ఆరు దశాబ్దాలుగా తెలంగాణ అరిగోస పడుతున్నా ఏమిటీ అన్యాయమని ఏ నాయకుడూ ప్రశ్నించలేదు. తెలంగాణకు రావాల్సిన నిధులు, నియామకాలను తన్నుకుపోతున్నా పదవుల కోసం పెదవులు మూసుకున్నారే తప్ప, ఒక్కరంటే ఒక్కరూ నిలదీయలేదు. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆవేదనను తరమడానికి కేసీఆర్ పూనుకున్నారు. 14 ఏండ్ల పాటు నిరంతర పోరాటం చేశారు. పోట్లాడి తెలంగాణను సాధించారు. ప్రపంచ పోరాట చరిత్రలో తెలంగాణ మలి దశ ఉద్యమం, కేసీఆర్ పోరాటం చిరస్థాయిలో నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా 2001లో పార్టీని స్థాపించిన కేసీఆర్ తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించారు. మనకంటూ సిద్ధాంతపరమైన ఓ రాజకీయ పార్టీ ఉందనే భావనను ప్రజల్లో కలిగించారు. అంతకుముందు తెలంగాణ కోసం మాట్లాడిన, పోట్లాడిన పార్టీ లేనే లేదు. తెలంగాణవాదాన్ని పట్టుకొని పుట్టిన పలు పార్టీలు పదవుల ఎరకు చిక్కి కనుమరుగయ్యాయి. గాంధేయవాది అయిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని అహింసా మార్గంలోనే నడిపించారు. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంలో ఎక్కడా, ఎన్నడూ ఒక్క హింసాత్మక ఘటన జరగలేదు. సమైక్యాంధ్ర పాలకులను ప్రశ్నించారే తప్ప, బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చిన వారిని పల్లెత్తు మాట అనలేదు. అందుకే సెటిలర్లు కూడా నాడు, నేడు కేసీఆర్ నాయకత్వానికి జై కొడుతున్నారు.
2014లో ఏర్పడిన ప్రత్యేక తెలంగాణలో ఉద్యమ నేత కేసీఆర్ తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ నగరమంటే తాగునీటి తిప్పలు, ట్రాఫిక్ కష్టాలు, ఇరుకు రోడ్లు, కరెంట్ కోతలు గుర్తుకువచ్చేవి. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం కంకణం కట్టుకున్న కేసీఆర్ ముందుగా ఈ సమస్యలను పరిష్కరించి, మౌలిక వసతులు కల్పించారు. ఆడపిల్లల రక్షణ కోసం షీ టీంలను ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మించి, లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి హైదరాబాద్‌ను సేఫ్ సిటీగా తీర్చిదిద్దారు. అత్యంత సురక్షిత నగరంగా మారడంతో హైదరాబాద్ ఇమేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది. నగరానికి ప్రముఖ టెక్ కంపెనీలు క్యూ కట్టాయి. గ్లోబల్ కంపెనీలకు హైదరాబాద్ వేదికగా మారింది. పెట్టుబడులు, ఉపాధికి స్వర్గధామంలా మారింది.
అందుకే, రెండుసార్లు జీహెచ్ఎంసీతోపాటు 2018, 2023 ఎన్నికల్లోనూ హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నది. ఈ రెండేండ్లలో పాలన పూర్తిగా పడకేసింది. ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లు, హామీల అమలును పక్కనపెట్టి కాంగ్రెస్ సర్కార్ విద్వేష రాజకీయాలు చేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి దెబ్బ హైదరాబాద్ ప్రజలనే కొట్టింది. ఆక్రమణల తొలగింపు, ఆధునీకరణ పేరిట హైదరాబాద్ ఇమేజ్ను డ్యామేజ్ చేసింది. హైడ్రా రాకతో చాలామంది నిరుపేదలు నిరాశ్రయులయ్యారు. హెచ్‌సీయూ భూములను లాక్కోవడానికి ప్రయత్నించగా విద్యార్థులు, ప్రజాస్వామికవాదుల పోరాటంతో కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గింది. తన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు కేసీఆర్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో డైవర్షన్‌కు పాల్పడుతున్నది. అనేక విషయాల్లో కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా సర్కార్ తీరు మారడం లేదు.
మరోవైపు రాజ్యాంగ ప్రతిని పట్టుకొని ఓట్ చోరీ నినాదమెత్తుకున్న రాహుల్‌గాంధీ.. తెలంగాణలో సీట్లు, ఓట్ల చోరీపై మాత్రం మాట్లాడడం లేదు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుదారులకు రాజ్యాంగ పదవులతోపాటు రాజకీయ పదోన్నతులు కల్పిస్తున్నది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో ఓట్ల చోరీ వంతు వచ్చింది. ఇలాంటి నీతిమాలిన రాజకీయవాదులకు జూబ్లీహిల్స్ ప్రజలు గుణపాఠం చెప్పాలి.
తెలంగాణలో స్థానిక సంస్థల పాలకమండళ్ల గడువు ముగిసి దాదాపు రెండేండ్లు కావస్తున్నది. అయినప్పటికీ సర్కార్ ఎన్నికలు నిర్వహించడం లేదు. అధికారం కోసం నాడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చి నేడు కాంగ్రెస్ చేతులెత్తేసింది. ఈ వైఫల్యాన్ని ప్రతిపక్షాలపై నెట్టేందుకు హస్తం పార్టీ విఫలయత్నం చేస్తున్నది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రభుత్వానికి చాలెంజ్‌గా మారింది. 2023 ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. ఉప ఎన్నికల రూపంలో హైదరాబాద్‌లో పాగా వేయాలని అధికార పార్టీ చూస్తున్నప్పటికీ జూబ్లీహిల్స్ ప్రజలు ప్రజాసేవకుడు గోపీనాథ్ సతీమణి సునీత వైపు నిలబడే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఉప ఎన్నికలు ప్రధాన పాత్ర పోషించాయి.
ప్రజల్లోకి తెలంగాణవాదాన్ని బలంగా తీసుకెళ్లడానికి నాడు ఉప ఎన్నికలను అస్ర్తాలుగా గులాబీ పార్టీ వాడుకున్నది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇది తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఉప ఎన్నిక. ఇక్కడ గులాబీ పార్టీ గెలిస్తే కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలంగా కోరుకుంటున్నారనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది. చైతన్యవంతులు, విద్యావంతులు, సామాన్య ప్రజలు మరొక్కసారి కేసీఆర్ నాయకత్వానికి అండగా నిలబడి భవిష్యత్తు తెలంగాణ నిర్మాణానికి గట్టి పునాదులు వేయాలి. నవంబర్ 11న జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి.
(వ్యాసకర్త: బీఆర్ఎస్వీ, మాదిగ విద్యార్థి ఉద్యమ నాయకుడు)
-సంపత్ గడ్డం ,78933 03516