రజతోత్సవ సభ జరిగినచోటే విజయోత్సవ సభ జరుపుకుందాం. రాజీలేని వీరుడిని శాశ్వత విజేతగా నిలబెడదాం. ద్రోహులను పాతాళంలోకి అణగద్రొక్కుదాం. బాపును పరాజితుడిగా చరిత్రలో నిలబెట్టాలన్న ముప్పేట ముట్టడిని మట్టుబెట్టి నాలుగు కోట్ల గుండెల్లో విజయకేతనం ఎగరేసిన కారణజన్ముడిని కాపాడుకుందాం. తెలంగాణ పదాన్ని నిషేధించినవాడికి తెలంగాణలో స్థానం లేకుండా చేశాడు.
రాజకీయ ప్రక్రియ – ఉద్యమం – రెంటినీ సమాంతరంగా నడిపించాడు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచాలనుకున్న వలస పాలకులకు అవకాశం ఇవ్వకుండా సత్యాగ్రహం అనే మహాత్ముడి మార్గాన్ని ఎంచుకుని బాపు కేసీఆర్ తెలంగాణ మహాత్ముడయ్యాడు. అందుకే ఆయన తెలంగాణ బాపుగా జనం నోళ్ళలో ఉన్నాడు. రక్తంబొట్టు చిందకుండా తెలంగాణను విముక్తి చేస్తానన్న తన బాసను నిలుపుకున్న బాపు కేసీఆర్ నిజంగా మనతెలంగాణ జాతికి బాపే !
తెలంగాణ గడ్డకు, తెలంగాణ బిడ్డలకు కాంగ్రెస్ చేసిన గాయాలు చెబితే ఒడిసిపోయేదికాదు. విలీనకాలం నుండి మొదలైన కాంగ్రెస్ రక్తదాహం తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా కొనసాగింది. వందలాది మంది చావుకు కారణమైంది. ఇవన్నీ గుణపాఠంగా తీసుకున్న బాపు కేసీఆర్ రాజ్యాంగబద్ధంగా ఉద్యమం నడిపించాడు. పోరాటాన్ని పల్లెల్లోకి పాకించి, పల్లెప్రజల్లో చైతన్యం తెచ్చాడు. సాంస్కృతిక కార్యక్రమాలతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని పల్లెప్రజలకు అర్థమయే రీతిలో కళ్ళకు కట్టినట్టుగా వివరించాడు. బాపూ తనయ కవితక్క మన తెలంగాణ బతుకమ్మను ఒక పోరాట రూపంగా ఎంచుకుంది. ఇలా.. అన్నిరంగాల్లోకి తెలంగాణ ఉద్యమం చొచ్చుకు పోయింది. శత్రువు చేష్టలుడిగి చూస్తుండగా తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం బాపు కేసీఆర్ను తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది.
బాపు కేసీఆర్ ఉప ఎన్నికలను ఒక ఆయుధంగా మలిచాడు. వలసవాద పార్టీలను మట్టికరిపించాడు. ప్రజలు గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాడు. జనరంజక పాలన అందించాడు. తమ దోపిడికి అడ్డుకట్ట వేసినందుకు వలస దోపిడిదారులు పగతో రగిలిపోయారు. ఆరునెలలకే ప్రభుత్వాన్ని కూలదోయ జూశారు. అపరచాణక్యుడైన బాపు కేసీఆర్ ముందు వాళ్ళ ఆటలు సాగలేదు.
2023 ఎన్నికల్లో దొంగలంతా ఏకమయ్యారు. డబ్బుల సంచుల వరద పారించారు. తమకున్న మీడియా ఆధిపత్యం ద్వారా బాపుపై దుష్ప్రచారం సాగించారు. అనేక కుట్రలు, కుతంత్రాలతో కేవలం ఒక శాతం ఓట్ల తేడాతో ఓడించారు. వాళ్ళ ఏజెంట్లను గద్దెనెక్కించారు. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ బాపు కేసీఆర్ను గెలిపించడానికి ప్రజలు తహతహలాడుతున్నారు. బాపు కేసీఆర్ విజేతగానే చరిత్రలో మిగిలి పోవాలి. తెలంగాణ సమాజం ఉన్నంతవరకు బాపు కేసీఆర్ చరిత్ర ఉంటుంది. వరంగల్ రజతోత్సవంతో పార్టీకి పునర్వైభవం సాధించు విజయదుందుభి మోగిద్దాం.. జనజాతరను కళ్ళారా చూద్దాం పద.
జై తెలంగాణ… జై బాపు కేసీఆర్…
– మంత్రి శ్రీదేవి