుకు ఆప్తమిత్రుడు. అందుచేతనే వారిని దగ్గరగా చూసే అదృష్టం నాకు కలిగింది.
వారు మాకు ‘జనధర్మ’ పత్రిక పంపుతుండేవారు. క్రమం తప్పకుండా నేను చదువుతుండేవాడిని. ఏ రాజకీయ నాయకుడినీ ప్రశంసించని ఆచార్య మా నాన్న 50వ జన్మదినోత్సవ సందర్భంలో ఒక పూర్తి పేజీ వ్యాసం ప్రచురించడం నన్ను ఆశ్చర్యపరిచింది. మా నాన్న వరంగల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా రాశారు.
చిత్తశుద్ధి, నిజాయితీ, నిస్వార్థ సేవానిరతి, కార్యదక్షత మండలి వెంకటకృష్ణారావు ప్రత్యేకతలని అతనితో మాట్లాడిన స్వల్పకాలంలో ఎవరైనా గ్రహించగలుగుతారు. నాన్నలోని ఈ సుగుణాలే వరంగల్ ప్రజలను ఎక్కువగా ఆకర్షించాయి. ఏ ఇతరులు పాల్గొనే సభ కన్నా నాన్న పాల్గొనే సభకు అధిక సంఖ్యలో వరంగల్ జనం అన్ని తరగతులవారు హాజరవుతారంటే కూడా ఆయన గుణశీలాలు, నిరాడంబరతలే కారణమని ఎం.ఎస్. ఆచార్య రాశారు. మా నాన్న వ్యక్తిత్వాన్ని ఎంత పరిశీలన చేశారో, ఎంత పరీక్షించి చూశారో వేరుగా చెప్పనక్కరలేదు. ‘జనధర్మ’లో మరో మంత్రి గురించి రాయడం నేను చూడలేదు. ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలకు మద్దతివ్వడమే కాకుండా ఒక కార్యకర్తగా ఆయన పనిచేశారు.
కేంద్ర సమాచార హక్కు కమిషనర్గా మాడభూషి శ్రీధర్ ఉన్నప్పుడు ఆయనను ఢిల్లీలో కలిశాను. అప్పుడు మాటల సందర్భంలో, ఎం.ఎస్.ఆచార్య కుమారుడే ఈ శ్రీధర్ మాడభూషి అని తెలుసుకొని ఆనందపడ్డాను. తండ్రి గుణగణాలను, పోరాట పటిమను, తాను నమ్మిన సిద్ధాంతానికి నిలబడి కష్టనష్టాలకు వెరువని వ్యక్తిత్వం మాడభూషి శ్రీధర్ ఆచార్య సంతరించుకున్నారు. పత్రికా రచనలోనూ తండ్రి వలె నిర్భీతి ప్రదర్శిస్తారు. మా నాన్నకు ఎం.ఎస్. ఆచార్యతో, నాకు మాడభూషి శ్రీధర్ ఆచార్యతో అనుబంధం ఏర్పడటం దైవ సంకల్పమే అనుకుంటాను. పత్రికారంగానికి తన మహోన్నత వ్యక్తిత్వంతో వన్నె తెచ్చిన ఎం.ఎస్.ఆచార్యకు ఇదే నా అక్షర నివాళి.
(వ్యాసకర్త: ఎమ్మెల్యే,మాజీ మంత్రి)
(ఎంఎస్ ఆచార్య 101వ జయంతిని పురస్కరించుకొని నేడు కేయూలో స్మారకోపన్యాసం జరుగనున్న సందర్భంగా)
– మండలి బుద్ధప్రసాద్