‘మధుర కవి’గా పేరు పొందిన మడిపడగ బలరామాచార్యులు కవిగానే గాక చిత్రకారునిగా, శిల్పిగా, గాయకుడిగా, గ్రంథ ప్రచురణ సంస్థ నిర్వాహకుడిగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా బహుముఖీయమైన సేవలందించిన వ్యక్తి. ఆయన 1926 ఆగస్టు 11న జంటనగరాలలో ఒకటైన సికింద్రాబాదులోని జనరల్ బజార్ ప్రాంతంలో జన్మించారు. మడిపడగ లక్ష్మమ్మ, మడిపడగ రాజయ్య ఇతని తల్లిదండ్రులు. వీరి పూర్వీకుల గ్రామం నాటి మెదక్ జిల్లా సిద్దిపేట సమీపంలోని మడిపడగ. ఊరిపేరే ఇంటిపేరుగా కొనసాగింది. వంశపారంపర్యంగా వస్తున్న తమ కులవృత్తి అయిన స్వర్ణకార వృత్తినే వీరు జీవనోపాధిగా స్వీకరించారు.
కలాసిగూడ ధన్బజార్ ప్రాంతంలోని ఉన్నత పాఠశాలలో నాలుగో ఫారం వర కే చదివారు. తర్వాత సికింద్రాబాద్లో తండ్రి నడిపే బంగారం దుకాణంలో బంగారం పని నేర్చుకొని, ఆభరణాలు తయారు చేసేవారు. ఆ దశలోనే కుంచెపట్టి రంగులతో బొమ్మలు వేసే చిత్రకళను, ఉలితో శిలను చెక్కి శిల్పాలుగా మలిచే శిల్పకళను నేర్చుకున్నారు. ఆ అభిరుచి, అభినివేశం క్రమంగా అక్షరాలను చెక్కి కవిత్వం గా మలిచే కవితా రచనవైపు దారితీసింది. అందుకు కావలసిన ముడిసరుకు కోసం ఆయన తెలుగు, ఉర్దూ, పారసీ, ఆంగ్ల కవిత్వాలను బాగా అధ్యయనం చేశారు. వాటిల్లోని గేయ కవితారీతులను ఆకళింపు చేసుకొన్నారు.
మడిపడగ బలరామాచార్య, దుబ్బాక గోపాలాచార్య కలిసి జంటకవులుగా, వారి ఇంటిపేర్లలోని మొదటి అక్షరాలు ‘మదు’, వారి పేర్లలోని పదాలు కలిపి ‘రామగోపాల’ కలం పేర్లుగా అనేక కవితలు రాశారు. అవి ఆనాటి పత్రికల్లో అచ్చయ్యాయి. 1939లో సికింద్రాబాద్ కేంద్రంగా వట్టికోట ఆళ్వారుస్వామి ప్రోత్సాహంతో, రాచమల్ల సత్యవతీదేవి సంపాదకత్వంలో ‘తెలుగు పత్రిక’ వెలువడేది. ఈ పత్రికతోపాటు ఆళ్వారు స్థాపించిన ‘దేశోద్ధారక గ్రంథమాల’, ‘అణా గ్రంథమాల’ బలరామాచార్యులను బాగా ప్రభావితం చేశాయి.
బలరామాచార్యులు, దుబ్బాక గోపాలాచా ర్య, సోమవారంపేట రామమూర్తి – ముగ్గురు కలిసి 1954లో ‘అరుణశ్రీ గ్రంథమాల’, రాజశ్రీ సాహిత్య కళాపీఠం’ అనే సంస్థలను స్థాపించి దాదాపు 240 సాహిత్య కార్యక్రమాలను, అష్టావధానాల వంటి విశిష్ట ప్రదర్శనల ను నిర్వహించారు. ‘రాజేశ్వర గ్రంథాలయం’ పేరుతో ఒక గ్రంథాలయాన్ని కూడా నడిపారు.
ఆనాటి లబ్దప్రతిష్టులైన కవిపండితులు తాపీ ధర్మారావు, నిడదవోలు వెంకటరావు, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, వానమామలై వరదాచార్యులు, దాశరథి సోదరులు, బిరుదురాజు రామరాజు, దివాకర్ల వేంకటావధాని, సీ నారాయణరెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి, కాళోజీ, నటరాజ రామకృష్ణ, ఉత్పల సత్యనారాయణచార్య మొదలైన వారి సాహచర్యం మడిపడగ బలరామాచార్య సాహిత్య ప్రస్థానానికి బలాన్ని కూర్చింది. వాళ్ల పుస్తకాలకు ముఖచిత్రాలు వేయడంవల్ల వారికి దగ్గరయ్యారు. వట్టికోట ఆళ్వారు స్వామి, మడిపడగ తరచుగా కలుసుకొని సాహిత్య చర్చలు జరిపేవారు.
