ఎన్నికల హడావుడిలో ఉన్న గుజరాత్ ప్రభుత్వం, బీజేపీ శ్రేణులు ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ వల్ల కలిగే ప్రయోజనాల గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాయని ఇటీవల జరిగిన మోర్బీ దుర్ఘటన రుజువుచేసింది. ఈ ఘటనలో 130 మందికి పైగా అమాయక పౌరులు చనిపోవడం బాధాకరం. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం అంతమంది ప్రాణాలను బలిగొన్నది. ఇది బీజేపీ పాలనా వైఫల్యానికి అద్దం పడుతున్నది.
స్థానిక పాలనకు జిల్లా మెజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సారథ్యం వహిస్తారు. ప్రజా పనుల విభాగం సీనియర్ ఇంజినీర్లు, పురపాలక సిబ్బంది మోర్బీ వంతెన కూలడానికి కారణమయ్యారు. ఇంత జరిగినా బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. వారిలో కొద్ది మందినే విధులను సరిగా నిర్వర్తించలేదనే కారణంతో అరెస్టు చేశారు. గతంలో ప్రైవేటు పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోయినప్పుడు ఆ పరిశ్రమల యజమానులపై ప్రభు త్వం చర్యలు తీసుకున్నది. కానీ మోర్బీ దుర్ఘటనలో కేవలం ఆ వంతెనకు మరమ్మతులు చేసిన ప్రైవేటు కాంట్రాక్టర్‌పైనే చర్యలు తీసుకుంటే సరిపోదు. ప్రజా సేవకులైన అధికారుల నేరపూరిత నిర్లక్ష్యం ఎంతోమంది మరణానికి కారణమైనప్పుడు, వారిపట్ల ప్రభుత్వం ఎం దుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది?
చట్టం ప్రకారం అన్ని వంతెనలు, పబ్లిక్ రహదారులు రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు. వాటిని ప్రభుత్వం పటిష్ఠంగా ఉంచి వాటివల్ల ప్రజలకు ఎలాంటి హాని జరుగకుండా చూడాలి. నిర్లక్ష్యం వల్ల సంభవించిన దుర్ఘటన కేసుల్లో అనేక మందిని నిందితులుగా చేర్చే అవకాశం ఉండొచ్చు. కానీ ఆ నిర్లక్ష్యం ఎవరి పర్యవేక్షణలో జరిగిందనేది కూడా ముఖ్యమే. ఆ నిర్లక్ష్యానికి కారణమైన యంత్రాంగానికి సంబంధించిన సమంజసమైన ఆధారం కూడా అవసరమే. ఈ న్యాయసూత్రం పౌరులు చేసిన తప్పులకూ వర్తిస్తుంది. వారు ప్రమాదవశాత్తు చేసినా లేదా కావాలనే చేసినా జరిగే నష్టాలకు వారిని బాధ్యులుగా చేస్తుంది. ఈ న్యాయ సూత్రాన్ని మోర్బీ లాంటి దుర్ఘటనల్లో అమలు చేయడం వల్ల వేగంగా నేర బాధ్యతను బాధ్యులపై మోపే అవకాశం ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు నిరక్ష్యంగా ప్రవర్తించడం వలనే మోర్బీ ఘటన చోటుచేసుకున్నది. రాజులు (పాలకులు) తప్పు చేయరనే పాతకాలం నాటి వాదనలకు కాలం చెల్లింది. ఆధునిక ప్రజాస్వామ్యంలో అలాంటి నీతులు చట్టం, న్యాయం ముందు నిలబడవు. చట్టంలో అందరికీ నిర్దిష్టమైన బాధ్యతలు పేర్కొని ఉంటాయి. వాస్తవానికి ఆ వంతెన చాలా పాతది. ఇటీవలే దానికి మరమ్మతులు చేసి తిరిగి ప్రారంభించారు. అయితే ఈ వంతెన నిర్వహణను సివిల్, పోలీస్ అధికారులు మరింత అప్రమత్తంగా పర్యవేక్షించి ఉండాల్సింది. ఈ దుర్ఘటన జరిగినప్పుడు వంతెన సామర్థ్యానికి మించి దాని మీద 400 మంది ఉన్నమాట వాస్తవమే. అలాంటప్పుడు జిల్లా మెజిస్ట్రేట్ ఈ ప్రమాదాన్ని నివారించడానికి ఎందుకు ప్రత్యామ్నాయం ఆలోచించలేదు? అంత మంది జనం వంతెన పైకి ప్రవేశించకుండా పోలీసు బందోబస్తును జిల్లా ఎస్పీ ఎందుకు పహారా ఉంచలేదు? వంతెన పునః ప్రారంభాన్ని నిరోధించడానికి పీడబ్ల్యూడీ ఇంజినీర్ లేదా పురపాలకం సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదు?
