అసంఘటిత రంగంలో పనిచేసే వారిలో ఇంటి పనిచేసే కార్మికులు కూడా ఒక భాగం. ఉన్నత, మధ్యతరగతి కుటుంబాల్లో చంటిపిల్లల సంరక్షణ, ఇల్లు శుభ్రం చేయడం, వంట పనులు చేస్తూ ఎంతో మంది జీవనోపాధి పొందుతున్నారు. సెలవులు, హక్కులు, వసతుల లేమి మధ్యనే కాలం వెళ్లదీస్తుండటం విచారకరం. కనీస వేతన చట్టం, పని గంటలు గూర్చి వీరికి తెలియకపోవడం శోచనీయం.
ఉన్నత, మధ్యతరగతి కుటుంబాల్లో ఇంటి పని చేసేవారికి ఒక్క పనంటూ ఉండదు. ఆయా ఇళ్లల్లో ఉండే ప్రతి పని వారే చక్కబెట్టాల్సి ఉం టుంది. వంట పని, ఇంటి పని, పాత్రలు కడగటం, బట్టలుతకడం, ఇస్త్రీ చేయడం తదితర పనులన్నీ రెక్కలు ముక్కలు చేసుకొని ఒక్కరే చేయాలి. ఇవేకాకుండా ఇంటి కాపలా, పెంపుడు జంతువులు సంరక్షణ, గార్డెనింగ్, వృద్ధులు, అనారోగ్యం పాలైన వారికి సేవలందించడం, డ్రైవర్లు, కిరాణా, కూరగాయలు తేవడం ఇలా పలు పనులు చేసేవారంతా ఈ కోవలోకే వస్తారు.
ప్రపంచవ్యాప్తంగా 7.6 కోట్ల మంది ఇంటిపని చేసేవారున్నట్టు ప్రపంచ కార్మిక సంఘం (ఐఎల్వో) గణాంకాలు చెప్తున్నాయి. మన దేశంలో సుమారు 40 లక్షల మంది ఈ రంగంలో ఉన్నారు. వారిలో 76.2 శాతం మంది మహిళలే.
ముఖ్యంగా సమాజంలో అట్టడుగు, బడుగు బలహీనవర్గాల మహిళలు ఈ రంగంలో ఎక్కువగా కనిపిస్తారు. ఆందోళనకరమైన విషయం ఏమంటే.. ఈ వృత్తిలోకి బాలికలు కూడా రావడం. పని గంటలతో సంబంధం లేకుండా శ్రమ దోపిడికి గురయ్యేవారికి నెలకు కేవలం రూ.2,000- 4,500 వేతనమే అందుతుండటం విచారకరం.
ఇలాంటి పనిచేసే మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు జరుగుతుండటం ఆందోళనకరం. యజమానులు, యజమాని కుటుంబసభ్యులు ఈ దురాగతాలకు పాల్పడుతున్నారు. పొట్టకూటి కోసం, కుటుంబ అవసరాల కోసం పనిచేస్తు న్నవారిపై అమానుష దాడులు జరుగుతుంటాయి. బయట ప్రపంచానికి తెలియని అకృత్యాలు కోకొల్లలు. యజమానులు, సంస్థలు వారు కూడా మనుషులేనన్న విషయాన్ని గుర్తించాలి. బానిసలు కాదనేది మర్చిపోకూడదు. సమాజంతో పాటు ప్రభుత్వాలు వారి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వారి కోసం ప్రత్యేక చట్టాలను ప్రవేశపెట్టి అమలుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
-ఐ.ప్రసాదరావు
63056 82733