తెలంగాణలో శాతవాహనులు, విష్ణుకుండినుల అనంతరం నల్లగొండ, మహబూబ్నగర్ ప్రాంతాలను పరిపాలించిన రాజవంశీయులు కందూరిచోడులు. చాళుక్యులకు సామంతులుగా ఉన్న వీరు నల్లగొండ ప్రాంతాన్ని సమర్థంగా పాలించారు. కాకతీయులకు సమకాలికులు. నకిరేకల్లు తాలూకాలో ఉన్న ఒల్లాల గ్రామంలో కందూరిచోడులకు సంబంధించిన శాసనం లభించింది.
ఇది కందూరి మల్లికార్జునదేవ చోడమహారాజు కాలంలో వేయించినట్టిది. శాసనకాలం శక సంవత్సరం.1020= క్రీ.శ.1098, ఈశ్వర సంవత్సర జ్యేష్ట శుద్ధపంచమి ఆదివారం.
122 పంక్తుల్లో ఉన్న ఒల్లాల శాసనం రెండు వైపుల సంస్కృతంలో, మూడవ వైపు తెలుగులో ఉన్నది. కందూరి మల్లికార్జున చోడ మహారాజు మంత్రి గుండన. అతని సామర్థ్యానికి మెచ్చి మహారాజు ఒల్లాల గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చి శాస నం వేయించాడు. ఇంకా ఛత్ర చామరాలు, గజాన్ని కూడా ఇచ్చినట్లు తెలుస్తున్నది.
మల్లికార్జున చోడ మహారాజు ఆమనికంటి 70లోని ఒల్లాల గొలపతి (కులపతి) అయిన అప్పన పెగ్గడ్లు ప్రతిష్ఠించిన కేశవ దేవుని పూజా ద్రవ్యాలకు, నైవేద్యాలకు కేశవదేవుని హబిర్బలి అర్చనలకు నాకంపనములోని యెణ్డపల్లి పొలంలో ఊరి ఆగ్నేయంలో ఒల్లాల పొలిమేరలో ముప్ఫై పుట్లు పండే రేగడి భూమిని దేవభోగంగా ధారాపూర్వకంగా సమర్పించాడు. అదేవిధంగా ఒల్లాల పడమటి చెరువు వెనుక నాలుగు మర్తుర్లు నీరునేల, దక్షిణం వైపుగల భూమి ఆరు మర్తుర్లు, ఆలయం వద్ద రెండు మర్త ర్ల తోటభూమిని ఇచ్చి నట్లు ఈ శాసనం తెలుపుతున్నది.
స్వయంగా అప్పన ప్రెగ్గడ తాను ప్రతిష్ఠించిన కేశవ దేవునికి దీపం నిలిపి దానికై 50 గొర్రెలు, అతని భార్య అబ్బమ దీపం నిలిపి అం దుకై 50 గొర్రెలు సమర్పించారు. బ్రహ్మబోయిని కొడుకు కాపనబోయుండు ఈ 100 గొర్రెలను గ్రహించి స్వామి రెండు దీపాల నిర్వహణకు నిత్యము రెండు మానికల నేయి సమర్పించాలి. ఈ 100 గొర్రెలు ఇనుప ఎడ్లయి (ఆవులు) ఎల్లకాలం ఉం డాలని శాసనంలో చెప్పబడింది.
ఈ శాసనంలో కందూరి చోడుల వంశక్రమం, గుండనమంత్రి వంశ వర్ణనము ఉన్నది. కందూరిచోడులు పానుగంటి పుర వరాధీశ్వరులుగా
చెప్పబడినారు. శాసనంలో కందూరి వంశంలోని మొదటి రాజుల గురించి తెలుపబడింది.
ఇతని మంత్రి గుండన వంశ క్రమం కూడా వివరం గా పేర్కొనబడింది. వేంగీ మండలంలో అంతర్భాగమైన అగ్రహారాన్ని త్రిణయన పల్లవునిచే పొందిన ఒక బ్రాహ్మ ణ వంశంలో జన్మించినవాడు గుండన మంత్రి. క్రిష్ణ, అప్పన, మేడ అనేవారు గుండనమంత్రి తనయులు. అప్పన రాజనీతిజ్ఞుడు. తం డ్రి గుండన, కొడుకు అప్పనలు ఇద్దరూ మల్లికార్జున మహారాజు వద్ద మంత్రిత్వ ము నెరపినట్లు ఈ శాసనం వల్ల స్పష్టం అవుతున్నది.