ప్రధానమంత్రి మోదీ వచ్చారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంతకుముందే వచ్చింది. ఈడీ-మోదీ బంధం ఇదే కదా?
11 మార్చి 2023న ఢిల్లీ ఆఫీసులో విచారించిన ఇన్నాళ్లకు ఇప్పుడే ఏం తొందరో?
సుప్రీంకోర్టు తీర్పు జస్ట్ మూడ్రోజుల్లో రానుందనే అంచనాలుండగానే ఈడీ ఉరుకులాడింది.
Modi-ED | ఆవగింజంత అయినా సరాసరి ప్రమేయం లేని ఓ పేలవమైన కేసులోని అబద్ధం గడప దాటేలోగా, కక్షసాధింపు అనే అసలు నిజం ప్రపంచానికి రీచ్ అయింది! సరిగ్గా పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు రోజు ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలతో నక్కి నక్కి బనాయించిన కేసు ముద్రకు మూల్యం చెల్లించాల్సిన సమయం మోదన్న ద్వయానికి, వాళ్ల సుకుమార పార్టీకి ఆసన్నమైందనే ఆగ్రహం బీఆర్ఎస్ శ్రేణుల్లో పెల్లుబుకుతున్నది. తమ ఆడబిడ్డ, వర్తమాన వీరవనిత కవితకు తెలంగాణ పౌర సమాజం, నైతికంగానే కాదు, ప్రజా కోర్టులోనూ మద్దతుగా నిలుస్తారని తేల్చి చెబుతున్నది.
రాజకీయాల్లో, పబ్లిక్ లైఫ్‌లో మనగలగాలంటే దమ్మూ ధైర్యం ఉండాలని బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్ ఊరకే అనలేదు. కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో ప్లాంటెడ్ కేసులో తన తనయే ఇపుడు కాల పరీక్షలో జంకూ బొంకూ లేకుండా నిటారుగా నిలబడింది. రాజకీయ అభద్రతతో వేసిన ముద్రకు వ్యవస్థల్లో అన్నింటికన్నా పవర్ఫుల్ అయిన ప్రజాకోర్టులో మోదన్న జట్టు తగిన మూల్యాన్ని చెల్లించుకోకతప్పదు. నమ్మిన సిద్ధాంతాలకు, ప్రజా సేవకు తిరుగులేని నిబద్ధత అయిన కవిత శక్తి సామర్థ్యాలకు ఒకే ఒక్క మచ్చు తునక మనందరి మస్తిష్కంలో నేటికీ సజీవంగా కదలాడే సన్నివేశం ఇక్కడ సందర్భోచితం. తెలంగాణ రాష్ట్ర సాధన స్వప్నాన్ని సాకారం కాకుండా, కడదాకా చిదిమేయ చూసిన నాటి పాలకులు ఉద్యమ సారథి కేసీఆర్‌ను కరీంనగర్ అల్గునూరు చౌరస్తాలో అరెస్టు చేసి, తమకు అనువైన ఖమ్మానికి తరలించారు. అక్కడి నుంచి నిమ్స్‌లో ఆమరణదీక్ష వరకు ‘అటు నాన్న-ఇటు తెలంగాణ’ అత్యంత ఛాలెంజింగ్ సమయంలో తానూ తన సోదరుడు కేటీఆర్ చూపిన, చాటిన పటిమ ఎప్పటికీ మరువని చరిత్ర. అటువంటి కవితను అపఖ్యాతి పాలు చేయడం ఎవరి తరమూ కాదనేది కవిత అనుయాయుల వాదన.
ప్రజా చైతన్య చేతన కవితను తాత్కాలికంగా ఇబ్బంది పెట్టినా.. అంతకంతకూ అనుభవించక తప్పని ప్రాప్త కాలజ్ఞత చవిచూస్తారని శపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి మించి భారత ఆర్థిక వ్యవస్థనే పతనం అంచుకు నెట్టిన, మదుపరుల నెత్తిన శఠగోపం పెట్టిన పాపులను వదిలి.. ఢిల్లీ రాష్ట్ర సర్కారుతో ఎలాంటి సంబంధం లేని కవితను కేవలం కేసీఆర్ తనయ అయినందునే కేసును ఆపాదించడం పిల్లలు గల ప్రతి తల్లిదండ్రుల మనసును గాయపర్చడమే. పర్సులో పది రూపాయలుంటే అన్నార్తులు, దీనార్తులు, అభాగ్యులు, నమ్ముకున్న వారికి పంచేసి ఖాళీ పర్సుతో తిరిగి ఇంటికెళ్ళే ఉదార ప్రజా నాయకురాలు కవిత వ్యక్తిత్వాన్ని ఇటువంటి కుటిల కేసులు ఏమాత్రం దెబ్బతీయలేవు. అందుకే,ఒక పాపులర్ సామెత ఒక పాపులర్ ప్రజాజీవిత కవిత విషయంలో ప్రభావమంతంగా ఉల్టాగా నమోదైంది. నిజం గడప దాటేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుందనే నానుడి ఇక్కడ రివర్స్ అయింది. అబద్ధం గడప దాటేలోగా నిజం ప్రపంచానికి రీచ్ అయింది.
ఎవరెస్టు సమాన కీర్తిప్రతిష్టల వ్యక్తిత్వాన్ని ఈ అరెస్టు ఏమాత్రం మసకబారనీయదు. పైగా తెలంగాణ టూ యావద్భారత ప్రజానీకాన్ని దగ్గర చేస్తుంది. యువత సహా ఆబాల గోపాలం తమ నాయకురాలిగా, తమ గొంతుగా గర్వపడతారామెను.