దాశరథి, ఉర్దూకవి తాహీర్ హుస్సేన్ కలిసినప్పుడల్లా తెలుగు, ఉర్దూ కవిత్వంలోని సౌందర్యాత్మకతను గురించి గంటల తరబడి ముచ్చటించుకునేవారు. కాళోజీ మడిపడగకు ఆప్తమిత్రుడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆనాటి తెలంగాణ రచయితలకు సికింద్రాబాద్లోని జనరల్ బజార్లో ఉన్న మడిపడగ పనిచేసే బంగారం దుకాణం ఒక అడ్డాగా ఉండేది. ఈ వాతావరణమే మడిపడగ సాహితీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది.
ఇతను సుమారు 65 కావ్యాలు రచించినట్టు, వాటిల్లో 25 వరకు అచ్చయినట్టు చెప్తా రు. వీటిలో ‘ఉమర్ ఖయ్యాం అమరగీతాలు’ వీరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇంకా ‘మురళీరవం’, ‘పాంచజన్యం’, ‘గుడిగంటలు’,‘శ్రీశైలం’, ‘జయహెూ జవాన్’, ‘బొమ్మల బాల గేయాలు’, దాశరథితో కలిసి రాసిన ‘ఖబర్దార్ చైనా’ వంటివి మాత్రమే అందుబాటులో ఉ న్నాయి.‘మేనకా విశ్వామిత్రం’,‘శాకుంతలం’, ‘శతానందం’, ‘భ్రమర గీతాలు’, ‘గీతాంజలి’, ‘గోపికానందం’, ‘శతాక్షి’, ‘రాములమ్మ పదా లు’, ‘లాస్యహేల’, ‘గళమంగళం’, ‘సోగ్గాని పాటలు’, ‘ప్రాసకోశం’, ‘బ్రహ్మంగారి చరిత్ర’, ‘మాధవారాధనం’, ‘మధులహరి’,‘కదంబ కాహళి’, ‘వాస్తు చంద్రిక’ వంటి పలు కావ్యా లు వీరు రచించినవే.
వీరి రచనలలో భక్తిగీతాలు, దేశభక్తిగీతాలు చెప్పుకోదగ్గవి. ఆనాటి హెచ్ఎంవీ గ్రామఫోన్ రికార్డు వారు వీరి పాటలను రికార్డులుగా తీసుకొచ్చారు. వాటిలో ‘చిటపటచినుకులు’ అనే పాట ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘సినిమా రాణి’, ‘శూర్పణఖ’ అనే సినిమాలకు పాటలు కూడా రాసినట్టు ఆయన మిత్రులు చెప్తారు. ఆకాశవాణి ద్వారా వీ రి పాటలు, కవితలు ఆనాడు విస్తృతంగా ప్రసారమయ్యేవి. 1969 నాటి తొలిదశ తెలంగా ణ ఉద్యమంలో వీరు ఉద్యమ పాటలు కూడా రాశారు.
చిత్రకారునిగా వీరు గీసిన చిత్రాలలో రాము డు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు, పొన్నచెట్టు నీడన రాధాకృష్ణులు వంటి అనేక చిత్రాలు జీవకళతో ఉట్టిపడుతూ చిత్రకారునిగా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.
ప్రభుత్వ పాఠ్యపుస్తకాలకు ఆనాడు అట్టబొమ్మలు వేయడంలో అందెవేసిన చేయి బలరామాచార్యది. సినారె పుస్తకాలకు ముఖచిత్రాలు ఈయన వేసినవే. ఆనాటి సంగీత, నాటక అకాడమి వారి ‘నాట్యకళ’ పత్రికకు అర్థవంతమైన అక్షరాల కూర్పుతో శీర్షికను గీసిపెట్టారు. 1975లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభల లోగోను రూపొందించింది వీరే. బొంతలపల్లి శ్రీ వీరభద్రస్వామి గుడిలోని వెండిప్రభలు తయారు చేయడంతోపాటు, శ్రీ భద్రకాళి విగ్రహాన్ని కూడా చెక్కారు.
కవిగా, చిత్రకారునిగా, శిల్పిగా, పుస్తకాల ముఖచిత్ర రూపకర్తగా, అనేక సాహితీ, సాం స్కృతిక సంస్థల లోగోలు రూపొందించే కళాకారునిగా భిన్న రంగాల్లో తనదైన ప్రతిభను ప్రదర్శించిన మడిపడగ బలరామాచార్య 1992 జూన్ 9వ తేదీన కన్నుమూశారు.
బలరామాచార్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వారి కుమారుడు శ్రీకాంతానంద్ మంచి చిత్రకారుడిగా ఎదిగా రు. తండ్రి జ్ఞాపకార్థం ‘బల రాం ఆర్ట్స్ అకాడమి’ని స్థాపిం చి ఏటా చిత్రప్రదర్శనను ఏర్పా టు చేసి ఉత్తమ చిత్రకారునికి బహుమతులు ఇస్తున్నారు.
(ఆగస్టు 11న మడిపడగ బలరామాచార్య జయంతి)