రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను జీరో ఎన్రోల్మెంట్ (వివిధ కారణాలు) వల్ల 1,441 పాఠశాలలు తాత్కాలికంగా మూసివేయబడినాయి. దేశవ్యాప్తంగా జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు అత్యధికంగా ఉన్న రాష్ర్టాల్లో మన తెలంగాణ టాప్‌లో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రకటించింది. పార్లమెంట్ సాక్షిగా అపఖ్యాతి పాలైన తెలంగాణ, ఆ అవమానం నుంచి బయటపడేందుకు గాను ఆ స్కూళ్లనే మూసివేయాలని నిర్ణయం తీసుకోవడం విడ్డూరం.
పాఠశాలల పనితీరు గ్రేడింగ్ సూచికలో జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలు ఎక్కువగా ఉంటే స్కోర్ తగ్గుతుందని, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) నివేదికలో చూపొద్దని కూడా విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. 2024-25 విద్యా సంవత్సరం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2,245 జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలున్నాయి. వాటి ల్లో 1,441 చోట్ల పిల్లలు లేరు. టీచర్ల పోస్టులు లేవు. మరో 600 పాఠశాల ల్లో విద్యార్థులు లేరు కానీ, టీచర్ పోస్టులున్నాయి. అందుకే, ఈ 1,441 ప్రభుత్వ బడులను తాత్కాలికంగా మూసివేయనున్నారు. సర్కార్ బడుల ను మూసివేయడమే కాదు, వాటిలోని ఫర్నీచర్‌ను సమీప అంగన్వాడీ కేం ద్రాలు ఉపయోగించుకునేలా విద్యాశాఖ ఆదేశాలివ్వడం గమనార్హం.
రాష్ట్రంలో అప్పర్ ప్రైమరీ స్కూళ్లు కూడా మూసివేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏకంగా 3,144 స్కూళ్లు కనుమరుగు కాబోతున్నాయి. ఈ స్కూళ్లను సమీప బడుల్లో విలీనం చేసే అంశంపై ఏడాది కింద నిర్వహించిన విద్యా సంస్కరణ అంశంపై క్యాబినెట్లో చర్చించి ఆ బడుల విలీనంపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వం అధికారులను అదేశించింది. అంటే, ఇటు 2 వేల జీరో ఎన్రోల్మెంట్ బడులు, అటు అప్పర్ ప్రైమరీ స్కూళ్లు మొత్తం కలిపి 5 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు కాలగర్భంలో కలిసిపోనున్నాయన్న మాట. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సైతం ఈసారి తగ్గింది. 2025-26 విద్యా సంవత్సరంలో పిల్లల సంఖ్య పెంచాలని విద్యాశాఖ చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా, గతేడాది కంటే విద్యార్థుల సంఖ్య ఈయేడు తగ్గడం గమనార్హం. 2023-24లో విద్యార్థుల సంఖ్య 18.06 లక్షలు ఉండగా, 2024-25 నాటికి ఆ సంఖ్య 1.28 లక్షలు తగ్గి 16.78 లక్షలకు చేరుకున్నది.
భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ఏ ప్రకారం.. ప్రభుత్వం తాను శాసనం ద్వారా నిర్ణయించిన రీతిలో 6 నుంచి 14 ఏండ్ల వయస్సు కలిగిన బాలబాలికలందరికీ ఉచితంగా, నిర్బంధంగా విద్యను అందించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఈ హక్కును ప్రజలు అడగవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తూ పోతే పేదవానికి విద్య దూరమయ్యే పరిస్థితి భవిష్యత్తులో నెలకొంటుంది. ఫీజు కట్టగలిగే స్తోమత ఉన్నవాడు తన పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించుకుంటాడు, మరి పేద పిల్లల పరిస్థితి ఏమిటి?
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులను, బోధనా సామగ్రిని, మౌలిక వసతులను కల్పించలేకపోవడం, సరిపడా బడ్జెట్ కేటాయించకపోవడం వల్లనే ప్రభుత్వ బడులు మూసివేత దశకు చేరుకుంటున్నాయి. ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించే పర్యవేక్షణాధికారులు లేకపోవడం కూడా కొన్ని ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్తున్నారు. దిగువ మధ్యతరగతి ప్రజలు సైతం అప్పులు తెచ్చి మరీ తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తున్నారు. ఈ ఆధునిక పోకడ కనుమరుగై, ప్రభుత్వ బడులకు మళ్లీ మహర్దశ రావాలంటే నాణ్యమైన విద్యను ప్రజలకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. గతంలో విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి పిల్లవానికి అందుబాటు దూరంలో ప్రభుత్వ బడులుండాలి. కానీ, వాటిని గ్రామాల్లో మారుమూలన నెలకొల్పారు. నేటి బడుల మూసివేతకు ఇది కూడా ప్రధాన కారణమే.
ప్రభుత్వ బడుల్లో చేరికలు తగ్గిపోతున్నాయి. కానీ, వేలకు వేలు ధారపోసి చదువును కొనలేని పేద, బడుగు బలహీనవర్గాల పిల్లలకు ప్రభుత్వ బడులే ఆశా దీపాలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సర్కారీ బడుల్లో బోధనా నాణ్యత పెంపుపై ప్రభుత్వాలు దృష్టిసారించాలి. లేకపోతే, నిస్సహాయ కుటుంబాల చిన్నారులకు ఇంకా అన్యాయం చేసినట్టవుతుంది. ఏ దేశమైనా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే చదువే ఆలంబనవుతుంది. ఇదిలా ఉంటే విద్యలో నాణ్యత సన్నగిల్లుతున్నది. పిల్లలు విద్యను ఎంతవరకు నేర్చుకుంటున్నారనే విషయాన్ని తెలిపే నిరుటి వార్షిక నివేదిక ప్రకారం.. దేశీయంగా ఐదో తరగతి విద్యార్థుల్లో సగం మందే రెండో క్లాసు పాఠాలు చదువుతున్నారు. అంటే విద్యలో నాణ్యత పెంచవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఎంతమేర ఉన్నదో అర్థం చేసుకోవాలి.ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 43,154 పాఠశాలల్లో, దాదాపు ప్రధాన భాగమైన 30 వేల పాఠశాలలు ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. కనీసం వీటినైనా కాపాడుకోవాలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఇప్పటికైనా పాఠశాలల మూసివేత దిశగా అడుగులు వేయకుండా ‘ప్రభుత్వ బడుల్లో విద్య’ అనే అంశంపై గ్రామీణ ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చేర్పించేటట్టుగా తల్లిదండ్రులను కార్యోన్ముఖులను చేయాలి. ప్రభుత్వం, ప్రజల సమన్వయంతోనే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయని ఆశిద్దాం.
(వ్యాసకర్త: విశ్రాంత ప్రధానాచార్యులు)
సీవీవీ ప్రసాద్
8019608475