‘డబుల్ ఇంజిన్ సర్కార్’ గురించి గొప్ప లకు పోయింది. గుజరాత్ ప్రభుత్వం కొన్నేండ్లుగా సమరులు, నిజాయితీపరులైన సివిల్, పోలీసు అధికారులను పక్కకు తప్పించి రాజకీయ పలుకుబడి కలిగిన అధికారులను అందలమెక్కించింది. దీంతో మోర్బీ ఘటన చోటుచేసుకున్నదనే వాదనలూ ఉన్నాయి. 2014 నుంచి రాష్ట్రంలో మంత్రి మండలిని తొలగించడం, ముఖ్యమంత్రులను మార్చడం లాంటివి ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా సాగుతున్నాయి.
అవినీతి, లంచాల ఆరోపణల నేపథ్యంలో నాటి ప్రధాని మన్మోహన్సింగ్ను రాజీనామా చేయాలని 2013 మే 13న బీజేపీ డిమాండ్ చేసింది. కోల్‌కతాలో ఒక ఫ్లై ఓవర్ కుప్ప కూలి 21 మంది అమాయకులు చనిపోయినప్పుడు ప్రధాని మోదీ ఆ ఘటనను ‘దేవుడి సందేశం’గా అభివర్ణించి అధికారపక్షం నుంచి రాష్ర్టా న్ని రక్షించుకోమని బెంగాలీలకు పిలుపునిచ్చారు. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో మోర్బీ విషాదాన్ని కూడా ‘భగవంతుడి సందేశం’గా పరిగణించాలా? ఒక రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి దివంగత లాల్ బహదూర్‌శాస్త్రి రైల్వేశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. విమానం కూలిపోయిన ఘటనకు బాధ్యత వహించి దివంగత మాధవరావు సింధియా కూడా శాస్త్రీజీ విధానాన్నే అనుసరించారు. బాధితులకు, వారి కుటుంబీకులకు పరిహారం ఇవ్వడంతోనే సమస్య తీరిపోదు. అధికారంలో ఉన్నవారు తమ వైఫల్యానికి బాధ్యత వహించే ఆ పరిహారం అందిస్తారు. వాస్తవానికి ఏ నష్ట పరిహారమూ బాధితులకు సాంత్వన చేకూర్చదు. ‘ప్రభుత్వమే పూర్తి బాధ్య త తీసుకుంటుంది’ అని గుజరాత్ మంత్రి ప్రకటించడం చాలా చిన్న చర్యే.
ఈ ఘటనపై ఒక కమిటీ లేదా కమిషన్‌ను నియమించడం, విచారణను ఆలస్యం చేసి అటకెక్కించడానికే. తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకొనే బీజేపీ మోర్బీ ఘటనలో భిన్నంగానే ప్రవర్తించాలి. అభివృద్ధిలో ఇతర రాష్ర్టాల కంటే వెనకబడిన గుజరాత్‌కు ఇప్పుడు పెట్టుబడులు, అభివృద్ధి అవసరం. అన్నింటి కంటే ముఖ్యం గా ఆ రాష్ర్టానికి మంచి పరిపాలన అవసరం.
‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో..
గుజరాత్‌కు చెందిన ప్రధాని, కేంద్ర హోంమంత్రి అధికారిక, అనధికారిక కార్యక్రమాల సందర్భంగా రాష్ర్టానికి వచ్చినప్పుడు రాష్ట్ర అధికార యంత్రాగం మొత్తం వారిముందు హాజరవుతున్నది. రాష్ర్టాన్ని సందర్శించిన నాయకుల కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో పోలీసులను వినియోగించినప్పుడు, మోర్బీ లాంటి దుర్ఘటనలను నివారించడానికి ప్రభుత్వం కొంత ఎక్కువ మంది పోలీసులను కేటాయించలేదా?
దుశ్యంత్ దవే (సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది)