ఈ సృష్టి మొత్తం శివుడి ఆట. సచేతనత్వం చేస్తున్న నృత్యం.. కొన్ని కోట్ల రకాల జీవ జాతులుగా కనిపించే ఒకే బీజం. ప్రపంచం మొత్తం నిష్కళంకమై, అద్భుతమైన లయలో సంచరించడమే శివుడు. ఆయన ఆద్యంతమైన, సనాతనమైన, శాశ్వతమైన శక్తికి మూలం. శివరాత్రి అనే పదానికి శివ తత్త్వాన్ని మూడు పరికరాలుగా జాగృతం చేసే రాత్రి అని అర్థం. సమాధి స్థితిని శివ సాయుజ్యం అంటారు. శివుడి సముఖాన్ని వివరించడం దుర్లభం. దాన్నే కబీరుదాసు ‘కోటి సంవత్సరాల విశ్రాంతి ఒకే క్షణంలో లభించడం’ అంటారు. అన్ని అస్తిత్వాల నుంచి విమోచనం కలిగించే దీర్ఘమైన విశ్రాంతి కలిగించే చేతనత్వమే శివరాత్రి.
దైవ సన్నిధిలో పొందే విశ్రాంతే నిజమైన విశ్రాంతి. రాత్రి అనే శబ్దానికి సంస్కృతంలో సూక్ష్మమైన, మానసికమైన, ప్రాపంచికమైన రుగ్మతలను పోగొట్టేది అని అర్థాలున్నాయి. దీనివల్ల శరీరానికి, మనస్సుకు, వాక్కుకూ విశ్రాంతి దొరుకుతుంది. ‘ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి’ అని మూడుసార్లు జపించడం వెనుక ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక శాంతి పొందాలని మనం ఆశిస్తాం.
శివతత్త్వం.. శక్తితో కలిసి ఒకటిగా మారిన సమయమే శివరాత్రి. ఆది నుంచి క్రియాశీలమైన శక్తి సర్వోత్కృష్టమైన శివతత్త్వాన్ని కలుస్తుంది. శివుడు ఒక మౌనసాక్షి- అంటే చిదాకాశం. శక్తి అంటే చిద్విలాసం, అనంత విశ్వాన్ని ఆడించే మహాశక్తి. శివుడు నిరాకారుడు. శక్తి క్షేత్రస్థాయిలో జరిగే వ్యక్తీకరణ. విషయానికి శక్తికీ మధ్య ఉండే ద్వైదీభావనను గుర్తించడం అంటే ఇదే. ప్రకృతి-పురుషుడు, ద్రవ్యం-గుణం.. వీటిలో అంతర్లీనంగా ఉండే ఏక భావనను గుర్తించడమే శివరాత్రి.
శంకర అంటే ‘మనసుకు శాంతిని ఇచ్చి మంచి చేసేవాడు’ అని భావం. శివతత్త్వం సర్వ వ్యాపకం, పవిత్రం. శివరాత్రి అపస్మారక నిద్రలో జారిపోకుండా విశ్వచేతన స్థితి జాగృతం కావడానికి చేసుకునే పండుగ. మనల్ని అన్నిరకాల గాఢ నిద్ర నుంచి మేల్కొల్పే సందర్భం. ఈ రోజు ఉపవాసం, జాగరణ చేయడం నియమాలు. ఉపవాసం అంటే.. కడుపు మాడ్చుకోవడం కాదు. శివతత్తాన్ని ఆస్వాదించడం, భగవంతుడి సమీపంలో నిలవడం. జాగరణ అంటే మనం మెలకువగా ఉండటమో, భజనలు పాడటమో కాదు. అంతర్ముఖులై ఉండి నిద్ర వల్ల కలిగే విశ్రాంతి గురించి చేతన కలిగి ఉండటం. నిద్రలో ఒక స్థాయిని దాటితే పొందే స్థితే సమాధి లేక శివ సాయుజ్యం. శివుడిని ఒక లింగాకారంగా చూస్తాం. దైవం ఏ లింగానికి చెందినది కాదు. అందుకే ఏకలింగం అంటారు. అదే ఆత్మ. శరీరం, మనసు, మేధస్సుకు అతీతంగా, ఇష్టాయిష్టాలకు దూరంగా ఉండే ఏకలింగం. అన్ని లింగాల నుంచి వచ్చిన శక్తి శివరాత్రి రోజు ఒకటిగా రూపాంతరం చెందుతుంది.
శివుడు భక్త సులభుడు, అమాయకుడు. అందుకే, బోలేనాథ్ అని ఎలుగెత్తి పిలుస్తారు భక్తులు. ఆయనకు బిల్వ పత్రాలు సమర్పిస్తే చాలు పొంగిపోతాడు. ఈ బిల్వ పత్రాల్లోనే ఒక దివ్యమైన సందేశం ఉంది. బిల్వం తమో, రజో, సాత్విక గుణాలను పరమాత్మకు అర్పించడాన్ని సూచిస్తుంది. మన జీవితంలోని మంచి చెడులను ఆ దైవానికి అప్పగించి విముక్తిని పొందాలి. ఆత్మార్పణం జీవితంలో ఆనందానికి ఒక మార్గం.
శివతత్త్వాన్ని ఎప్పుడూ అనుభూతిని పొందడమే శివరాత్రి. ఈ రోజు మనకున్న వాటి గురించి కృతజ్ఞతతో ఉండాలి. మనలో వృద్ధిని తీసుకొచ్చే ఆనందానికి కృతజ్ఞులమై ఉండాలి. అలాగే బాధ కూడా మన జీవితంలో ఒక గాఢతను తీసుకొస్తుంది. ప్రతీ దానిని శివతత్తంగా భావించి, మనస్ఫూర్తిగా స్వీకరించే స్థితికి చేరుకోవడమే శివరాత్రి అందించే శుభ ఫలితం.
– గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్
ఆర్ట్ ఆఫ్ లివింగ్