
‘నా ప్రాంతంలోని ప్రజా జీవితాన్ని నా సహజమైన భాషలో చెప్పడం నా బాధ్యత. అందులో గొప్ప సంతృప్తి ఉంది. సాంస్కృతిక ప్రాధాన్యం ఉంది’ అంటారు డాక్టర్ దేవరాజు మహారాజు. ఒకవైపు పిల్లల కోసం రాస్తూనే, మరోవైపు సమాంతర సినిమాను విశ్లేషించారు. అనువాదంలో ఒక సంస్థ చేయాల్సిన పనిని తానొక్కరే చేసి చూపారు. జువాలజీ ప్రొఫెసర్గా వృక్ష పరాన్నజీవులపై పరిశోధనలు చేస్తూ, విద్యార్థులకు 25 ఏండ్లుగా మార్గదర్శకత్వం నెరిపారు. తెలుగు వచన కవిత్వంలో తెలంగాణ మాండలికాన్ని ప్రవేశపెట్టడం, తెలంగాణ మాండలికంలో తొలి కథల సంపుటి ప్రకటించడం ఆయన చేసిన సుదీర్ఘ సాహితీకృషిలో ఒక భాగం. ఈ ఏడాది దేవులపల్లి రామానుజరావు అవార్డును డాక్టర్ దేవరాజు మహారాజు స్వీకరిస్తున్న సందర్భంగా.. ఆయనతో జరిపిన అభినందన సంభాషణం..
ప్ర: తెలుగు వచన కవిత్వంలో తెలంగాణ మాండలికాన్ని ప్రవేశపెట్టి, విస్తృత ప్రచారం తెచ్చిన కవిగా ప్రజల భాషలో మీరు కవిత్వం రాయడం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది?
జ: బీఎస్సీ విద్యార్థిగా ఉన్నప్పుడే కవిత్వం రాయటం ప్రారంభించాను. అప్పట్లోనే (1969-70లో) ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి రచయితల సంఘం (ఉవివిర సం)ఏర్పడింది. ఆ సంఘం కార్యదర్శి అడపా రామారావు గారు నన్నో యువకవి సమ్మేళనానికి తీసుకుపోయారు. నేను బితుకుబితుకుమనుకుంటూ చదివిన ‘బతుకు కొన’ కవిత ఎన్నో ప్రశంసలందుకుంది. ‘ఉవివిరసం’ నన్ను తమ ట్రంప్కార్డ్గా చెప్పుకొంది. జానపద సాహిత్యంపై నేను రాసిన వ్యాసాలను భారతి (1971లో) ప్రచురించింది. 19 ఏండ్ల వయసులో దివాకర్ల వెంకటావధాని వంటి పండితుల పక్కన పేరు చూసుకోడం ఏనుగెక్కినంత సంబరంగా ఉండేది. జానపద సాహిత్యాన్ని విశ్లేషిస్తూ ఉండటం వల్ల ప్రజల భాషలో వచన కవిత రాయగలగడానికి ఎంతో దోహదం చేసింది.
ప్ర: మీ పేరు మహారాజు. మీ తొలి కవితా సంపుటి ‘గుడిసె గుండె’. మీకు అలాంటి శీర్షిక ఎందుకు, ఎలా తోచింది?
జ: మహారాజై ఉండి గుడిసె కవిత్వం రాయటమేమిటని చాలామంది నాడే అన్నారు. నా పేరు అలా ఉండటానికి మా తాతగారు కారణం. నా దృక్పథం ఇలా ఉండటానికి నేను పుట్టి పెరిగిన పరిస్థితులు కారణం. అలాంటి శీర్షిక ఎందుకు తోచిందంటే నేను ప్రగతిశీల దృక్పథంతో రచన లు చేస్తున్నవాణ్ణి గనక. అణచివేతను నిరసించినవాణ్ణి గనక.. అలాంటి శీర్షిక ఎన్నుకోగలిగాను.
ప్ర: జంతుశాస్త్ర పరిశోధనల్లో ఉండి.., ‘బయిరూపులోల్లం’ వంటి శక్తివంతమైన కవిత ఎలా రాయగలిగారు?
