ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రాంతీయ పార్టీల మీద జాతీయ పార్టీలు దుమ్మెత్తి పోస్తుంటాయి. తమది సువిశాలమైన జాతీయవాదమనీ, వాటిది సంకుచిత ప్రాంతీయ వాదమనేది ప్రధానంగా ముందుకుతెచ్చే వాదన. కానీ, ఆసేతు హిమాచలం పరచుకొని ఉన్నది వైవిధ్యభరితమైన భారతం. దేశాన్ని ఒకే గాటన కట్టి పబ్బం గడుపుకోవాలన్నదే జాతీయ పార్టీల భావన. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ అన్న తేడాలు ఉండవు. దొందూ దొందే. విభిన్నమైన జాతులు, భాషలు, ఆచారాలు ఉండటమనేది సమస్య కాదు. ప్రజలందరూ కలిసి మెలిసి ఉండాలనే కోరుకుంటారు. కానీ, ఒక్కో ప్రాంతం ప్రజల ఆశలు, ఆకాంక్షలు భిన్నంగా ఉంటాయి. అందులో నుంచే ప్రాంతీయ వాదం, దానికి కొనసాగింపుగా పార్టీలు ఆవిర్భవిస్తాయి. అధికారం కోసం జరిగే పోరులో ఓట్ల రూపంలో, సీట్ల రూపంలో ఆ ఆకాంక్షలే వ్యక్తమవుతాయి. తాజాగా వెలువడిన మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రాంతీయ శక్తుల ప్రాముఖ్యాన్ని, అనివార్యతను చాటిచెప్పాయి.
మహారాష్ట్రలో శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంతో పొత్తు పెట్టుకొని బీజేపీ తన ఉనికిని నిలబెట్టుకున్నది. రెండు ప్రాంతీయ పార్టీలను చీల్చి, ఆ చీలిక వర్గాలతో కలిసి పోటీచేసింది. అత్యధికంగా 149 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ సొంతంగా మెజారిటీకి కొద్దిదూరంలో ఆగిపోయింది. అంటే మిత్రపక్షాలైన ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడక తప్పని పరిస్థితి. ‘ఏక్ హై తో సేఫ్ హై’ వంటి హద్దు మీరిన ప్రచారం జరిపినప్పటికీ వేర్వేరు ప్రాంతాల్లో మిత్రపక్షాలైన ప్రాంతీయ పార్టీల ఓటు బదిలీ నుంచి లాభపడింది.
కాంగ్రెస్ సీట్లు భారీగా నష్టపోతే బీజేపీ అతిపెద్ద పార్టీగా ముందుకువచ్చి పట్టు బిగించింది. ఇటు కాంగ్రెస్ చీలిక పార్టీల అవశేష వర్గాలతో కలిసి పోటీచేసినా కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని సీట్లు కూడా దక్కించుకోలేకపోయింది. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు గెలిచిన సీట్ల సంఖ్యను పోల్చి చూసుకుంటే అంతరం అంతంత మాత్రమేనని తెలిసిపోతుంది.
జార్ఖండ్ ఫలితాలు ప్రాంతీయ పార్టీల ఉనికిని బలంగా చాటాయనే చెప్పాలి. రాష్ట్ర సాధనకు ఉద్యమించిన జేంఎంఎం కేంద్రం వేధింపులను, బీజేపీ విష ప్రచారాన్ని తట్టుకొని నిలిచి ప్రజాక్షేత్రంలో జెండా ఎగురవేసింది. కాంగ్రెస్ అంటకాగే పార్టీ స్థాయికి దిగజారిపోయింది. కేంద్ర, రాష్ట్ర అధికార పీఠాలను జాతీయ పార్టీలు అధిరోహించాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు, అండదండలు లేకుండా సాధ్యమయ్యే రోజులు ఎప్పుడో పోయాయని ఈ ధోరణి సూచిస్తున్నది. రెండు పెద్ద పార్టీలు ఎంతగా వద్దనుకుంటున్నా ప్రాంతీయపార్టీలు మళ్లీ మళ్లీ తలెత్తుకుంటూనే ఉన్నాయి. తమ సత్తాను, అనివార్యతను చాటుకుంటున్నాయి. సమాఖ్యవాదం ప్రాముఖ్యాన్ని పదే పదే గుర్తుచేస్తూనే ఉన్నాయి. జాతీయ పార్టీలు ప్రాంతీయ ఆకాంక్షల పరిపూర్తిలో ఘోరంగా విఫలం కావడమే అందుకు ప్రధాన కారణం. ఎప్పటికైనా ప్రాంతీయ పార్టీలే దేశానికి శ్రీరామరక్ష అని చెప్పకతప్పదు.