Mahalakshmi Scheme | మా ఊరు కర్విరాల కొత్తగూడెం. తాటివనం మధ్య నుంచి రోడ్డు. తాటివనం దాటి ఫర్లాంగు పోతే లింగమంతుల సామి పెద్దగుట్ట. పెద్దగుట్ట అంచుకే.. ‘బహుజనుడా..! నిలబడు.. పోరాడు’ అని చెప్తున్నట్టు మారోజు వీరుని ధ్వజ స్థూపం. ఒత్తా.. పోతా దేవున్ని ఏమో..! గానీ వీరున్ని స్మరించందే బాటసాగం. బాట సాగటం అంటే జీవన సంచారం. చలనశీల జగత్తులో నిత్య కదలికే సంచారం. బైరాగిది గాన సంచారం.. విద్యార్థిది జ్ఞాన సంచారం. విప్లవకారునిది పోరు సంచారమైతే.. సగటు మనిషిది బతుకు సంచారం. ఎన్కటికి ఊరు నుంచి చెరువు దిక్కు గమనం ఉండేది. పొద్దంతా కాయకష్టం చేసుకొని, పొద్దుగూకి తాటివనం తట్టేది.
ఇప్పటి ప్రస్థానమంతా పల్లె నుంచి పట్నానికే. పట్నంతోనే బతుకు పరుగు. పరుగులు పెట్టే జనాన్ని మలుపుకోవటానికి ‘బస్సుల్లో ప్రయాణం సురక్షితం-శుభప్రదం’ అనే నినాదం అందుకున్నది ఆర్టీసీ. జనం కోరుకున్నట్టుగా బస్సు నడిచింది. నొప్పులొచ్చిన తల్లికి అంబులెన్స్ అయి దవాఖానకు చేర్చింది. ఆపద మీద ఉన్నప్పుడు అదునుకు గమ్యాన్ని తాకింది. చెయ్యెత్తిన చోట బస్సు ఆగింది. కోరిన చోట దించింది. అట్లా ఎక్కేటోళ్లు.. దిగేటోళ్లతో బస్సు కళకళలాడింది.
స్వరాష్ట్రం సిద్ధించి కొలువుకొచ్చిన కేసీఆర్ దశబంధ చెరువులను నింపి సాగుకు జీవం పోసిండు. కూరగాయల తట్టలు.. ఆకుకూరల కట్టలు.. పండ్ల బుట్టలతో పల్లె తెల్లారేది. ఎవుసం వర్తకం స్థాయికి ఎదిగింది. పల్లె పంటను పట్టణం రైతు బజారుతో ‘పల్లె వెలుగు’ బస్సులు అనుసంధానించారు. కోడి కూతతోనే ఊరు నుంచి బస్సు బైలెల్లితే.. వెలుగు రేఖలు పొడిచే యాళ్లకు బస్తీ చేరేది. నిగనిగలాడే రైతు వర్తకాలను జనం ముందు దించేది. అటు పట్నంలోనైనా, ఇటు పల్లెల్లోనైనా పదేండ్లుగా సాఫీ జీవనమే. అయినా మనసెందుకో కొత్త నీరు కోరింది.
ఓట్ల పండుగొచ్చింది. బతుకపోయినోళ్లందరం బండ్లు కట్టుకొని పట్నం నుంచి పల్లెకొచ్చి ఒట్లేసినం. సీట్లిచ్చినం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డొచ్చి, ‘మహాలక్ష్మి’ పథకం పెట్టిండు. ఆడోళ్లంత ఉత్తగనే బస్సెక్కొచ్చన్నడు. అంతా బాగానే ఉన్నట్టనిపిచ్చింది. పొద్దు పొడిచినట్టు.. మబ్బులు చెదిరినట్టు.. మంచేదో జరగబోతున్నట్టు.. మనసు మంచి ఊహల మీదుంది. వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని ‘సంచారమే ఎంతో బాగున్నది.. దీనంత ఆనందమేమున్నది’ అని నిత్య సంచారికి ధీటుగా మహిళా ‘తిరుగు’బాటు జరుగుతదని పొంగిపోయినం. తీరా..! దినం గడుస్తున్న కొద్దీ భ్రమలు కరిగి పోతున్నయి. బస్సంటే భయం పట్టుకుంది. టికెట్ల ఇక్కట్లు లేవు గానీ రాకట్ల.. పోకట్ల.. అన్ని తాకట్లే. హేతువుకు అందకుండా.. తార్కికతకు తావులేకుండా.. మైసమ్మ, పోచమ్మ తల్లుల బలికి గొర్రె జీవాలను తోలుకుపోయినట్టుగా బస్సుల్లో జనాలను జారగొడుతున్నరు. 49 సీట్ల సామర్థ్యం ఉన్న బస్సుల్ల 200 మంది వేలాడుతున్నరు. ఫుట్‌బోర్డులు, అద్దాలు, కిటికీలు పట్టుకొని వేలాడుతూ స్కూలు పిల్లలు, కాలేజీ విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులు నిత్యం మృత్యు ప్రయాణం చేస్తున్నరు. బ్రేక్ వేస్తే జారి టైర్ల కింద పడే ప్రయాణం సాగుతున్నది. మృత్యువు ఎటు దిక్కు నుంచి పొంచి కాటేస్తుందో తెలియని అగమ్యగోచర ప్రయాణమైంది. ఈ మధ్య లోతుకుంట వద్ద కిక్కిరిసిన బస్సులో ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేస్తూ ఓ మహిళ అదుపు తప్పి పడిపోయింది. సుశిక్షితులైన డ్రైవర్లు ఉండటం ఆర్టీసీకి ఓ వరం. వాళ్ల అప్రమత్తతతో ఇప్పటికైతే పెద్ద ప్రమాదాలేవీ జరుగలేదు.