జ: చదువులో, ఆ తర్వాత పరిశోధనలో పడి చాలాకాలం మాండలిక కవిత రాయలేదు. ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్’ ప్రాజెక్టులో పనిచేస్తూ మట్టి శాంపిల్స్ కోసం తెలంగాణలో ఊరూరూ తిరిగాను. రైతులతో కూలీనాలీ జనంతో కలిసి తిరగాల్సి వచ్చేది. జన జీవితాన్ని చదవడం, పుస్తకాలను చదవడం కంటే ఎన్నో రెట్లు ఇష్టంగా ఉండేది. వృక్ష పరాన్నజీవులపై రాసిన నా పరిశోధన గ్రంథాన్ని సాంఘిక పరాన్న జీవులకు బలవుతున్న పేద రైతాంగానికి అంకితమిచ్చాను. 1986లో ఆకాశవాణి కవి సమ్మేళనం కోసం నేను ‘బయిరూపులోల్లం’ రాశాను. తొలిసారి ఆ కవితను అనంతపురంలో చదివినప్పుడు శ్రోతల స్పంద న నన్ను పులకింపజేసింది. సభలో నా పక్కనే ఉన్న మహాకవి దాశరథి అమాంతం కౌగిలించుకొని అభినందించారు. మరోసారి రంజని రజతోత్సవాల సందర్భంగా అజంతా అంతే చేశారు. ఇంగ్లీషులోకి పోవాలండీ ఈ కవిత అన్నారు. అప్పటికే ఆ కవిత నాలుగైదు భారతీయ భాషల్లోకి పోయింది. చాలాచోట్ల ఏకపాత్రాభినయంగా రంగస్థలం మీద ప్రదర్శించబడింది.
ప్ర: సులభంగా అర్థమయ్యేది కవిత్వం కాదనీ, అర్థం కానిది గొప్ప కవిత్వమని ఒక అభిప్రాయముంది. దానికి మీరేమంటారు?
జ: అలాంటి అభిప్రాయం ఏర్పడటం బాధాకరం. బిడ్డ బాధ తల్లికి, తల్లి బాధ బిడ్డకు సులభంగా అర్థమవుతుంది గనక, వారి మధ్య గల సంబంధం గొప్పది కాదని తేల్చి చెప్పినట్టుగా ఉంటుంది. కవిత్వం అనేక రకాలుగా ఉంటుందని తెలుసుకున్నవాళ్లకు ఇలాంటి అభిప్రాయం కలగదు. కవిత్వం సరళంగా ఉంటూనే ఆలోచనలు రేకెత్తించొచ్చు. గాఢంగా ఉంటూ గొప్ప అనుభూతినివ్వొచ్చు. ప్రజల భాషలో వచ్చే కవిత్వం మాత్రం ఎప్పుడూ స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా, మోటుగా, నిజాయితీగా వస్తుంది. ఎవరు కాదన్నా, దాని గొప్పతనం దానికి ఉండనే ఉంది.
ప్ర: టీనేజీలో మాండలిక కవిత రాయడం ప్రారంభించారు కదా? ఆనాటి ప్రముఖ కవులు ఎలా స్పందించారు?
జ: వచన కవిత తెలంగాణ మాండలికంలో కూడా రావటం కుందుర్తి గారికి, శీలా వీర్రాజు గారికి సంతోషం కలిగించింది. ‘ఉవివిరసం’ వార్షిక సంచిక జ్యోత్స్న(1970-71)లో నా కవిత ‘ఉగాదుర్కొచ్చింది’ అచ్చయ్యింది.
ఆ తర్వాత నేను ఏ కవి సమ్మేళనంలో పాల్గొన్నా ఆ కవిత కావాలని శ్రోతలు అడిగేవారు. ఒక ప్రామిసింగ్ పోయెట్ కనిపిస్తున్నాడని అభినందించారు ఆరుద్ర. You are fulfilling the expectations of all the down trodden people అని రాశారు శ్రీశ్రీ. ‘జానపద సాహిత్య సింహాసనానికి మరో యువరాజు’
శీర్షికన ఒక వారపత్రికలో కవి మిత్రులు సుధామ పరిచయ వ్యాసం రాశారు.
(ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని
సారస్వత పరిషత్ హాలులో అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది)