ఇందిరాగాంధీ తర్వాత కాంగ్రెస్‌కు ‘బ్రహ్మాస్త్రం’గా ఆ పార్టీ నేతలు, మీడియా అభివర్ణించిన ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రా పార్లమెంట్లో శుక్రవారం చేసిన తొలి ప్రసంగం తుస్సుమంది. వయనాడ్ ఉప ఎన్నికలో గెలిచాక ఆమెపై కాంగ్రెస్ నేతలు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కానీ, ఆమె ప్రసంగంలో కొత్తదనం గాని, దూకుడు గాని ఎక్కడా కనిపించలేదు. కాంగ్రెస్ సభ్యుల హర్షధ్వానాలు మినహా పెద్దగా చెప్పుకోవడానికి గట్టి పాయింట్ ఏదీ కనిపించలేదు.
రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన చర్చను ప్రతిపక్షాల తరఫున తొలిసారి ఎంపీగా గెలిచిన ప్రియాంకతో ప్రారంభించడమే కాంగ్రెస్ వైఖరి మారదని చెప్పేందుకు నిదర్శనం. అదే రోజు ఉదయం టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ను రాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడంతో ప్రియాంక ప్రసంగం మరుగున పడిపోయింది. సహజంగానే ‘పుష్ప’ నిర్బంధం, కోర్టు, ఆస్పత్రికి తరలింపు దృశ్యాలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్నాయి.
2004లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన రాహుల్.. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ప్రధాని కుర్చీ ఎక్కడం పెద్ద విషయం కాదు’ అని అహంభావంతో సమాధానమిచ్చారు. తమ కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ప్రధాని పీఠం ఎక్కి ఉండవచ్చు. అంతమాత్రాన తొలిసారి ఎంపీగా ఎన్నికైన వ్యక్తి అలా మాట్లాడటం దిగ్భ్రాంతికరం. నెహ్రూ-గాంధీ కుటుంబం మాత్రమే త్యాగాలు చేసినట్టు, దేశ ప్రజలకు వారే శిరోధార్యం అన్నట్టుగా వారు మాట్లాడటం సబబు కాదు. అయినా బయటివారు ప్రశంసించాలే గాని, ఆ కుటుంబ సభ్యులే స్వోత్కర్షతో మాట్లాడితే వారు నడిపే రాజకీయపక్షానికే నష్టం. తన తొలి ప్రసంగంలో నెహ్రూ, ఇందిర దేశానికి ఎంత మేలు చేశారనే విషయానికే ప్రియాంక ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
దేశంలో అనేక కీలక సంస్థలకు నెహ్రూ పునాదులు వేశారని చెప్పారు. అయితే, ఈ సంస్థలన్నీ స్వాతంత్య్రం వచ్చాక జాతి లేదా దేశ నిర్మాణంలో భాగంగా అన్ని ప్రభుత్వ వ్యవస్థల సమష్టి కృషితో రూపుదిద్దుకున్నాయి. నెహ్రూ వంటి గొప్ప నేత స్మృతికి దీని వల్ల నష్టమే తప్ప మేలు జరగదు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రచారమే దివంగత నేతలపై వ్యతిరేకతను పెంచుతున్నది. దాదాపు 17 ఏండ్లు ప్రధానిగా కొనసాగిన నెహ్రూ వంటి బడా నేతల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం. అందరూ తమ ముత్తాత ఘనతను తన మాదిరిగా గుర్తించాలని, కీర్తించాలని ప్రియాంక కోరితే అది జరగదు. సోనియా అయినా తన జీవితానుభవం నుంచి ఈ విషయం గురించి కూతురికి చెప్పాలి.
2004లో యూపీఏ సర్కారు అధికారం చేపట్టినప్పుడు ప్రియాంక మెట్టిన కుటుంబం తమ ఇంటిపేరు ‘వధేరా’ను ‘వాద్రా’ గా మార్చుకుంది. అప్పట్లో ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంక కుటుంబానికి పంపిన అధికార ఆహ్వాన పత్రికలో ఆమె పేరును ప్రియాంకాగాంధీ వధేరా అని రాశారు. అం దుకు ఒక అధికారిని బాధ్యుడిని చేస్తూ అతనికి కేంద్రం నోటీసు జారీచేసింది. ఈ వార్త మీడియాలో హల్చల్ చేయడంతో వెంటనే దాన్ని వాపసు తీసుకున్నది. ఈ ఘటన ప్రియాంక దూకుడు వ్యవహారశైలికి తార్కా ణం. ఈ 20 ఏండ్లలో ప్రియాంక, రాహుల్ ఇంకా నేల మీద నడవకుండా అదే ధోరణిలో వ్యవహరించడం ఆ కుటుంబ దీనావస్థను గాక వారు సారథ్యం వహించే కాంగ్రెస్ పతనావస్థకు అద్దం పడుతున్నది.
గతవారం లోక్‌సభలో అరగంట పాటు సాగిన ప్రియాంక ప్రసంగం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపలేకపోయింది. ఆమె నాయనమ్మ ఇందిర ప్రధాని పదవి చేపట్టిన మొదట్లో మాట్లాడేందుకు ఇబ్బంది పడ్డారు. అందుకే సోషలిస్టు దిగ్గజం రామ్ మనోహర్ లోహియా ఆమెను తరచూ ‘గూంగీ గుడియా’ (మూగబొమ్మ) అని అభివర్ణించేవారు. కాలక్రమంలో ఇందిర గంభీరంగా, పద్ధతిగా మాట్లాడటం అలవర్చుకున్నారు. మాజీ ప్రధానులు చంద్రశేఖర్, పీవీ నరసింహారావు, వాజపేయి వంటి గొప్ప వక్త కాకున్నా పార్లమెంటులో ఇందిర బాగానే నెట్టుకురాగలిగారు.
ప్రియాంక తన వాగ్ధాటితో జాతిని ఉర్రూతలూగిస్తారని ఎవరూ ఆశించలేదు. కానీ, మరీ పాత రికార్డు వేసినట్టు మాట్లాడతారని కాంగ్రెస్ నేతలే ఊహించలేదు. సోమవారం నాడు ప్రియాంక పార్లమెంటుకు వెళ్లినప్పుడు ఆమె భుజంపై నుంచి వేలాడుతూ ఉన్న అందమైన సంచిపై ఆంగ్లంలో ‘పాలస్తీనా’ అని రాసి ఉన్న అక్షరాలు కనిపించాయి. పెద్దగా శ్రమ లేకుండా పేరు సంపాదించాలనే ఆమె ధోరణిని అవి సూచిస్తున్నాయి.
కష్టపడకుండా రాజకీయాల్లో ఎదగడం కష్టమనే వాస్తవాన్ని ప్రియాంకకు కాంగ్రెస్ సీనియర్లు చెప్తే మంచిది. లోక్‌సభలో తొలి ప్రసంగంతోనే ఆమె రాజకీయ సత్తా ఏంటో అంచనా వేయడం న్యాయం కాదు. కానీ, 1998లో రాయ్‌బరేలీ స్థానంలో ప్రచారంతో ప్రియాంక రాజకీయ జీవితం ప్రారంభమైందనేది వాస్తవం. ఇప్పటికే ఆమె ఐదు దశాబ్దాల జీవన ప్రయాణాన్ని దాటారు. ఈ విషయాన్ని గుర్తిస్తే కాంగ్రెస్‌కే కాదు, భారత ప్రజాస్వామ్య వ్యవస్థకూ మేలు జరుగుతుంది.
– నాంచారయ్య మెరుగుమాల