సీటు కోసం సిగపట్లు.. చోటు కోసం అగచాట్లు.. అరుపులు.. కేకలతో బస్సు బైలెల్లుతున్నది. కండబలం ఉండి, ఒంట్లో సత్తువ ఉన్న వాళ్లదే బస్సు. ముసలి, ముతక, దివ్యాంగులకు సీటు కాదు చోటే లేదు. అడిగిన చోట దించటం లేదు. చెయ్యెత్తితే ఆపేది లేదు. అడిగిన చోట బస్సు ఆపలేదని హైదరాబాద్ శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన ఓ మహిళ.. కండక్టర్ చెంప చెల్లుమనిపించింది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో చెయ్యెత్తి బస్సు ఆపాలని కోరినా.. ఆపకుండా వెళ్లిపోతున్నరని మహిళా టీచర్లు మంచిర్యాల డిపో మేనేజర్ రవీంద్రనాథ్‌కు ఫిర్యాదు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ స్టేజీ వద్ద దిగేందుకు ఓ యువతి బస్సు ఆపాలని కోరింది. బస్సు ఆపలేదు. ఆటోలో బస్సును వెంబడించిన ఆమె బంధువులు వెంకట్రావుపేట స్టేజీ వద్ద బస్సును ఓవర్టేక్ చేసి, డ్రైవర్‌పై దాడి చేశారు. ఇటువంటి సంఘటనలు నిత్యకృత్యం. దీన్ని ప్రజాపాలన దిశగా ముందడుగు అని ప్రభుత్వం గొప్పగా చాటింపేసింది. ‘మహాలక్ష్మి’ పథకం కింద 60 రోజుల్లో 15.21 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసినట్టు చెప్పుకొన్నది. 550 కోట్లు మహిళలకు మిగిలినట్టు లెక్కగట్టింది. ఆర్టీసీకి 10,460 బస్సులుండగా, ఇందులో 3,508 పల్లెవెలుగు బస్సులు. ఇంకో 3,500 ఎక్స్‌ప్రెస్ బస్సులు. ఇవి 36,593 రూట్లలో నడుస్తున్నయి. 60 రోజులకు మొత్తం సామర్థ్యం ప్రకారం.. 10.5 కోట్లు మంది ప్రయాణిస్తారని అంచనా. కానీ, మహిళలే 15.21 కోట్ల మంది ప్రయాణించిండ్రు. అంటే..! ఒక్క బస్సులో ఎంత మంది ఎక్కి ఉంటారో ఊహించవచ్చు. 49 మంది పట్టే ఒక బస్సులో సగటున 150కి పైగా కిక్కిరిసి పోతున్నరు. దీన్ని ప్రజా పాలన దిశగా ముందడుగుగా అభివర్ణించడం చూస్తుంటే.. భవిష్యత్తు బస్సు గమనం, గమ్యం కండ్ల ముందు కనిపిస్తున్నది.
ఆర్టీసీ ప్రయాణం ఇప్పుడు సురక్షితం కాదు- శుభప్రదమూ కాదు. బస్సంటే ఓ నిరీక్షణ. అక్కరకు రాని అతేర. ఎదిగిన పోరలను కాలేజీకి పంపిస్తే బస్సుకు వేలాడుతూ పోతున్నరు. బస్సెక్కిన పోరలు క్షేమంగా ఇంటికి తిరిగొస్తరో.. లేదోనని తల్లిదండ్రుల గుండెల్లో గుబులు పట్టుకున్నది. ప్రగతి రథచక్రాలే మృత్యుశకటాలుగా రోడ్ల మీద తిరుగుతుంటే..! గుండెల్లో దడ పుడుతున్నది. ఈ ‘మహాలక్ష్మి’ ఏ ఇంటి దీపం ఆర్పుతుందోనని ఆందోళన పడుతున్నరు.