జీవితబీమా తప్పనిసరి అనే భావన స్థిరపడిపోయిన రోజులివి. అందుకే ఇప్పుడు బీమా అనేది బిగ్ బిజినెస్ జాబితాలోకి చేరిపోయింది. ఆర్థిక సరళీకరణలు వచ్చేవరకూ బీమా రంగంలో భారతీయ జీవిత బీమా (ఎల్ఐసీ) సంస్థ ఏకచ్ఛత్రాధిపత్యం చెలాయించేది. 2000 సంవత్సరంలో ప్రైవేటు కంపెనీలను బీమాలోకి అనుమతించడంతో ఇబ్బడిముబ్బడిగా కంపెనీలు వచ్చాయి. అయినా ఎల్ఐసీదే అగ్ర స్థానం. ప్రభుత్వానికి ఎల్ఐసీ భారీగా డివిడెండ్లు, లాభాలు చెల్లించడమే కాకుండా రుణ నిర్వహణలోనూ తోడ్పడుతుంది. ఇది సంస్థ పట్ల ప్రజల నమ్మకానికి అద్దంపట్టే సంగతి.
కానీ, ఇప్పుడు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ బంగారు బాతును తమ ప్రియతమ వాణిజ్యవేత్త అదానీ సేవకు వినియోగిస్తున్నది. పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ సంస్థలోకి ప్రైవేటు పెట్టుబడులను అనుమతించడం ఒక ఎత్తయితే ఇప్పుడు సంస్థ పెట్టుబడులను ప్రైవేటు కంపెనీ చేతుల్లో పెట్టడం మరొకెత్తు. అదానీ పోర్టు కంపెనీ ఇటీవల జారీచేసిన రూ.5,000 కోట్ల బాండ్లను గుండుగుత్తగా ఎల్ఐసీ కొనుగోలు చేయడంపై మార్కెట్లో దుమారం చెలరేగింది. ప్రభుత్వ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోదీ ప్రభుత్వం ఎల్ఐసీ మెడలు వంచి అదానీకి నిధులు సమకూర్చడం ఇప్పుడు బహిరంగ రహస్యమే.
ఒక ప్రైవేటు కంపెనీలో భారీస్థాయిలో ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టడం ఒక్కటే సమస్య కాదు. అంతర్జాతీయ ఆర్థిక నిఘాసంస్థల శల్య పరీక్షలు, భారీ రుణభారంతో అదానీ గ్రూప్ డోలాయమానంలో పడినప్పుడు ఈ స్థాయిలో పెట్టుబడి పెట్టడం ఏమిటనేది అసలు ప్రశ్న. అదానీ గ్రూప్ ఇంత భారీ స్థాయిలో ఇష్యూ చేయడం ఇదే మొదటిసారి అనేది గుర్తుంచుకోవాల్సిన సంగతి. ఆ బాండ్లను కొనుగోలు చేసేందుకు సంస్థాగత పెట్టుబడిదారులెవరూ ముందుకురాని ప్రతికూల పరిస్థితుల్లో ఈ నిధులను బాండ్ల పేరిట మళ్లించడం గమనార్హం.
ఇది పెట్టుబడి నిర్ణయంగా కాకుండా సమస్యల సుడిగుండంలో ఉన్న సంస్థను బయటపడేసేందుకు అందిస్తున్న ఆపన్నహస్తంగా కనిపిస్తున్నది. ఇంకా సూటిగా చెప్పాలంటే ఎల్ఐసీ లోగోలోని రెండు చేతుల మధ్య ప్రాణదీపాన్ని తీసేసి అదానీ గ్రూపును పెట్టడం తప్ప మరోటి కాదు. ఎవరూ నమ్మని సంస్థను ఎల్ఐసీ మాత్రం ఎందుకు గుడ్డిగా నమ్మాలి?
అదానీ గ్రూపులో ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. ఈ సరికే అవి రూ.60 వేల కోట్లు దాటాయి. ఇప్పుడు మరో విడత నిధులు అందిస్తున్నారు. అదానీ గ్రూప్ బాండ్లకు చెల్లించబోయే 7.7 శాతం వడ్డీ మహా ఎక్కువ అన్నట్టుగా ఎల్ఐసీ అధికారులు సెలవిస్తున్నారు. రిస్క్‌తో రాబడి సరిపోలడం లేదనేదనేది మార్కెట్ విశ్లేషణ.
రేపు అదానీ గ్రూపు అప్పుల భారం కింద నలిగిపోతే బీమా పాలసీదారుల నష్టాలకు ఎవరు జవాబు చెప్తారు? బీజేపీ ఒక పథకం ప్రకారం ప్రజల సంపదను అడ్డూఅదుపూ లేకుండా ప్రైవేటు జేబుల్లో పెడుతున్నదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఎల్ఐసీ భారత ప్రజల సంస్థ. అందులో ఉండేది ప్రజల సొమ్ము. దానిని ప్రమాదకరమైన రీతిలో ప్రైవేటుపరం చేయడం ఏ మాత్రం భావ్యం కాదు. కార్పొరేట్లకు కొమ్ముకాసే బీజేపీ పాలనలో ఎల్ఐసీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ అదానీ గ్రూప్‌నకు ఏటీఎంగా మారడం విచారకరం.